రాష్ట్రంలో ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ మార్క్ అవినీతి, అరాచక పాలనకు కౌంట్‌డౌన్ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒంటెత్తు పోకడలపై సొంత గూటిలోనే అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. రేవంత్‌రెడ్డి అసమర్థ, ఏకపక్ష పాలనపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలే బహిరంగంగా తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఇంకా రెండున్నరేండ్ల పాలన మిగిలి ఉండగానే కాంగ్రెస్‌ను రేవంత్‌రెడ్డి నిండా ముంచారని నిప్పులు చెరుగుతున్నారు.
రేవంత్‌రెడ్డి పాలన తీరుపై మంత్రిమండలిలోనే తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా సాగాల్సిన క్యాబినెట్లో అరాచకం రాజ్యమేలుతున్నదని మంత్రులు మండిపడుతున్నారు. తమకు కనీస గౌరవం లేదని, తమ సొంత శాఖల్లో ముఖ్యమంత్రి, ఆయన నీడలాంటి నాయకులు, అధికారులు విపరీతంగా జోక్యం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్‌కు, ఆయన మంత్రులకు మధ్య గ్యాప్ ఎంతలా పెరిగిపోయిందంటే.. ప్రభుత్వ అధికారిక ప్రకటనలు, జీవోలు, ప్రచార పోస్టర్లలో కనీసం సంబంధిత శాఖల మంత్రుల ఫొటోలను కూడా మాయం చేసే స్థాయికి చేరింది.
రేవంత్‌రెడ్డి అహంకారపూరిత పాలనను కాంగ్రెస్ అధిష్ఠానం పట్టించుకోవడంలేదు. ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం నేపథ్యంలో అసంతృప్త నాయకులు చేస్తున్న వాదనను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అర్థం చేసుకుంటున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఆ మేరకు ఢిల్లీలో కూడా పరిణామాలు సీఎంకు వ్యతిరేకంగానే మారుతున్నాయి. మంత్రులను ఆయన ఎంతలా అవమానిస్తున్నారో చెప్పడానికి తాజా పరిణామాలే నిదర్శనం. తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా, దేవాదాయశాఖ పరిధిలోని యాదాద్రి బోర్డును ముఖ్యమంత్రి ఏకపక్షంగా ఏర్పాటు చేశారు. తీవ్ర అవమానానికి గురైన సంబంధితశాఖ మంత్రి కొండా సురేఖ ఏకంగా క్యాబినెట్ భేటీకే డుమ్మా కొట్టి తన నిరసనను వ్యక్తం చేశారు. ‘సంబంధిత మంత్రి కొండా సురేఖకు తెలియకుండా, యాదాద్రి బోర్డు సభ్యులను ఎలా నియమిస్తారు?’ అంటూ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులే రేవంత్‌రెడ్డిపై ప్రశ్నాస్ర్తాలు సంధిస్తున్నారు.
మరోవైపు, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏకంగా క్యాబినెట్ సమావేశంలోనే రేవంత్‌రెడ్డిని గట్టిగా నిలదీశారు. తెలంగాణను దోచుకోవడానికే తెచ్చినట్టున్నదని మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సాగునీటి ప్రాజెక్టుల అంచనాలకు సంబంధించిన కీలక ఫైళ్లను ముఖ్యమంత్రి కార్యాలయం కావాలనే ఎందుకు తొక్కిపెడుతున్నదని, ప్రాజెక్టులకు నిధులు ఎందుకు ఆపుతున్నారంటూ రేవంత్‌రెడ్డిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం కాంగ్రెస్ అంతర్గత కలహాలను మరోసారి బహిర్గతం చేసింది.
ప్రభుత్వంలో ప్రజాసంక్షేమం శూన్యమని, కేవలం పబ్లిసిటీ స్టంట్లు, షోఆఫ్లు ఎక్కువయ్యాయని ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పలుమార్లు తీవ్ర అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారు. క్షేత్రస్థాయిలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటే.. రేవంత్‌రెడ్డి ఏమాత్రం పట్టించుకోకుండా డ్రామాలు ఆడుతున్నారని సొంత పార్టీలోనే చర్చ నడుస్తున్నది. ఉత్తరతెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సైతం రేవంత్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కోసం ప్రాణాలకు తెగించి కష్టపడి, ఎన్నో కేసులు ఎదుర్కొన్న నాయకులు, కార్యకర్తలను వదిలేసి, రేవంత్‌రెడ్డి లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. గతంలో టీడీపీలో ఉన్న పాత నాయకులకు, బీజేపీ ఎమ్మెల్యేలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ బొజ్జు తీవ్రంగా మండిపడ్డారు.
రాష్ట్రంలో పరిపాలన అట్టడుగుకు చేరింది. ఆర్థిక వ్యవస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆరు గ్యారెంటీల అమలు ఊసే ఎత్తడం లేదు, రైతుభరోసా సరిగా ఇవ్వడం లేదు, రైతులకు రుణమాఫీ పూర్తిస్థాయిలో కాలేదు, రైతు బీమా పథకం అమలవుతున్నదో లేదో తెలియడంలేదు. ఊరూరా తిరిగి ప్రచారం చేసి, తమ తల్లిదండ్రులను సైతం ఒప్పించి, పార్టీని అధికారంలోకి తెచ్చిన నిరుద్యోగులకు సర్కార్ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. కనీసం వృద్ధులకు ఆసరా పింఛన్లు కూడా పెంచడం లేదు. మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు నమ్మించి మోసం చేశారు. అబద్ధపు ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని సబ్బండ వర్ణాల ప్రజలు సమరశంఖం పూరిస్తున్నారు. బంగారు తెలంగాణ దిశగా పరుగులు తీస్తున్న తెలంగాణను పడావు పెట్టేందుకే కాంగ్రెస్ గెలిచినట్టున్నదని నిప్పులు చెరుగుతున్నారు. మోసపోయి గోసపడుతున్నామని, కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా తరిమికొట్టాల్సిందేనని చెప్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, వృద్ధులు, ఆటో డ్రైవర్లు, కార్మికులు, ఇలా ఎవరిని కదిలించినా కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సొంత పార్టీ నేతలే రేవంత్‌రెడ్డిపై తిరుగుబాటు చేస్తున్నారు. అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలోనే ఇంతటి తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్న ముఖ్యమంత్రి దేశ చరిత్రలోనే మరొకరు లేరని, గతంలో కాంగ్రెస్ జెండా మోసిన మేధావులు సైతం చెప్తున్నారు.
ఖాకీల వెనుక, ఢిల్లీ బాసుల వెనుక దాక్కుని ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకోవాలని చూస్తున్న రేవంత్‌రెడ్డికి.. సొంత పార్టీ నేతలే రివర్స్ అవుతున్నారు. అటు ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇటు సొంత పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య అవినీతి, అరాచక పాలన అంతం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రజా కంటక పాలనపై బీఆర్ఎస్ రాజీలేని పోరాటం మరింత ఉధృతం చేస్తున్నది. ప్రజల పక్షాన నిలబడి ఉద్యమిస్తున్న గులాబీ పార్టీ రానున్న ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అరాచక రేవంత్ అనుసరిస్తున్న దుర్మార్గ పాలన పతనానికి రోజులు దగ్గర పడ్డాయని, కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ మొదలైందని తెలంగాణలో సర్వత్రా వినిపిస్తున్న మాట.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ)
– తక్కెళ్లపల్లి రవీందర్రావు