గత రెండు నెలలుగా జోగులాంబ నుంచి ఆదిలాబాద్ వరకు రాష్ట్రవ్యాప్తంగా పొలాల్లో ఉండాల్సిన రైతులు రాత్రి పగలు, స్త్రీ-పురుషులు, ఎండావాన తేడా లేకుండా ఎరువుల దుకాణాల ముందు, రోడ్లమీద బారులుతీరి కనబడుతున్నారు. గత 10, 12 సంవత్సరాల నుంచి పంటపొలాలకు పరిమితమైన
రైతులు ఇప్పుడు యూరియా కోసం రోడ్లమీదకు ఎందుకు వస్తున్నారు? అని తెలుసుకోవడానికి 2025 సెప్టెంబర్ 13న నేను (పులి రాజు), అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ సీతారామారావు, టీవీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్ కలిసి క్షేత్రస్థాయికి వెళ్లాం.సిద్దిపేట జిల్లా ములుగు, వర్గల్, గజ్వేల్, రాయపోల్, దౌల్తాబాద్ మండలాల్లో పర్యటించి ఫర్టిలైజర్ షాపులముందు
యూరియా కోసం నిలబడ్డ రైతులతో మాట్లాడాం. రైతులు పడుతున్న గోస వారి మాటల్లోనే…
మాది రాయపోల్ మండలం, టెంకంపేట గ్రామం. నా పేరు మల్లేశం. నేను నిన్న ఉదయం 5:30 గంటలకు వచ్చి లైన్లో నిలబడితే సాయంత్రం ఐదు గంటలకు ఒక యూరియా బస్తా రాసిండు! ఈ రోజు ఆ యూరియా బస్తా తీసుకుపోవడానికి వచ్చిన. ఈ సంవత్సరం పంటలు పెట్టకుండా ఉంటే బాగుండు! పంటలు పెట్టినంక యూరియా కోసం సర్కారు మా రైతుల ఉసురుపోసుకుంటున్నది! గత పది సంవత్సరాలుగా యూరియా కావాలంటే ఆటోవాళ్లకు డబ్బులు ఇస్తే సాయంత్రం తీసుకొచ్చి యూరియా బస్తాలను మేం లేకున్నా మా ఇంటి అరుగు మీద వేసేటోళ్లు. మాకు అవసరం ఉన్నప్పుడు పంటలకు చల్లుకునేటోళ్లం. పొలంలో నాగలి నిలబెట్టి బండిమీద పోయి యూరియా బస్తాలు తీసుకొచ్చి పనిచేసుకునే మేము రెండు నెలలుగా రాయపోల్ దుకాణంలో నిలబడంగా ఒక బస్తా దొరికితే నాలుగు ఎకరాల పంట ఎట్లా పండుతది? ఎట్లా అప్పులు తీర్చుతం?
దౌల్తాబాద్ మండలం, గొల్లపల్లి గ్రామానికి చెందిన బండారి దుర్గయ్య అనే మరో రైతుతో మాట్లాడాం. ‘నాకున్న ఒక ఎకరా పొలంతో పాటు మూడెకరాలు కౌలుకు తీసుకొని నాటు వేసిన నాకు ఒక యూరియా బస్తా మాత్రమే వచ్చింది. ఆ ఒక్క బస్తా దేనికి చల్లాలి? ఇవాళ వచ్చి ఒక సంచి తీసుకుపోతే, మళ్లీ రేపు వస్తే నిన్ననే ఒక సంచి ఇచ్చినం, ఇంకా లేదని ఎళ్లగొడుతున్నరు. పాసుబుక్కు, ఆధార్ కార్డు తీసుకుని పోతే ఓటీపీ వస్తది, వేలు పెట్టమంటరు. వేలు ఒక్కొక్కసారి చూపించకపోతే యూరియా బస్తా ఇయ్యరు. మేము యూరియా కోసం రోడ్లమీద ఉంటే, కోతులు మా పంట పొలాల్లో ఉంటున్నయి. నాకు కౌలు పైసలు కూడా వచ్చేటట్టు లేవు’.
