రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం నాడు అసెంబ్లీకి సమర్పించిన బడ్జెట్ సాధించిందేమైనా ఉందా అంటే హళ్లికి హళ్లి సున్నకు సున్నా అనే చెప్పుకోవాలి. ఒక కొత్త పథకం లేదు. కొత్త ఆలోచన అసలే లేదు. దశ-దిశ లేని చప్పిడి బడ్జెట్లో మొక్కుబడి విదిలింపులతో సరిపెట్టారు. మెగా మాస్టర్ ప్లాన్-2050 గురించి అట్టహాసంగా ప్రకటించుకున్నారు. అంటే వర్తమానంలో ఆర్థికవ్యవస్థను బాగుపరచడం తమ వల్ల కాదని చెప్పకనే చెప్పినట్టుగా ఉన్నది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ పారిశ్రామిక వాడల అభివృద్ధికి దీనిని ఉద్దేశించినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. ఆదాయాన్ని పెంచుకోవడంలో దారుణంగా విఫలమైపోయి, అప్పుల మీదనే ఆధారపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పదేండ్లలో ఆర్థికవ్యవస్థను ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకువెళ్తామని చెప్పడం హాస్యాస్పదం. ఫ్యూచర్ సిటీ గురించి గొప్పగా చెప్పుకొన్నప్పటికీ కేటాయించిన మొత్తం బహు తక్కువ. 56 గ్రామాలతో కూడిన భవిష్యత్తు నగరికి రూ.100 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. తక్షణ అవసరాలకు నిధులు సర్దలేక, సంక్షేమానికి కేటాయించలేక సతమతమైనట్టు 2025-26 బడ్జెట్‌ను చూస్తేనే అర్థమవుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) చివరి నాటికి ప్రజారుణం మొత్తం రూ.5 లక్షల కోట్లు దాటిపోతుంది. ఇది ఆర్థిక నిర్వహణను మరింత కఠినతరం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు.
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలనే వాగ్దానాన్ని అధికారికంగా భూస్థాపితం చేసేందుకు ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను అడ్డంగా వాడుకున్నది. అంటే మాటకూ, చేతకూ పొంతన లేదన్న మాట. పింఛన్లు పెంచలేదు. మహాలక్ష్మి మాటే లేదు. తులం బంగారం గురించి గుంజెత్తు ప్రస్తావన లేదు. గ్యారంటీలతో పాటుగా మొత్తం హామీలన్నింటినీ తుంగలో తొక్కారనడానికి బడ్జెట్ నిదర్శనంగా నిలుస్తుంది. ప్రజల కష్టనష్టాలపై ఏ మాత్రం ధ్యాస పెట్టకుండా ప్రజాధనాన్ని అధికార పార్టీకి పంచిపెట్టే ఎత్తుగడ స్పష్టంగానే కనిపిస్తున్నది. ‘రాజీవ్ యువ వికాస్ యోజన’ పేరిట రూ.6,000 కోట్లు కేటాయించడమే ఇందుకు నిదర్శనం. ఈ నిధులు అధికార పార్టీ కార్యకర్తలు పప్పుబెల్లాల్లా పంచుకుంటారని విపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తుండటం గమనార్హం. కామారెడ్డి డిక్లరేషన్‌లో ఏటా బీసీ సంక్షేమానికి రూ.20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి కేవలం రూ.11,405 కోట్ల నిధులు కేటాయించడం ఇచ్చిన మాట తప్పడమే అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వం చేనేతకు పెట్టిన బడ్జెట్ రూ.1200 కోట్లు. కానీ, ప్రస్తుత బడ్జెట్లో వారికి రూ.370 కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తుంటే సర్కారు ప్రాధాన్యాలు అర్థమవుతాయి. ఇంకా అనేక అంశాలు ప్రస్తావనకైనా నోచుకోలేదు.
ఆటోడ్రైవర్ల సంక్షేమ బోర్డు గురించి బడ్జెట్లో నామమాత్రంగానైనా ప్రస్తావన లేదు. గిగ్ వర్కర్ల కోసం బోర్డు ఏర్పాటుచేయడం గురించి బడ్జెట్లో మాట కూడా లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 73 శాతం ఫిట్‌మెంట్‌కు మించి ఉద్యోగులకు న్యాయం చేస్తామన్నారు. దాని గురించీ ఏమీ లేదు. పీఆర్సీ మాటేమోగానీ కనీసం పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏల గురించీ ఏమీ చెప్పలేదు. గొర్రెల పంపిణీ ఊసే లేదు. వైన్‌షాపుల్లో గౌడ్లకు ఇస్తానన్న 25 శాతం రిజర్వేషన్ జాడే లేదు. అంబేద్కర్ అభయహస్తం పేరిట దళితులకు ఇస్తామన్న రూ.12 లక్షలు ఏమయ్యాయో తెలియదు. విద్యార్థులకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణం బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులకూ నోచుకోలేదు. నిరుద్యోగులకు భృతి లేదు. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ప్రస్తావన లేదు. రూ.73 వేల కోట్ల ఆదాయం తగ్గిందని స్వయంగా ముఖ్యమంత్రి చెప్తుంటే బడ్జెట్లో మాత్రం అంతా సవ్యంగా ఉన్నట్టు ఎందుకు చెప్తున్నారో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వాలి. కల్లబొల్లి కబుర్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం మీద హమీల డుల్లతో డొల్లగా రూపొందిందని చెప్పక తప్పదు.