మహిళలు, అప్పుడప్పుడు పురుషుల దుస్తులు కూడా విప్పించి ఊరేగించడం మన దేశంలో తరచూ జరుగుతూనే ఉంటాయి. మతం, కులం, వర్గం మధ్య సంఘర్షణలు జరిగినప్పుడు ఆ మొత్తం మతం, కులం లేదా వర్గానికి ఉండే పరువు ప్రతిష్ఠలకు మహిళ శరీరం ప్రతిరూపంగా మారుతుంది. ఆ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగిందని భావించినప్పుడు మహిళలను వివస్త్రలను చేసి అవమానిస్తుంటారు. సంఘ విద్రోహ శక్తులు ఇలాంటి నేరాలకు పాల్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉండటం చూస్తున్నాం.
సీఎం రేవంత్ తన పరువుకు భంగం వాటిల్లిందని చెప్తూ ఇద్దరు మహిళా జర్నలిస్టులను బట్టలూడదీసి కొడతామని సాక్షాత్తూ అసెంబ్లీలోనే బెదిరించడం దిగ్భ్రాంతిని కలిగించింది. మార్చి 1న రేవంత్ అసెంబ్లీలో మాట్లాడుతూ తన కుటుంబంలోని మహిళలపై అసభ్యంగా మాట్లాడేవారిని ‘బట్టలూడదీసి ఊరేగిస్తామని’ హెచ్చరించారు. సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వాక్ స్వాతంత్య్రాన్ని ఉల్లంఘించడమే. రేవంత్ చేసిన ఈ హెచ్చరిక తాలిబన్లను తలపించింది. సీఎంకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసినందుకు ఇద్దరు మహిళా జర్నలిస్టులు రేవతి పొగడదండ, తన్వీ యాదవ్ అరెస్టయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. రేవతి, తన్వీ షేర్ చేసిన వీడియోలో రేవంత్‌రెడ్డి, వారి కుటుంబంలోని మహిళలను దుర్భాషలాడారు. ఇది రేవంత్‌కు కోపం తెప్పించింది. జర్నలిజం ముసుగులో సోషల్ మీడియాలో తన కుటుంబంపైనా ఇలాంటి తిట్లను సహించబోనని ఆయన హెచ్చరించారు. అధికారిక గుర్తింపు లేకుండా ఆన్లైన్ జర్నలిజంలో ఉన్నవారి విషయంలో భిన్నంగా వ్యవహరిస్తామన్నారు. గుర్తింపు పొందిన జర్నలిస్టుల జాబితాను ఇవ్వాలని జర్నలిస్టు సంఘాలను కోరారు. ఆ ఇద్దరు మహిళా జర్నలిస్టులను ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
మహిళా జర్నలిస్టుల అరెస్టుపై బీఆర్ఎస్, బీజేపీ తీవ్రంగా స్పందించాయి. రేవంత్ చర్యలు 1975 నాటి ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఓ వీడియోను షేర్ చేస్తూ.. కాంగ్రెస్ డీఎన్ఏ, ఎమర్జెన్సీ ని ప్రస్తావించారు. ‘కాంగ్రెస్ పార్టీ సీఎం భాష ఇదేనా?’ అని ప్రశ్నించారు. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ పత్రికాస్వేచ్ఛ, ప్రేమ, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతారని, ప్రజాస్వామ్యానికి నిర్వచనం ఇదేనా? అని నిలదీశారు. ఇదేనా ‘ముహబ్బత్ కీ దుకాణ్?’ అని పూనావాలా ప్రశ్నించారు. జర్నలిస్టులను ఉద్దేశిస్తూ సభలో సీఎం అన్ పార్లమెంట రీ భాష వాడారు. ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడం రాజకీయాల్లో సాధారణ విషయమే. సీఎం తన కుటుంబాన్ని రాష్ట్ర ప్రజల కంటే ఎక్కువగా భావించడమే ఆందోళన కలిగిస్తున్నది. గత ప్రభుత్వంలో రేవంత్ ప్రతిపక్ష నేతగా బీఆర్ఎస్ను బలంగా ఢీకొట్టారు. 2021 అక్టోబర్‌లో నాటి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లను ‘తాలిబన్’ల తో పోల్చారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఇప్పుడదే నాయకుడు విమర్శిస్తున్న వారి గొంతులను మూసి వేయించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుండ టం విడ్డూరం. అధికారంలో ఉన్న పార్టీకి పోలీసులపై నియంత్రణ ఉం టుంది. ఈ అధికారం పనికిమాలిన కేసుల్లో ప్రత్యర్థులను ఇరికించడానికి వీలు కల్పిస్తుంది.