గజ్వేల్ మండలం, బంగ్లా వెంకటాపూర్ గ్రామానికి చెందిన పంజాల రవీందర్ గౌడ్ అనే రైతు తన గోడు వెళ్లబోసుకున్నడు. ‘మా గజ్వేల్‌లో ఒక్క యూరియా బస్తాకు 500 రూపాయలు సార్’.. అని అంటే మేము ఆశ్చర్యపోయాం. ‘ఒక బస్తా ధర సుమారు 280 రూపాయలు అవుతుంది కదా! 500 ఎందుకు?’ అని అంటే.. ‘మాకిప్పుడు యూరియా బస్తాలు అత్యవసరం సార్ కాబట్టి, ఫర్టిలైజర్ షాప్‌వాళ్లు ఒక యూరియా బస్తాకు అర్ధ లీటర్ నానో యూరియా బాటిల్ తీసుకుంటేనే యూరియా బస్తా ఇస్తున్నరు. ఆ నానో యూరియా బాటిల్ ధర 200. (యూరియా బస్తా + నానో యూరియా) బాటిల్ కలిపి 500 రూపాయలు సార్. మొన్నటివరకు గుళికల ప్యాకెట్ తీసుకుంటేనే యూరియా బస్తా ఇచ్చారు. ఆ గుళికల ప్యాకెట్‌కు 700 రూపాయలు, యూరియాకు 300 మొత్తం కలిపి ఒక బస్తా యూరియాకు1000 రూపాయలు. ఆ నానో యూరియా బాటిల్, గుళికల ప్యాకెట్ మేం ఏం చేసుకుంటం సార్? గ్లాసుల కలుపుకొని తాగుతమా?’ అని యువ రైతు రవీందర్ గౌడ్ అన్నడు.
పది సంవత్సరాల నుంచి లేని యూరియా కొరత ఈ సంవత్సరమే ఎందుకు వచ్చిందని వర్గల్ మండలం, తునికి గ్రామానికి చెందిన నరసింహులు అనే రైతు ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు? ‘అటు చూడండి సార్.. ఆ చెరువులో ఎండాకాలంలో కూడా నీళ్లు ఉంటున్నయి. గత ఐదారు సంవత్సరాలుగా రెండు పంటలు పండుతున్నయి. బోనస్‌ను ఎగ్గొట్టడానికి ప్రభుత్వమే యూరియా కొరతను సృష్టిస్తున్నది. యూరియా లేకపోతే పంట దిగుబడి సరిగ్గా రాదు. కాబట్టి ప్రభుత్వానికి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు, బోనస్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. పెట్టుబడి మీదపడి రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటరు’ అని నర్సింహులు అన్నడు.
మొక్కజొన్న ఎర్రబడిందని గజ్వేల్ మండలం కోలుగూరు గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళా రైతు కన్నీటి పర్యంతమయ్యారు. ‘నాకున్న ఒక ఎకరా 30 గుంటల భూమిలో ఒక ఎకరా మొక్కజొన్న, 30 గుంటల్లో వరి వేసిన. మొక్కజొన్న కంకి మొత్తం ఎర్రబడ్డది. రైతులు గింత కష్టపడుతుంటే ఆదివారం సెలవేంది?’ అని ఆ మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
2025లో వానకాలం సాగు సుమారు 1.32 కోట్ల ఎకరాలు. సుమారు 15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా! కేంద్ర ప్రభుత్వం 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియానే సప్లయ్ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. కేంద్రప్రభుత్వం రాష్ర్టానికి అవసరమైన యూరియా అందించిందనీ, ప్రభుత్వ వైఫల్యం వల్లనే రైతులు రోడ్ల మీదకు వస్తున్నారని బీజేపీ సమర్థించుకుంటున్నది. యూరియా కొరత రైతులకే సమస్య కాలేదు. ఆ యూరియా రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తున్నది. ఆహార, వాణిజ్య పంటలు సహా అన్నింటికి యూరియా అవసరం. కాబట్టి యూరియా విరివిగా దొరికితే రైతులు పంటలకు అవసరమైనప్పుడు వాటిని చల్లుతారు. పంటలూ పండిస్తారు. కానీ, నేడు యూరియా కొరత రైతులకు జీవన్మరణ సమస్యగా మారింది. యూరియా దొరక్కపోవడంతో పంటల దిగుబడి తగ్గే అవకాశం ఉంది. రైతులకు రాజకీయాలతో పనిలేదు. వాళ్లకు పంటలే ముఖ్యం. కాబట్టి ప్రభుత్వం వెంటనే యూరియా కొరతను తీర్చి తమకు భరోసా ఇవ్వవలసిన అవసరం ఉందని రైతులు అంటున్నారు.
– పులి రాజు
99083 83567