తెలంగాణ సాధన ఉద్యమం నడిచొచ్చిన పాదముద్రలు చెరిపివేయాలని ఆలోచించడం, ఆ దిశగా ప్రయత్నించడం ఆధిపత్య ఆంధ్రా మనస్తత్వానికి దర్పణం. గెలుచుకోవాల్సిన మనసులను గాయ పరుస్తున్నారు. చరిత్రను సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా ప్రజామోదం, ఆదరణ, నిస్వార్థ ఆచరణ ద్వారా మాత్రమే సాధ్యం. రాజకీయాలు వేరు. తెలంగాణ సంస్కృతి వేరు. ప్రతీదీ రాజకీయ కోణంలో చూసినట్లయితే అభాసుపాలయ్యే ప్రమాదమున్నది. అట్లాంటి విజ్ఞత మరిచిన చర్యే తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చడం.
కొత్త విగ్రహాన్ని ‘ఆంధ్రామాత’ అన్నా అవ్.. కావొచ్చు.. అనిపిస్తది. ఎందుకంటే, ఆ విగ్రహంలో తెలంగాణతనం లేదు. జొన్న, సజ్జ కంకులు తెలంగాణలో మాత్రమే పండుతాయనుకుంటే తప్పు. జొన్నలు అత్యధికంగా మహారాష్ట్రలో పండుతాయి. ఈ పంట ఉత్పత్తిలో ఆరో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండగా తెలంగాణ ఎనిమిదో స్థానంలో ఉన్నది. అట్లాగే సద్దలు కూడా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బాగానే పండుతాయి. వరి మన దగ్గర ఇప్పుడు ఎక్కువ పండుతున్నది. అన్నింటితో పాటు ఈ పంటలు తెలంగాణలోనూ పండుతాయి. కాబట్టి, వాటిని ప్రతీకగా తీసుకుంటే.. అదొక్కటి మాత్రమే సరిపోదు.
ఈ వ్యవసాయ చిహ్నాలు కాపుదనపోళ్లకు ప్రతీకగా నిలుస్తాయి. అవి ఉండాలి కూడా. అయితే సబ్బండ వర్గాల వారు తెలంగాణ తల్లిని ఓన్ చేసుకోవాలంటే తమదైన సంస్కృతి అందులో ప్రతిఫలించాలని కోరుకుంటారు. అట్లాంటి ప్రతీక బతుకమ్మ ద్వారా మాత్రమే సాధ్యం. ఎందుకంటే, సమస్త వృత్తులకు సంబంధించిన చిహ్నాలు విగ్రహంలో ఇమడ్చలేం కాబట్టి, సాంస్కృతిక ప్రతీకను వాడటం సబబు.
బతుకమ్మను బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించింది. ‘తెలంగాణ తల్లి’ చేతిలో బతుకమ్మ ఉన్నట్లయితే దాన్ని చూసినప్పుడల్లా గత ప్రభుత్వ ఘనత గుర్తొస్తదనుకుంటే అది అజ్ఞానమే! మన దేశంలోనే గాకుండా విదేశాల్లో సైతం తెలంగాణ ఆడబిడ్డలు ఎక్కడ ఉన్నా ‘బతుకమ్మ’ పండుగను గొప్పగా జరుపుకొంటారు. జరుపుకోవాలి కూడా. ఎందుకంటే బతుకమ్మ ప్రకృతికి, పర్యావరణానికి సంబంధించిన పూల పండుగ. ఏడాదికోసారి ఆడబిడ్డలు కలుసుకొని కలిమి లేములు పంచుకునే పండుగ. తెలంగాణ అంటే ‘డల్లాస్’లో సైతం బతుకమ్మగా గుర్తింపు పొందింది.
ఇదే సందర్భంలో ఒక విషయం అందరం గుర్తుంచుకోవాలి. దళితులకు ‘బతుకమ్మ’కు సంబంధం లేదు. కాబట్టి బతుకమ్మ ఎందుకు? ఉండాలని కొందరు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఒక్క దళితులదే కాదు గదా! సబ్బండ వర్గాల వారిది కదా! శూద్ర కులాలన్నీ బతుకమ్మని పెద్ద వేడుకలా జరుపుకొంటాయి. అట్లాంటి బతుకమ్మను సాంస్కృతిక ప్రతీకగా నిరాకరించడమంటే ఆ తల్లి విగ్రహంలో మా 54 శాతం శూద్ర జనాభా ప్రాతినిధ్యరాహిత్యమే అవుతుంది. మా ప్రాతినిధ్యం లేని బొమ్మను మేమెందుకు మోయాలి!
ఇప్పటికే ‘జయజయహే తెలంగాణ’ గేయాన్ని తెలంగాణ ప్రజలకు దూరం చేసిన ప్రస్తుత ప్రభుత్వం అట్లాగే తెలంగాణ తల్లిని కూడా మరుగున పడేసే ప్రయత్నం చేస్తున్నదా? అనే అనుమానాలకు ఈ చర్య తావిస్తున్నది. నాలుగు కోట్ల ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకొని కొత్త తల్లి యోచనను విరమించుకోవాలి. నిజానికి తెలుగుతల్లి విగ్రహాన్ని రూపొందించింది తెలంగాణకు చెందిన కొండపల్లి శేషగిరిరావు. రాష్ట్రం విడిపోయినా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాత ‘తెలుగుతల్లి’ విగ్రహాన్నే గౌరవిస్తున్నారు. ఆ తల్లితో పోల్చితే తెలంగాణ తల్లి కొత్త విగ్రహం చేతి గుర్తును సూచించే విధంగా కనబడుతున్నది.
సహృదయంతో ‘యాదగిరి గుట్ట’, ‘టీజీ’, ‘జ్యోతిబా ఫూలే ప్రజాభవన్’ పేర్లను స్వాగతించిన తెలంగాణ ప్రజలే ఈ విగ్రహ మార్పు చర్యను వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోనట్లయితే విజ్ఞులైన తెలంగాణ బిడ్డలే భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటారు.
– సంగిశెట్టి శ్రీనివాస్ 98492 20321