తెలంగాణ రాజకీయాల్లో నేడు సామాజిక న్యాయానికి సంబంధించిన మౌలిక ప్రశ్న కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తోంది. అది బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందా? అనేది. రాష్ట్ర జనాభాలో మెజారిటీగా ఉన్న వెనుకబడిన తరగతులు ఇక రాజకీయ పార్టీలకు ఓట్లు వేసే యంత్రాలు మాత్రమే కాదని, తమ హక్కుల కోసం లెక్కలు అడిగే శక్తిగా మారాయని ఇటీవలి పరిణామాలు స్పష్టంగా రుజువు చేస్తున్నాయి.
కానీ ఈ మార్పును గుర్తించడంలో, రాజకీయ చైతన్యాన్ని గౌరవించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒకవైపు, అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న నిర్ణయాలు మరోవైపు ఈ రెండింటి మధ్య ఉన్న విపరీతమైన అంతరం బీసీల్లో తీవ్రమైన ఆగ్రహాన్ని, అసంతృప్తిని, అపనమ్మకాన్ని రేకెత్తిస్తోంది.
2023 శాసనసభ ఎన్నికల సమయంలో బీసీల ఓట్ల కోసం జరిగిన రాజకీయ పోటీని తెలంగాణ సమాజం సులభంగా మర్చిపోలేదు. నాటి అధికార బీఆర్ఎస్ పార్టీ ‘బీసీ బంధు’ అంటూ ఆర్థిక హామీలతో ముందుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు 44 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఎంతో గంభీరంగా ప్రకటించింది. బీసీలకు న్యాయం చేస్తామన్న మాటలతో, సామాజిక సమానత్వమే తమ పాలన లక్ష్యమని చెబుతూ బీసీల విశ్వాసాన్ని కాంగ్రెస్ సంపాదించింది. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మాటలు క్రమంగా మౌనంగా మారాయి. హామీల స్థానంలో మౌనం, ఆశల స్థానంలో నిరాశ, నమ్మకం స్థానంలో అనుమానం బలపడింది.
ప్రభుత్వం చేపట్టిన కులగణన మొదట్లో బీసీల్లో ఆశలు రేకెత్తించింది. దేశవ్యాప్తంగా కులగణన జరగాలన్న రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ ముందడుగు వేసిందన్న ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో తెలంగాణ కులగణన దేశానికి రోల్ మోడల్ అని ప్రకటించారు. కానీ ఈ రోల్ మోడల్లో అసలు మోడల్ ఏమిటో, డేటా ఎక్కడుందో ప్రజలకు ఇప్పటికీ తెలియదు. కులగణన రిపోర్టులో బీసీల జనాభాను కేవలం 46.25 శాతంగా చూపించడం, రాష్ట్రం ఏర్పడిన తరువాత నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు 51 శాతం ఉన్నా వాస్తవానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది.
మైనారిటీ బీసీలను కలిపి మొత్తం బీసీలను 56 శాతంగా చూపించడం ద్వారా అసలు బీసీ కులాల జనాభాను ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపించారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
బీహార్, కర్ణాటక వంటి రాష్ర్టాలు కులగణన నిర్వహించినప్పుడు ఏ కులం ఎంత శాతం, వారి సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన వెనుకబాటుతనం ఎంత అనే వివరాలను ప్రజల ముందుంచాయి. ఆ డేటాపైనే విధానాలు రూపొందించాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ వివరాలను ప్రజలకు వెల్లడించలేదు. పారదర్శకత లేని కులగణన నమ్మేలా లేదన్న భావన బీసీల్లో బలపడుతోంది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధన కోసం నియమించిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక కూడా ఈ అనుమానాలను తొలగించలేకపోయింది. రాష్ట్రంలోని 134 బీసీ కులాల్లో ఏ కులం ఎంత వెనుకబాటుతనం కలిగి ఉందో, ఎవరు అత్యంత వెనుకబడినవారు, ఎవరు తక్కువ వెనుకబాటులో ఉన్నారు అనే విషయాలను స్పష్టంగా చెప్పకపోవడం, రిజర్వేషన్ అంశాన్ని న్యాయపరంగా బలహీనంగా మార్చింది.
