రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన కంటే రాజకీయ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నదన్న విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కంటే వ్యక్తిగత, రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నదా? అనే సందేహం బలపడుతున్నది. సాగునీరు, వ్యవసాయం, విద్య, ఆర్థిక వ్యవస్థ, ఎన్నికల హామీల అమలు, పార్టీ సమన్వయం వంటి కీలక అంశాల్లో స్పష్టమైన దిశ కనిపించడం లేదు. కాళేశ్వరం జలాల వినియోగం, రియల్ ఎస్టేట్ మందగమనం, గురుకులాల నిర్వహణ, పాఠశాలల పునర్వ్యవస్థీకరణ, ఉద్యమకారులకు హామీల అమలులో జాప్యం వంటి అంశాలు ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
తెలంగాణ ఉద్యమ సమయంలో భూములు, జీవనోపాధి కోల్పోయిన వారికి భూమితోపాటు పెన్షన్ అందిస్తామని ఇచ్చిన హామీ అమలుపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం ఉద్యమకారుల్లో అసంతృప్తిని పెంచుతున్నది. ఇందుకోసం ఒక కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ, దాని పరిధి, కాలపట్టిక, అమలు విధానంపై ప్రభుత్వం స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. ఈ అంశాన్ని పరిశీలించే కమిటీకి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని చైర్మన్‌గా నియమించారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
రాజకీయ సమీకరణాలకు ప్రాధాన్యం ఇచ్చారనే భావన ప్రభుత్వం మీద మరింత ప్రతికూల ప్రభావం చూపుతున్నది. ఉద్యమ బాధితులకు న్యాయం చేయడంలో జరుగుతున్న తీవ్ర జాప్యం వారిని మరింత నిరాశకు గురిచేస్తున్నది. ఉత్తర తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు నీరు అందించాలని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
విశ్రాంత ఇంజినీర్లు కన్నెపల్లి నుంచి పరిమిత స్థాయిలో నీటిని ఎత్తిపోయడం సాధ్యమేనని చెప్తున్నప్పటికీ ప్రభుత్వం ముందుకు రావడం లేదని విమర్శలు ఉన్నాయి. మరోవైపు, మేడిగడ్డ బరాజ్ ఘటన తర్వాత ఎన్డీఎస్ఏ, నిపుణుల కమిటీలు భద్రతా సమీక్ష అవసరమని సూచించాయి. కానీ బరాజ్ పూర్తిస్థాయి వినియోగించాలంటే ముందుగా బరాజ్‌కు మరమ్మతులు అవసరమని సర్కార్ మొండిగా వాదిస్తున్నది.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోళ్లు తగ్గడం, పెట్టుబడిదారుల జాగ్రత్త ధోరణి, అధిక వడ్డీ రేట్లు, అనిశ్చిత మార్కెట్ పరిస్థితులు నిర్మాణ రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ గణాంకాలు,
పరిశ్రమ వర్గాల వ్యాఖ్యలు కూడా ఈ మందగమనాన్ని సూచిస్తున్నాయి.
దీనికి రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో స్థిరత్వం లేకపోవడం, అనుమతుల ప్రక్రియలో ఆలస్యం, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడంలో లోపాలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ వ్యయం పెరుగుతున్న కొద్దీ అభివృద్ధి, వ్యయంపై ఒత్తిడి పెరుగుతున్నదనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన హామీలేవీ నేటికీ నెరవేరలేదు. ప్రభుత్వం ఆర్థిక పరిమితులు, పరిపాలనా కారణాలను వివరిస్తున్నా ప్రజలు మాత్రం స్పష్టమైన కాలపట్టికను కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల పునర్వ్యవస్థీకరణ అంశం కూడా ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నది. ప్రభుత్వం యూడైస్+ గణాంకాల ఆధారంగా విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలలను విలీనం చేస్తామని చెప్తున్నది. అయితే సర్కార్ తీరుతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఇబ్బందులు పెరుగుతాయని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. గ్రామాల్లో విద్యా సౌకర్యాలు దూరమవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. గురుకుల విద్యాసంస్థల నిర్వహణపై కూడా పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గురుకులాలు సామాజిక న్యాయానికి ప్రతీకలుగా భావించే నేపథ్యంలో వాటి నిర్వహణలో నిర్లక్ష్యం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నది. గురుకులాల్లో విద్యార్థుల భద్రత, మౌలిక వసతులు, పరిపాలనా లోపాలపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ నిలదీస్తున్నాయి.
ప్రభుత్వంపై వస్తున్న ప్రధాన విమర్శల్లో ఒకటి మంత్రివర్గంలో సమన్వయం కొరవడుతున్నది. ప్రభుత్వ పథకాల అమలు, నిధుల కేటాయింపులో సీఎం, మంత్రులు పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు ఆ పార్టీ నేతలే రాష్ట్ర నాయకత్వంపై భిన్న సంకేతాలు ఇవ్వడం ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నది. ముఖ్యమంత్రి మార్పుపై జరుగుతున్న ప్రచారం, కొందరు నేతల బహిరంగ వ్యాఖ్యలు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శలు, మంత్రి కొండా సురేఖఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య జరిగిన ఆరోపణలు పార్టీ క్రమశిక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ముఖ్యమంత్రి ఇటీవల పలు సభలు, సమావేశాల్లో చేసిన రాజకీయ ప్రసంగాలు కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. పాలనకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి మార్గాలను వెల్లడించకుండా, ఎప్పుడూ ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజలు రాజకీయ విమర్శల కంటే తమ సమస్యలకు పరిష్కారాలను ఆశిస్తున్నారనే విషయాన్ని పాలకులు మరచిపోతున్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం సంక్షేమం, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు అదే దిశలో సాగుతున్నాయా అనే చర్చ కూడా నడుస్తున్నది. ప్రభుత్వం తనపై వస్తున్న విమర్శలను కేవలం రాజకీయ ఆరోపణలుగా కొట్టిపారేయకుండా, వాస్తవాల ఆధారంగా సమీక్షించుకొంటే నిజాలు వెలుగులోకి వస్తాయి. ప్రజలకు కావలసింది రాజకీయ నినాదాలు కాదు; ఫలితాలిచ్చే సమర్థమైన పాలన.
– సీహెచ్‌వీ ప్రభాకర్‌రావు 93915 33339