2009, డిసెంబర్ 23 తెలంగాణకొక దుర్దినం. స్వరాష్ట్ర సాధనోద్యమకారుల కండ్లల్లో ఆనందం ఆవిరైన రోజు. వందల మంది యువత బలిదానాలకు కారణమైన మరణ శాసనాన్ని కాంగ్రెస్ లిఖించిన రోజు. కేంద్రం నోటి వెంట తెలంగాణ ప్రకటన వెలువడిన డిసెంబర్ 9 విజయ్ దివస్ కానీ, రెండు వారాలకే ఆ ప్రకటనను వెనక్కి తీసుకొని తెలంగాణకు వెన్నుపోటు పొడిచిన డిసెంబర్ 23 కాంగ్రెస్ ధోకా దివస్. అది నేడే.
ఆరు దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారి 2009, డిసెంబర్ 9న కేంద్రం సాధికారికంగా తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసింది. కేసీఆర్ నాయకత్వంలో పదేండ్ల పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బహు ముఖాలుగా సాగిన పోరాటం, ఆమరణ నిరాహార దీక్ష, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన విస్ఫోటనం, త్యాగాలు, బలిదానాలు ఒకటా రెండా ఎన్నో ఉద్వేగభరిత సన్నివేశాలు ఆ ప్రకటనకు నేపథ్యమై, అనివార్యమై నిలిచాయి. ఆ రోజు తెలంగాణకు పండుగ రోజు. వ్యతిరేక శక్తులకు మాత్రం కడుపు మండిన రోజు. శత్రుమూకలన్నీ ఒక్కటై కత్తులు దూసిన రోజు.
డిసెంబర్ 10 తెల్లారేసరికి దృశ్యం మారిపోయింది. తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు మడమతిప్పి, మాట తప్పి తెలంగాణ ఏర్పాటు ప్రకటనను వ్యతిరేకించారు. ఆంధ్ర ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామాలు చేశారు. అంతవరకూ తెలంగాణపై కపట ప్రేమ ఒలకబోసిన కాంగ్రెస్, టీడీపీలు ముసుగులు తొలగించి ఒక్కటై సమైక్యాంధ్ర నినాదం పూరించాయి. విజయవాడ బంద్ జరిగింది. అంతవరకూ లేని ప్రత్యేక రాయలసీమ పోరాటం కర్నూల్లో ప్రారంభమైంది. కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. డిసెంబర్ 11న కేంద్ర హోంశాఖ కార్యదర్శి జీకే పిళ్ళై హైదరాబాద్ తెలంగాణదేనని ప్రకటించారు. ఇంకేముంది తెలంగాణ వ్యతిరేకశక్తుల కండ్లు నిప్పులు కురిశాయి. అప్పటి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజీనామా సమర్పించారు.
టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముందు ధర్నా చేశారు. తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం తమిళుడు కనుక ఆ కోపంతో కండలేరు, తెలుగు గంగ ద్వారా చెన్నై వెళ్లవలసిన తాగునీటి సరఫరా బంద్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి షకీల్ అహమ్మద్ కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ ప్రకటన చేయాల్సి వచ్చిందని అసలు కారణం వెల్లడించారు. అటు లోక్‌సభలో సమైక్య నినాదాలు మార్మోగాయి. వైఎస్సార్సీపీ నేత జగన్మోహన్ రెడ్డి సమైక్యవాదానికి జై కొట్టారు. అంతవరకు తెలంగాణకు మద్దతిస్తూ వచ్చిన చిరంజీవి సమైక్య రాష్ట్ర నినాదం ఎత్తుకొని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
సినీ నటులు మంచు మోహన్ బాబు, నందమూరి హరికృష్ణ తెలంగాణకు వ్యతిరేకంగా బహిరంగ ప్రకటనలు చేశారు. టీడీపీ నేత కోడెల శివప్రసాద్, కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆమరణ దీక్ష ప్రారంభించారు. అరెస్టయి విజయవాడ ఆసుపత్రిలో దీక్షలో ఉన్న లగడపాటి రాజగోపాల్ రాత్రికి రాత్రి తప్పించుకొని హైదరాబాద్ చేరుకొని పరిగెత్తుకుంటూ నిమ్స్ ఐసీయూ పడక మీదికి చేరుకోవడం అప్పట్లో పెను సంచలనం.
