తెలంగాణ పౌర సరఫరాల శాఖ అలసత్వం కారణంగా రేషన్ బియ్యంపై ఆధారపడే పేదలు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు, ధాన్యం అమ్ముకునే రైతులు నానా యాతనలు పడుతున్నారు. ధాన్యం సేకరణ పేరుతో గతేడాది వందల కోట్ల అవినీతి జరిగింది. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించటానికి.. క్వింటాల్‌కు రూ.2,100కు కొనుగోలు చేయటానికి మిల్లర్లు సుముఖత చూపించినప్పటికీ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలిచింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, పౌరసరఫరాల శాఖ మంత్రి నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం జరుగుతున్నది.
ధాన్యం సేకరణలో గ్లోబల్ టెండర్ల పేరుతో తమకు నచ్చిన కంపెనీలకే టెండర్లు వచ్చే లా చేసిన ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన సంస్థలను సైతం మళ్లీ ధాన్యం సేకరణకు అనుమతిస్తున్నది. ఈ కంపెనీలు ధాన్యం సేకరణలో తప్ప, ఇతర ఆర్థిక విషయాల్లో తలదూర్చకూడదు. కానీ, ఈ కంపెనీలు నేరుగా రైస్ మిల్లర్లతో సంప్రదింపులు చేపడుతున్నాయి. వాళ్ల మాట వినకపోతే గోదాముల్లోని ధాన్యాన్ని సేకరించమని బెదిరింపులకు పాల్పడుతున్నాయి. తక్కువ ధరకు కోట్ చేసిన ఈ కంపెనీలు రైస్ మిల్లర్లు ఎక్కువ చెల్లించాలని, పౌర సరఫరాల శాఖలో అత్యున్నత వ్యక్తులు తమకు తెలుసునని చెప్పుకొంటున్నాయి.
ఇదంతా పౌర సరఫరాల శాఖ కనుసన్నల్లోనే జరుగుతున్నది. క్వింటాలుకు అదనంగా రూ.236 చెల్లిస్తేనే ధాన్యాన్ని తీసుకుపోతామంటున్న కంపెనీల వెనుక కచ్చితంగా రేవంత్‌రెడ్డి హస్తం ఉండే ఉంటుంది. తమకు సహకరించని రైస్ మిల్లులపై విజిలెన్స్, జీఎస్టీ దాడులు జరుగుతాయంటున్నారు. కొన్నిసార్లు ధాన్యాన్ని తీసుకుపోయినట్టు పత్రాలు సృష్టిస్తున్నారు. గతేడాది లెక్కల ప్రకారం 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించటానికి టెండర్లు పిలిచారు. అదనంగా వసూలుచేసిన మొత్తం రూ. 820 కోట్లు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి ముడుపులుగా ముడుతున్నాయన్నది నూటికి నూరుపాళ్లు నిజం. ప్రతిసారి మూడు నెలల్లో లిఫ్ట్ చేయాల్సిన ధాన్యాన్ని ఆరు నెలలైనా లక్ష్యాన్ని చేరుకోకపోవటానికి కారణం కొందరు మిల్లర్లు ఈ అదనపు మొత్తాన్ని ఇవ్వటానికి నిరాకరించటమే.
లక్ష్యాన్ని చేరుకోలేకపోయిన కంపెనీలను ఏ ప్రభుత్వమైనా వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టాలి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తమకు రా వాల్సిన రూ.820 కోట్ల కోసం ఆలోచించి గోదాముల్లో ధాన్యం ముక్కిపోయి, పాడైపోయేలా చేస్తున్నది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అక్రమార్జన కోసం విలువైన ధాన్యాన్ని నాశనం చేస్తున్నది.
పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ వసతిగృహ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టే ఉద్దేశంతో సన్న బియ్యాన్ని అందించాం. మధ్యాహ్న భోజన పథకానికి 2.20 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరమవుతాయి. దీనికోసం టెండర్లు పిలిస్తే ధాన్యం సేకరణ కోసం ఎంపికైన ఆ నాలుగు కంపెనీలే వసతి గృహాలకు సన్నబియ్యం సరఫరాకు ముందుకువచ్చాయి. బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం ధర రూ.45 ఉండగా ఈ కంపెనీలు మాత్రం రూ.57తో టెండర్లు వేశాయి. అంటే 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సరఫరాలో రూ.300 కోట్ల అవినీతి జరిగినట్టే లెక్క. ఈ సంస్థలు ఇప్పటివరకూ సంక్షేమ వసతిగృహాలకు నాసిరకం ధాన్యాన్ని సరఫరా చేస్తున్నాయి.
అందుకే ఎన్నడూ లేనివిధంగా వసతిగృహాల్లో విద్యార్థులు దవాఖానల పాలవుతున్నారు. సుమారు 3 లక్షల మంది విద్యార్థులకు సన్న బియ్యం పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ, విద్యార్థుల సంక్షేమం ఏ మాత్రం పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం బియ్యంలోనూ భూతద్దం పెట్టి మరీ అవినీతిని వెతుక్కుంటున్నది. మామూలుగా అయితే వంద కిలోల ధాన్యాన్ని మిల్లులకు ఇస్తే 67 కిలోల బియ్యాన్ని మిల్లర్లు పౌరసరఫరాల శాఖకు అప్పగిస్తే ఆ శాఖ ఎఫ్‌సీఐకి అందిస్తుంది. కానీ, గ్లోబల్ టెండర్ల ద్వారా వచ్చిన సంస్థలు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా కావాలనే ఆలస్యం చేస్తున్నారు. కొన్నిసార్లు ప్రభుత్వం నుంచి నిధులు పొందినప్పటికీ బియ్యాన్ని మాత్రం లిఫ్ట్ చేయకుండా ఆర్థిక ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నారు.
మరోవైపు రేషన్‌కార్డుల జారీపైనా ప్రభుత్వం దాగుడు మూతలాడుతున్నది. అలవికానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 15 నెలలు దాటుతున్నా ఇంతవరకూ జారీపై ఎలాంటి నిర్దిష్ట ప్రకటన చేయలేదు. ప్రజలు ఆశతో నాలుగుసార్లు దరఖాస్తులు సమర్పించారు. ప్రజాపాలన, గ్రామసభల్లో కలిపి సుమారు లక్షన్నర దరఖాస్తులు వచ్చాయి. కొత్తవారికి రేషన్‌కార్డుల జారీ, పాత వారిని తొలగింపుపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలి. సంక్షేమ వసతి గృహాలకు, పేదలకు అందించే రేషన్ బియ్యం నాణ్యతలో రాజీ పడకుండా ఉండాలి. గ్లోబల్ టెండర్ల పేరుతో నాలుగు కంపెనీలకు అప్పగించిన గుత్తాధిపత్యాన్ని వెంటనే రద్దు చేయాలి.
-మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్