రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న అణచివేత, నిర్బంధాలు, అరెస్టుల పర్వాలను చూస్తుంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి. తెలంగాణ మలిదశ ఉద్యమం సమయంలో జరిగినట్టే రాష్ట్రవ్యాప్తంగా అర్ధరాత్రి అరెస్టులు, నిర్బంధాలు మళ్లీ మొదలయ్యాయి. హామీల అమలు కోసం, తమ న్యాయపరమైన హక్కుల సాధన కోసం నిరసనలు చేస్తున్న, నినదిస్తున్నవారిపై కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం మోపుతుండటం ఆందోళనకరం.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని చెప్పడంలో ఎలాంటి సంశయం అక్కర్లేదు. అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు మొదలుకొని ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఆఖరుకు శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన ఖాకీలు కూడా నిరసనలు, ఆందోళనలకు దిగారంటేనే పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. అసలు తెలంగాణలో పాలన జరుగుతున్నదా? పాలకులు ఉన్నారా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.
ప్రజలకు మంచి పాలన అందించడం ముఖ్యమంత్రి ప్రధాన విధి. తమను నమ్మి, ఆరు గ్యారెంటీలను విశ్వసించి ఓట్లు వేసిన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం పాలకుల బాధ్యత. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నదేమిటి? హామీల అమలుపై స్పష్టత లేదు. ఇప్పటివరకు ఏ ఒక్క హామీ సంపూర్ణంగా అమలుకాలేదు. పైగా హామీల గురించి ప్రశ్నిస్తున్న, నిలదీస్తున్నవారిపై దాడులు జరుగుతుండటం విచారకరం.
నేడు తెలంగాణలో ఎక్కడ చూసినా ఆందోళనలు, నిరసనలే కనిపిస్తున్నాయి. రుణమాఫీ కాని రైతులు అయోమయంలో ఉన్నారు. వారికి సరైన సమాధానమిచ్చే నాథుడే లేడు. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏక్ పోలీస్ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ బెటాలియన్లు హోరెత్తుతున్నాయి. బెటాలియన్ పోలీసుల డిమాండ్లను నెరవేర్చాల్సిందిపోయి, క్రమశిక్షణను ఉల్లంఘించారని ఆరోపిస్తూ నిరసన చేసిన పలువురిని డిస్మిస్ చేయడం అత్యంత ఖండనీయం. హోం శాఖను స్వయంగా నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి నుంచి కనీస స్పందన రాకపోవడం పోలీసు కుటుంబాల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది.
ధర్నాచౌక్‌ను ఎత్తేశారని, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా పోయిందని కేసీఆర్ పాలనపై గతంలో దుమ్మెత్తిపోసిన కుహనా మేధావులు రేవంత్‌రెడ్డి హయాంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై నోరు మెదపడం లేదు. హైదరాబాద్‌లో సెక్షన్ 163 విధించడంపై ఒక్క మాటా మాట్లాడటం లేదు. ట్యాంక్‌బండ్ చుట్టూ వెలిసిన ముళ్లకంచెలు వారికి కానరావడం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న నిర్బంధాలు, అణచివేతలు, హౌస్ అరెస్టులు, అక్రమ కేసులు, ఎమ్మెల్యేల మీద దాడుల గురించి పల్లెత్తు మాటా అనడం లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని రక్షించాలని దేశవ్యాప్తంగా ఊదరగొడుతున్న రాహుల్‌గాంధీకి తెలంగాణలో జరుగుతున్న అకృత్యాలు కానరాకపోవడం విస్మయం కలిగిస్తున్నది.
ప్రతిపక్ష నాయకునిగా ఇష్టారీతిన మాట్లాడిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. గతంలో మాదిరిగానే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ శాంతియుత తెలంగాణలో అగ్గిరాజేస్తున్నారు. నాయకుడి దారిలోనే ఆ పార్టీ కార్యకర్తలు పయనిస్తున్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై అరికెపూడి గాంధీ దాడి చేయడం, హరీశ్‌రావు క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడటం, ప్రముఖ సినీ హీరో కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఈ కోవలోనివే.
మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి సర్కార్‌కు అతి తక్కువ కాలంలోనే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నది. దీంతో ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. తెలంగాణలో భాక్రానంగల్ డ్యాం ఉందని, తెలంగాణకు మూడు వైపులా సముద్రం ఉందని మాట్లాడుతూ నవ్వులపాలవుతున్నారు. అంతేకాదు, వన్నె తేవాల్సిన ముఖ్యమంత్రి పదవికి మచ్చ తీసుకొస్తున్నారు. మూసీ సుందరీకరణ, హైడ్రా పేరిట జరుగుతున్న పేదల ఇండ్ల కూల్చివేతల కారణంగా దేశానికి రెండో ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న హైదరాబాద్ ప్రతిష్ట మసకబారుతున్నది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు రావడం లేదు. రియల్ఎస్టేట్ పడిపోయింది. ఎవరి ఇల్లు ఎప్పుడు కూలుతుందో తెలియక హైదరాబాద్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఈ తతంగాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ‘రాజకీయ బాంబు’లంటూ సరికొత్త డ్రామాకు తెరలేపింది.
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన తీరును మార్చుకోవాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం కృషిచేయాలి. లేకుంటే, ఆ పార్టీకి ప్రజలు సరైన సమయంలో బుద్ధిచెప్పడం ఖాయం.