వారం రోజులుగా నిరాహారదీక్షలో ఉన్న వ్యక్తి ఒలింపిక్స్ స్థాయిలో పరుగు లంకించుకోవడం డాక్టర్లకే అంతు పట్టలేదు. ఆంధ్ర ప్రాంత ఉత్తుత్తి ఉద్యమం, పక్షపాత మాధ్యమాల మాయాజాలం పలు నిఘా వ్యవస్థలు కలిగి ఉన్న కేంద్రంలోని పెద్దలకు తెలియనిది కాదు. ఆ మిషతో కమిటీలు, కమిషన్లు, ప్యాకేజీలంటూ తెలంగాణ ఏర్పాటు కాలయాపన చేస్తే సమస్య తెరమరుగవుతుందని భావించారు. కేసీఆర్ ఉద్యమ నాయకత్వ పటిమను, ప్రజల చైతన్యస్థాయిని తక్కువగా అంచనా వేసిన కేంద్రం ఆ దిశగా డిసెంబర్ 22న కొత్త రాగం ఎత్తుకున్నది. తెలంగాణ ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రకు పోలవరం, రాయలసీమకు పీసీసీ చీఫ్ తాయిలాలను ప్రతిపాదించింది.
కేసీఆర్ దీక్ష విరమణకు రెండు రోజుల ముందు అంటే డిసెంబర్ 7న ముఖ్యమంత్రి రోశయ్య నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అధికారపక్షం కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ, ప్రజారాజ్యం తెలంగాణ ఏర్పాటును ఆమోదించి తీరా కేంద్ర హోం మంత్రి చిదంబరం రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేశాక ఎదురుతిరిగారు. ఎంఐఎం తప్ప, టీఆర్ఎస్ సహా మిగతా పార్టీలు తెలంగాణకు మద్దతుగా నిలిచాయి. కాంగ్రెస్, టీడీపీ 48 గంటల్లోనే స్వరం మార్చడంతో తెరవెనుక ఏదో కుట్ర జరుగుతున్నదన్న ఉద్యమకారుల అనుమానం నిజమైంది. 23న అదే చిదంబరం కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రకటన చేస్తూ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు విస్తృత చర్చలు జరపాలంటూ, రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదంటూ వాయిదా వేశారు. తెలంగాణ వ్యతిరేక సైంధవ మూకలు తెలంగాణ ఏర్పాటు జాప్యం చేయడంలో తాత్కాలిక విజయం సాధించాయి. ఆంధ్రాలో కృతక కుటిల సమైక్య ఉద్యమం ఆగిపోయింది.
చిదంబరం తొలి, మలి ప్రకటనల మధ్య 14 రోజులు ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్, టీడీపీలు సిద్ధాంతాలు, వైరుద్ధ్యాలు, వాగ్దానాలు పక్కన పెట్టి తెలంగాణ వ్యతిరేక శిబిరంలో చేతులు కలిపాయి. విజయవాడలో దీక్ష చేస్తున్న లగడపాటి రాజగోపాల్‌ను టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ముద్దుపెట్టి సంఘీభావం తెలపడం సంచలనం సృష్టించింది. ఇక తానొక్కడినే సమైక్య రాష్ట్ర పరిరక్షకుడినన్నట్టు చిరంజీవి వ్యవహరించారు. మంచు మనోజ్ సినిమా షూటింగ్‌ను అడ్డుకున్న సందర్భంలో ఆయన తండ్రి మోహన్‌బాబు తెలంగాణ ఉద్యమకారులను రౌడీలతో పోల్చారు. ‘మీరు పది మంది ఉంటే మేం పది వేల మందిమి, హైదరాబాద్ శ్మశానం అవుతుంద’ని కేసీఆర్‌ను బెదిరించారు.
