సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల ప్రసంగం చూసిన తర్వాత అర్థమయ్యే విషయం ఏందంటే, కొంతకాలంగా ఆయన కేసీఆర్, కేసీఆర్ కుటుంబం, బంధువులపై అసెంబ్లీలో ఏకపక్షంగా చేసిన ప్రసంగాల దాడికి కొనసాగింపు మాత్రమేనని స్పష్టమవుతున్నది. ఒక ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చే సందేశంలా కాకుండా ఎన్నికల ముందు అధికారపక్షంపై ప్రతిపక్షం చేసే దాడిలా కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం మీద ఆరోపణలతో ప్రసంగం మొదలుపెట్టి ప్రజలకు తామరతంపరగా వాగ్దానాలు గుప్పించే వారు. ప్రస్తుతం ఆయన ప్రసంగం ప్రజలకు చేసిన వాగ్దానాలు ప్రక్కన పెట్టి, కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం గురించి, కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం గురించి, ఆయన కుటుంబసభ్యులు, ఆఖరికి ఆయన సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తల ఆస్తులు గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. ఇదేనా పాలన..?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావొస్తున్నది. కానీ సీఎం మాత్రం మచ్చుకు కూడా వాగ్దానాల గురించి మాట్లాడటంలేదు. ప్రజాసమస్యలను ప్రస్తావించడంలేదు. కేవలం డైవర్షన్ రాజకీయాలతో కాలం గడుపుతున్నారు. ప్రసంగితలేని ప్రసంగాలుగా ముఖ్యమంత్రి మాటలు రోజురోజుకు తేలిపోతున్నాయి. బుధవారం నాటి సిరిసిల్ల సభలో కూడా, కరువు కాలంలో రాష్ర్టానికి వరప్రదాయినిగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్ల రూపాయల అవినీతి పథకం అంటూ ఆరోపించడం వెనుక ఆంతర్యం ఏందో! తెలంగాణ నీటి వినియోగంలో గత్యంతరం లేక పెద్ద ప్రణాళికతో లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం గురించి పాత, కొత్త అభివృద్ధి సమన్వయకర్తగా ముఖ్యమంత్రి నోటి నుంచి రావాల్సిన విమర్శ ఎంత మాత్రమూ కాదు. లక్ష కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టని ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతి జరిగిందని అనడంలోనే ఇది ఎంతటి అసంబద్ధమైన ఆరోపణనో అర్థం చేసుకోవచ్చు. ప్రజలు ఇదంతా గమనిస్తారనే కనీస ఆలోచన కూడా వదిలేసి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పదేపదే అలా మాట్లాడడం దారుణం. రేవంత్‌రెడ్డి తన ప్రసంగం ద్వారా ప్రజల దృష్టిలో తనను తాను దిగజార్చుకోవడమే లక్ష్యంగా ప్రసంగాలు చేస్తున్నట్టు కనిపిస్తున్నది.
గత ఎన్నికల ముందు కేసీఆర్, కేసీఆర్ కుటుంబం ఫామ్‌హౌస్‌లు అంటూ మాట్లాడిన తీరులోనే మూడేండ్ల తర్వాత ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు అదేపాట పాడడం ఆశ్చర్యంగా ఉన్నది. కేసీఆర్ ఫామ్‌హౌస్ ఆయన వ్యవసాయ వృత్తి నిబద్దతకు నిదర్శనం. ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఫామ్‌హౌస్ గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ చేసిన అభివృద్ధి గురించి తెలియక మాట్లాడుతున్నారా? తెలిసి కూడా ఆ విషయం నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం మాట్లాడుతున్నారా? 70 ఏండ్ల సమైక్య పాలనలో జరుగని అభివృద్ధిని, ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ చేసి చూపించారు.
కేసీఆర్ పాలనలో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. పట్టణాలు ప్రగతిబాటలో పయనించాయి. తెలంగాణ అంతటా మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించారు. మిషన్ కాకతీయతో చెరువులు మరమ్మత్తులు చేయించారు. కేసీఆర్ సాగునీటి ప్రణాళికతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతుల మనసులో బలమైన ముద్ర వేసుకున్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో పథకాలు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందాయి. రైతుబంధు పథకం స్ఫూర్తితోనే కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించడం మొదలుపెట్టింది.
కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. జాతీయ స్థాయిలో ఆ గుర్తింపు నేటికీ చర్చకు వస్తున్నది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా, కాంగ్రెస్ నేతలు అభివృద్ధిని విస్మరించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. సిరిసిల్ల సభలో రేవంత్‌రెడ్డికి అటు ఇటు నిల్చున్న మంత్రులకు గతంలో బీఆర్ఎస్లోనే ఉన్నారు. వారికి కూడా తెలియదా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెప్పుకోదగిన పథకం ఒక్కటైనా ఉన్నదా? ఏమీ చేయకపోవడం వల్లనే డైవర్షన్ పాలిటిక్స్ అనుసరిస్తున్నారా? అనే అనుమానం కలుగుతున్నది.
కొత్త జిల్లాల ఏర్పాటు నుంచి సమగ్ర పరిపాలనా కార్యాలయాలు, మున్సిపల్ ఆఫీస్‌ల నిర్మాణం, హైదరాబాద్ వేదికగా తెలంగాణ ఇమేజ్ను నిలబెట్టేలా కేసీఆర్ నిర్మించిన అద్భుతమైన సచివాలయం, అంబేద్కర్ భారీ విగ్రహం, అమరవీరుల స్మారక భవనం, ప్రగతి భవన్, యాదాద్రి దేవాలయం అభివృద్ది ఇవన్నీ ప్రజలకు తెలిసినవే. అయితే ఇలాంటి అభివృద్ధి చేసిన కేసీఆర్ నుంచి ప్రజల దృష్టి మరల్చే ఉద్దేశంతోనే అసంబద్ధమైన ఆరోపణలు చేయడమే కాంగ్రెస్ నేతలు పనిగా పెట్టుకున్నట్టు కనబడుతున్నది. సిరిసిల్లలో రేవంత్‌రెడ్డి ప్రసంగం ఇందుకు తాజాగా ఉదాహరణగా నిలుస్తున్నది. ప్రజలు మూడేండ్ల కాంగ్రెస్ పాలన తర్వాత కేసీఆర్ అబివృద్ధితో బేరీజు వేసుకొని చూస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల నుంచి విమర్శలు, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటి నుంచి చర్చను పక్కదారి పట్టించేందుకు ఫామ్‌హౌస్, కాళేశ్వరం అని పదేపదే విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి కథలు వినిపించడం తప్ప కాంగ్రెస్‌కు మరో గత్యంతరం లేనట్టు కనబడుతున్నది. దీన్నే అసంకల్పిత రాజకీయ ప్రయోజనాల మార్మిక కళాప్రక్రియ అనికూడా అంటారేమో! వాగ్దానాలు మరచి.. పనికిరాని ప్రసంగాలు చేస్తున్న కాంగ్రెస్ తీరును ప్రజలు గమనిస్తున్నారు.
-ఎన్.తిర్మల్ ,9441864514