ప్రభుత్వం తన పౌరులకు భద్రత కల్పించాలి. అయితే, ముఖ్యమం త్రి స్వయంగా వాక్ స్వాతంత్య్రాన్ని అణచివేస్తామని బహిరంగ బెదిరింపులకు దిగడం, అసమ్మతిని అణచివేయడానికి తాలిబన్ల వంటి ఆదేశాలను జారీ చేసినప్పుడు అది ప్రజాస్వామ్య సంస్థలను అపహా స్యం చేస్తుంది. ఇలాంటివేవైనా జరిగినప్పుడు న్యాయస్థానాలు నిర్ణ యం తీసుకుంటాయి. అయితే, పరిష్కారం ఆలస్యంగా రావడంతో అప్పటికే బాధితుడి శారీరక, ఆర్థిక, మానసిక స్థితికి తీరని నష్టం జరుగుతుంది. పౌరులు తమ అభిప్రాయం చెప్పినందుకు బెదిరించడం ద్వారా రేవంత్‌రెడ్డి వాక్ స్వాతంత్య్రాన్ని అణచివేసే ప్రయత్నం చేసి దోషిగా నిలబడ్డారు. రాజ్యాంగం తన పౌరులకు స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రాన్నిస్తుంది. అయితే, దీనికి కొన్ని పరిమితులున్నాయి. దాన్ని న్యా యప్రక్రియ ద్వారా నిర్ణయించడం ఉత్తమం. ఐదు రోజుల కస్టడీ తర్వా త మార్చి 17న ఇద్దరు మహిళా జర్నలిస్టులకు బెయిల్ మంజూరైంది. నేరపూరిత కుట్ర, ద్వేషాన్ని ప్రోత్సహించడం, భారత చట్టం ప్రకారం అసభ్య విషయాలను ప్రచురించడం వంటి తీవ్రమైన అభియోగాలను వారు ఎదుర్కొంటున్నారు. దోషులుగా తేలితే, వారికి జైలు శిక్ష విధించవచ్చు, ఇది కఠినంగా అనిపించవచ్చు. పరువు నష్టం కేసులను అర్థం చేసుకోవచ్చు కానీ, అరెస్టు, బెదిరింపులను అర్థం చేసుకోగలమా?
ప్రభుత్వం ఆమోదించిన జర్నలిస్టులనే గుర్తించాలని సీఎం కోరుకుంటున్నారు. జర్నలిస్టుల అధికారిక జాబితాను రూపొందించాలని, జాబితాలో లేనివారిని నేరస్థులుగా పరిగణించాలన్నారు. దీని అర్థం సాధారణ పౌరులకు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛ లేదనుకోవాలా? ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19కి విరుద్ధం కాదా? సీఎం చేసిన దారుణమైన వ్యాఖ్యలు ఆయన ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చినవని కొందరంటున్నారు.
కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రాన్ని అడ్డుకుంటున్నదని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం.. తొలుత తన ఇం టిని చక్కదిద్దుకోవాలి. సోషల్‌మీడియా యుగంలో దూషణలు, ట్రోలింగ్ ప్రజా జీవితంలో భాగమైపోయాయి. అలాగని ప్రజాస్వామ్యంలో గొంతులను అణచివేయలేం. దానికి ప్రత్యేకంగా చట్టం ఉన్న ది. ఇందుకు సంబంధించి చరిత్రలో చాలా పాఠాలున్నాయి. ఉన్నత కులాలకు చెందిన పురుషులు తనపై అత్యాచారం చేసి అవమానించినందుకు బందిపోటు రాణి ఫూలన్‌దేవి బెహమాయి ఊచకోత ద్వారా ప్రతీకారం తీర్చుకున్నట్టు చరిత్ర. మణిపూర్‌లో తాజాగా మహిళలను వివస్త్రను చేసి ఊరేగించిన ఘటనలను కూడా దేశం చూసింది.