కోర్టుల్లో నిలబడే రిజర్వేషన్ కావాలంటే గణాంకాలు, శాస్త్రీయ ఆధారాలు, స్పష్టమైన ప్రమాణాలు అవసరం. కానీ ఆ ఆధారాలనే ప్రభుత్వం ప్రజల ముందుంచకపోతే, ఇది నిజంగా బీసీలకు న్యాయం చేయాలన్న ప్రయత్నమా లేక కాలయాపనా? అన్న సందేహం సహజంగానే తలెత్తుతుంది. ఈ మొత్తం నేపథ్యంతో చూస్తే, తాజాగా విడుదలైన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల రిజర్వేషన్ నోటిఫికేషన్ బీసీల్లో మిగిలిన ఆశలను కూడా పూర్తిగా గల్లంతు చేసింది. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు సంబంధించి పురపాలక శాఖ కార్యదర్శి బుధవారం జీవో నంబర్ 14 జారీ చేశారు.
మున్సిపల్ వార్డులు, డివిజన్లలో ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ స్థానాలు కేటాయించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు, 2019 తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం జనరల్ మహిళలకు రిజర్వుడు స్థానాల సంఖ్యను ఖరారు చేశారు. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్పర్సన్ రిజర్వేషన్లను సైతం ఖరారు చేశారు. ఎస్టీలకు ఐదు సీట్లు (జనరల్-3, మహిళలు-2), ఎస్సీలకు 17 (జనరల్-9, మహిళలు-8), బీసీలకు 38 స్థానాలు (జనరల్-19, మహిళలు-19), మహిళలకు 31 స్థానాలు, అన్ రిజర్వ్డ్ స్థానాలు 30 ఖరారు చేశారు. రాష్ట్రంలోని 10 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన మేయర్ రిజర్వేషన్ల వివరాలను కూడా వెల్లడించారు. ఎస్సీకి ఒక స్థానం, ఎస్టీకి ఒకటి, బీసీ జనరల్ రెండు, బీసీ మహిళలు ఒకటి, మహిళలు జనరల్ నాలుగు, అన్ రిజర్వ్డ్ స్థానం ఒకటి కేటాయించారు.
‘మా ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం’ అంటూ గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల ఇంకా నిర్లక్ష్యం వహిస్తూనే ఉంది. ‘ప్రజా పాలన’, ‘సామాజిక న్యాయం’, ‘సమాన అవకాశాలు’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం, మున్సిపాలిటీల్లో బీసీలకు జరిగిన అన్యాయంతో ఖాళీ నినాదంగా మారుతోంది.
బీసీలు ఇప్పుడు మౌనంగా ఉండే స్థితిలో లేరు. వారు తమ సంఖ్యను తెలుసుకున్నారు. తమ రాజకీయ శక్తిని గుర్తించారు. కుల గణనకు సంబంధించిన పూర్తి డేటాను వెంటనే విడుదల చేయాలి.
బీసీల జనాభా మేరకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించాలి. 44 శాతం రిజర్వేషన్ హామీపై స్పష్టమైన రోడ్‌మ్యాప్ ప్రకటించాలి. ఇది బీసీలపై చూపే దయ కాదు ఇది వారి హక్కు. లేకపోతే చరిత్ర ఒక విషయాన్ని మళ్లీ మళ్లీ నిరూపించింది, నిరూపిస్తూనే ఉంది. బీసీల సహనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత వేగంగా పరీక్షిస్తుందో, అంత వేగంగా ఆ సహనం రాజకీయ తీర్పుగా మారుతుంది. ఆ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత కఠినంగా ఉంటుందో చెప్పడానికి పెద్ద జ్యోతిషం అవసరం లేదు.
-మన్నారం నాగరాజు