సుమారు ఏడాదిన్నర కిందట ఏసీ రూముల్లో కూర్చున్న కొందరు కాంగ్రెస్ నాయకులు ఎంతో మేధోమథనం చేసినట్టుగా హంగామా చేశారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలనే కాపీ చేస్తూ, వాటికి అదనంగా 2 నుంచి 5 వరకు అంకెలు జతచేస్తూ ఓ మ్యానిఫెస్టోను రూపొందించారు. ఉదాహరణకు ఆసరా పింఛన్ రూ.2 వేలుంటే, వాళ్లు రూ.4 వేలు ఇస్తామన్నరు. బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు రూ.10 లక్షలు ఇస్తే, తాము రూ.12 లక్షలు ఇస్తామని ప్రగల్భాలు పలికారు. కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం కూడా ఇస్తామని హడావుడి చేశారు. ఇట్లా చెప్తూ పోతే ఈ పత్రికలో స్థలం సరిపోదేమో!
ఇగొచ్చె.. అగొచ్చె.. అంటూ అసలు ప్రజలకు ఆలోచించడానికి కూడా సమయం ఇవ్వకుండా హామీలిస్తూ పోయారు. ఇక డిక్లరేషన్లకైతే అంతే లేదు. ఆ ఊళ్లో ఒక డిక్లరేషన్. ఈ ఊళ్లో ఒక డిక్లరేషన్. వాటి పేరుతో వందల కొద్దీ హామీలు. ఫైనల్గా ఆరు గ్యారెంటీలు అనబడే 13 హామీలు గుదిగుచ్చి అందరి మెడల్లో వేశారు. అన్నింటికీ మించి ఏ రంగం స్థిరీకరణ కోసం, ఏ రంగం అభివృద్ధి కోసం, ఏ రంగాన్ని ఉన్నతీకరించడం కోసం దశాబ్ద కాలం రేయింబవళ్లు గత ప్రభుత్వం పనిచేసిందో, ఆ వ్యవసాయ రంగంపైనా, దాని అనుబంధ రంగాలపైనా కల్లాలలో కుప్పలు తెచ్చి పోసినట్టే హామీలు గుప్పించారు. రుణమాఫీ రూ.2 లక్షలన్నరు. రైతు భరోసా రూ.15 వేలన్నరు. ఇది కౌలు రైతులకూ ఇస్తమన్నరు.
రైతు, ఉపాధిహామీ కూలీలకూ రూ.12 వేలు ఇస్తమన్నరు. రాష్ట్రంలో పండే ప్రతి పంటకూ ఓ ఐదొందల బోనస్ ఇస్తమన్నరు. ఇవన్నీ విన్నప్పుడు సంభ్రమాశ్చర్యాలకు గురి కాని వారు బహుశా లేరేమో. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ, తత్త్వం బోధపడలేదు. ఎన్నికల ముందు రైతుబంధు వేస్తుంటే ఎన్నికల సంఘానికి ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి ఆపించారు. వచ్చాకైనా వేశారా అంటే.. వాటిని వేయడానికి నాలుగు నెలల ప్రహసనాన్ని నడిపించారు. ఇక రుణమాఫీ అయితే ఒట్టుల బుట్టలా మారింది. ప్రభుత్వాధినేత పెట్టిన ఒట్లకు దేవుళ్లు సైతం ఆశ్చర్యపోయారేమో. ఇక్కడినుంచి గందరగోళం మొదలైంది. రాష్ట్ర ఆర్థిక వనరులను అభివృద్ధి, సంక్షేమం కోసం ఏ విధంగా వికేంద్రీకరించాలి? దేనికి ఏ మేరకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలియని ప్రభుత్వాధినేతలు అయోమయంలో పడిపోవడంతో రాష్ట్రంలో ఎవుసానికి భరోసా లేకుండాపోయింది.
2023, డిసెంబర్ 9న రుణమాఫీ హామీ అమలు చేస్తామన్న ప్రభుత్వం అలాంటి తేదీలెన్నింటినో దాటవేసింది. ఆఖరికి రుణమాఫీ అమలు కోసం సవాలక్ష ఆంక్షలు పెట్టింది. ఇదంతా కొంతకాలం సాగదీసే యత్నమే తప్ప మరేం కాదు. రుణమాఫీ మూడు దశల్లో చేసినప్పటికీ ఇంకా నూరు శాతం పూర్తి కాలేదు. పాలమూరులో పెద్ద సభ పెట్టి రూ.2,750 కోట్ల చెక్కునిచ్చి ఇక దీంతో నూరు శాతం రుణమాఫీ పూర్తయిందని సీఎం స్వయంగా ప్రకటించారు. వాస్తవానికి ఆ రూ.2,750 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ కానే లేదు. రైతు భరోసా నిధులను రుణమాఫీకి బదలాయించి దానిని మమ అనిపించారు.
ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సమయం వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా రైతు భరోసాను ఇస్తమన్నరు. రైతు కూలీలకు 12 వేల లెక్కన నగదు ఇస్తమన్నరు. మళ్లీ ఇక్కడ రాజకీయ విన్యాసాలు మొదలయ్యాయి. రైతు భరోసాను గత ప్రభుత్వం రాళ్లు రప్పలకు ఇచ్చి దుబారా చేసింది. తాము, రైతులకే ఇస్తమని ఊదరగొట్టారు. దీనిపై ఓ కమిటీ వేసి నివేదిక తెప్పించుకున్నారు. కానీ, ఆ నివేదిక మాటెట్లా ఉన్నా.. అసెంబ్లీలో దానిపై ఒక చర్చ పెట్టి మమ అనిపించారు.
తర్వాత క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చించి తీసుకున్న నిర్ణయం ఏమిటయ్యా అంటే.. రైతు భరోసా రూ.15 వేలు కాదు, రూ.12 వేలేనని. రైతులకు ఇంత ద్రోహం చేసిన ప్రభుత్వం దేశంలో ఇదేనేమో మరి. నాడు మూడు పంటలకూ రైతుబంధు ఇవ్వాలని గొంతెత్తిన వాళ్లే.. ఇప్పుడు తామిచ్చిన హామీని సైతం తుంగలో తొక్కుతున్నారు. విచిత్రం ఏమంటే.. దీనికీ ఒక ప్రధాన నియమం పెట్టారు. సాగుకు యోగ్యమైన భూములకే రైతు భరోసా ఇస్తామని. ఇందుకోసం జనవరి 16 నుంచి మూడు రోజుల పాటు దరఖాస్తులు తీసుకొని, ఆ వెంటనే ఓ ఉపగ్రహం ద్వారా సర్వే చేసి, జనవరి 26న రైతు భరోసా వేస్తారంట.
ఈ దరఖాస్తుల తంతు ప్రభుత్వం వచ్చిన నాటినుంచి జరుగుతూనే ఉన్నది. ఈ ప్రహసనం అంతా తిరిగి అధికారుల చుట్టూ రైతులు తిరగడానికి, వాళ్లకు లంచాలు సమర్పించుకోవడానికి దారితీస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క రైతూ కష్టపడలేదు. దఫ్తర్కు పోకుండా, దరఖాస్తు చేయకుండా వ్యవసాయ పథకాలు అందుకున్నాడు. చివరికి ప్రభుత్వమే కల్లాల దగ్గరికి పోయి పంటను కొనుగోలు చేసింది. ఇప్పుడు రైతులు మళ్లీ క్యూలు కట్టాల్సిన పరిస్థితి రాష్ట్రంల దాపురించింది.
ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసాది మరో అంశం. వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని కూడా జనవరి 26న శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో దాదాపు కోటీ రెండు లక్షల మంది వ్యవసాయ కూలీలున్నారు. ప్రభుత్వం పెడుతున్న మొదటి ఆంక్ష ఏమంటే గుంట భూమి ఉన్నా వ్యవసాయ కూలీ కింద పరిగణించేది లేదట. వారికి రైతు భరోసా వస్తుంది కాబట్టి, ఇందిరమ్మ భరోసా అవసరం లేదన్నది ప్రభుత్వ సూత్రీకరణ. వాస్తవానికి ఎకరం కంటే తక్కువ భూమి ఉన్నవారు రాష్ట్రంలో 24 లక్షల మందికి పైగా ఉన్నారు.
ఉదాహరణకు ఒక వ్యవసాయ కూలీకి ఐదు గుంటల భూమి ఉంటే అతనికి వచ్చే రైతు భరోసా కేవలం రూ.1500. అంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ.10,500 నష్టపోవాల్సి వస్తున్నది. 10 గుంటల భూమి ఉన్న కూలీకి రూ.3 వేలుంటే, నష్టపోయే ఆత్మీయ భరోసా రూ.9 వేలు. అంతేకాకుండా రాష్ట్రంలో 50 లక్షల వరకు ఉపాధి హామీ కా ర్డులున్నాయి. ఈ కార్డులున్న కూలీలు 20 రోజులు పనులకు పోకపోతే.. వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింపజేయమని మరో నిబంధన విధిస్తున్నారు.
ఈ రకమైన నిబంధనలతో దాదాపు 90% మంది వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తించదు. అలాంటప్పుడు ఈ ఆత్మీయ భరోసా ఎవరికో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. ఇలాంటి గుంట చిక్కులతో వ్యవసాయ రంగంలో మళ్లీ కల్లోల పరిస్థితులు తీసుకురావద్దు. రైతుల పట్ల, వ్యవసాయం పట్ల సానుభూతితో వ్యవహరించి ప్రభుత్వం రైతులకు గట్టి భరోసాను అందివ్వాలి. అప్పుడే వ్యవసాయ, దాని అనుబంధ రంగాలు వర్ధిల్లుతాయి.
(వ్యాసకర్త: ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్)
రకరకాల నిబంధనలతో దాదాపు 90 శాతం మంది వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తించదు. అలాంటప్పుడు ఈ ఆత్మీయ భరోసా ఎవరికో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. ఇలాంటి గుంట చిక్కులతో వ్యవసాయ రంగంలో మళ్లీ కల్లోల పరిస్థితులు తీసుకురావద్దు.
-డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్