దీక్ష విరమణ తర్వాత కోలుకొని డిసెంబర్ 17న తొలిసారిగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ వ్యతిరేకులపై నిప్పులు చెరిగారు. ‘హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం. హైదరాబాద్ గురించి మాట్లాడితే నాలుక కోస్తా’ అని తీవ్రస్వరంతో హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం దేనికైనా, ఎంతదాకా అయినా తెగించడానికి సిద్ధమేనన్నారు.
రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ తొందరగా పూర్తిచేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, బీఎస్పీ అధినేత్రి మాయావతి వంటి జాతీయ నేతలు చిన్న రాష్ర్టాల ఏర్పాటుకు మద్దతు పలికారు. ఆంధ్ర ప్రాంత సమైక్య ఉద్యమాన్ని చూసి తట్టుకోలేక ఎల్బీనగర్కు చెందిన న్యాయవాది దయాకర్ రెడ్డి, మెదక్ జిల్లా కొండపాకకు చెందిన కన్నబోయిన ఐలయ్య, నిజామాబాద్ జిల్లా మాకులూర్కు చెందిన పి.గంగాధర్ అనే కానిస్టేబుల్ బలిదానాలకు పాల్పడ్డారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన దళిత బహుజన మేధావులు, ప్రజాస్వామ్యవాదులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సంపూర్ణంగా స్వాగతించారు. ఓ రెండు ప్రధాన పచ్చ మీడియా సంస్థలు మాత్రం సమైక్యవాద ఉద్యమాన్ని భూతద్దంలో చూపించి తెలంగాణ వాదాన్ని తెరమరుగు చేయడానికి విఫల ప్రయత్నం చేశాయి.
కేంద్రం అధికారికంగా ఒక రాష్ట్ర ఏర్పాటు ప్రకటించి రెండు వారాలకే ఉప సంహరించుకోవడం ఒక్క తెలంగాణ విషయంలోనే జరిగింది. ఆ ఘోరమైన చారిత్రక నేరానికి పాల్పడింది ముమ్మాటికీ కాంగ్రెస్సే. తెలంగాణ ప్రకటన వెనక్కి తీసుకున్న 2009 డిసెంబర్ 23 నుంచి పార్లమెంటులో బిల్లు అంతిమంగా ఆమోదం పొందిన 2014 ఫిబ్రవరి 20 వరకు యావత్ తెలంగాణ సమాజం కనీవినీ ఎరుగని పోరాటం చేసింది. ఆ క్రమంలో యువకుల బలిదానాలు ప్రపంచాన్ని కుదిపివేశాయి. వెల్లువెత్తిన వేల పోరాట రూపాలు ఉద్యమాల చరిత్రలో కొత్త అధ్యాయాలు లిఖించాయి.
2004 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చేసిన వాగ్దానం ప్రకారం వెంటనే తెలంగాణ ఇచ్చి ఉంటే ఒక దశాబ్దకాల సంక్షోభం తలెత్తేది కాదు. కనీసం కేసీఆర్ దీక్ష పర్యవసానంగా డిసెంబర్ 9న కేంద్రం ప్రకటించినట్టుగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ యథావిధిగా కొనసాగించి ఉంటే యువకుల బలిదానాలుండేవి కావు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన వారు చనిపోయేముందు రాసిన లేఖల్లో వాంగ్మూలాల్లో కాంగ్రెస్‌ను మాత్రమే దోషిగా, ద్రోహిగా పేర్కొన్న ఉదంతాలు చరిత్రలో నమోదయ్యాయి. తెలంగాణ ఇచ్చింది తామే అంటున్న కాంగ్రెస్ నేతల చేతి వేళ్లకంటిన అమరుల నెత్తుటి మరకలు చెరిపేస్తే చెరిగిపోయేవి కావు. నాటి విలాపాల, విషాదాల వలపోతలో ఒక దుర్దినంగా నిలిచిన డిసెంబర్ 23 వచ్చిందంటే తెలంగాణ ఉద్యమకారుల కడుపులో పేగు కదలినట్టయితది.
– డాక్టర్ అయాచితం శ్రీధర్ 98498 93238