మంచికి చెడుకు మధ్య
ఓ సరిహద్దు రేఖ
ఎప్పుడూ గీసే ఉంటుంది
ఏది మంచో ఏది చెడో
గుర్తించడమే ముఖ్యం
పాశ్చాత్య పోకడల్లో
మునుగుతున్న మెదళ్లు
విషతుల్యమై వికృత భావాల్ని
చిమ్ముతున్నాయి చూడు
ఓ యువతా మేలుకో..
ఓ ఉద్యోగార్థి.. ఓ విద్యార్థి
గమ్యంలో రాళ్లు, ముళ్లు
గుచ్చుకుంటూ ఉండవచ్చు
అయినా లక్ష్యం వైపే నడక సాగాలి
మనసును దృఢం చేసుకొని
కన్నవారి కలల సాకారం కోసం
చదువుల సేద్యంలో కిసానై పోవాలి
సామాజిక యుధ్ధంలో జవానై పోవాలి
వివేకానందుడివై…యువ శక్తివై
నీ ధీరత్వాన్ని.. నీ వ్యక్తిత్వాన్ని
జాతీయ జెండాగా ఎగరేయ్!
మనిషిని మనిషిగా గుర్తించక
మనసుని మనసుగా స్నేహించక
నీలో నువ్వే కుమిలిపోకు
నీకు నీవే భారమై.. దూరమై
నీ వాళ్లకు శోకాన్ని మిగల్చకు
ఓ శ్లోకమై శివమెత్తు
ఓ నినాదమై వర్థిల్లు
ఓ ప్రభాతమై ప్రభవించు
శతమానం భవతి అంటూ
కాలం కరవాలమై నీ దరి చేరుతుంది
డాక్టర్ కటుకోఝ్వల రమేష్: 99490 83327