కాంగ్రెస్ పార్టీ 2023 మే 23న హైదరాబాద్, సరూర్‌నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించింది. యువత, నిరుద్యోగులకు సంబంధించి ఐదు కీలక హామీలతో ఉన్న ఈ డిక్లరేషన్‌ను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఆధ్వర్యంలో అప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలర్పించిన యువతీ, యువకులను అమరవీరులుగా గుర్తించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, తల్లి లేదా తండ్రి లేదా భార్యకు నెలకు రూ. 25 వేల అమరవీరుల గౌరవ పెన్షన్‌ను అధికారంలోకి రాగానే అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులను ఎత్తివేస్తామని, వారందరికీ జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డులు అందజేస్తామని ప్రగల్భాలు పలికారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు అయినా ఇప్పటి వరకు అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన దాఖలాలు లేవు.
అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. తొలి ఏడాదిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ప్రతి ఏడాది జూన్ 2 నాటికి జాబ్ క్యాలెండర్ ప్రకటించి, సెప్టెంబర్ 17లోపు నియామకాలు పూర్తిచేస్తామని చెప్పింది. కానీ, అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచింది. అధికారంలోకి రాకముందు 30 వేల పైచిలుకు టీచర్ పోస్టుల ఖాళీలు ఉన్నాయని, అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహించి ఖాళీలు భర్తీ చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపించింది. తీరా గద్దెనెక్కాక 10,000 టీచర్ పోస్టులు భర్తీచేసి చేతులు దులుపుకొన్నది. గవర్నమెంట్ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ల ఖాళీలు మొత్తం భర్తీ చేయకుండా గెస్ట్ లెక్చరర్లతో నెట్టుకొస్తున్నది. పరిశోధన కేంద్రాలైన యూనివర్సిటీలు 70 శాతం టీచింగ్ పోస్టుల ఖాళీలతో సతమతమవుతున్నాయి.
నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతి నెలా రూ. 4,000 నిరుద్యోగ భృతి చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని గొప్పలు చెప్పింది. జిల్లాకో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేటు కంపెనీల్లో తెలంగాణ యువతకు 75 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ప్రకటించింది. ఇంకా మరెన్నో హామీలతో నిరుద్యోగులు, యువతను మాయ చేసింది. అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఇచ్చిన హామీలను కట్టకట్టి అటకపై పడేసింది.
పాలమూరు, తెలంగాణ, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీలను ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా మార్చడంతోపాటు ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్‌లలో నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ప్రకటించింది. బాసర ట్రిపుల్ ఐటీల్లాంటివి మరో నాలుగింటిని ఏర్పాటు చేస్తామని చెప్పింది. క్రీడా యూనివర్సిటీ, పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్‌ల్లో రెండు స్కూళ్లు ఏర్పాటు చేస్తామన్న హామీలు నీటిమూటలే అయ్యాయి. కోచింగ్ ఫీజుల చెల్లింపు కోసం రూ. 5 లక్షల గ్యారెంటీ కార్డు ఊసే లేదు. ఉపకార వేతనాలు ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మహిళా సాధికారత కోసం సంస్కరణలు తీసుకొస్తామని, చదువుకుంటున్న 18 ఏళ్లు పైబడిన అమ్మాయిలకు ఉచిత స్కూటీలు ఇస్తామని మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో కుటుంబ పోషణ కోసం యువత డెలివరీ బాయ్స్‌గా, చిన్నచిన్న కంపెనీల్లో అరకొర వేతనాలకు గొడ్డుచాకిరీ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి.
– దేవేందర్ ముంజంపల్లి 89784 58611