గ్రామ పంచాయతీల పాలన బాధ్యతను ప్రత్యేకాధికారులకు అప్పగించి ఏడాది పూర్తయింది. అందుకే గ్రామ పంచాయతీలు అస్తవ్యస్తమయ్యాయి. ఏ గ్రామంలో చూసి నా పారిశుద్ధ్య లోపం కనిపిస్తున్నది. మురుగు, చెత్తా చెదారం పేరుకుపోతున్నది. ఈ ప్రత్యేకాధికారులు తమకున్న రెగ్యులర్ బాధ్యతలతో పాటు ఈ ప్రత్యేక బాధ్యతలు నిర్వహించలేకపోతున్నారు. గ్రామాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన నర్సరీలకు కనీసం నీళ్లందించే పరిస్థితులు లేవు. కేసీఆర్ తీసుకువచ్చిన స్వచ్ఛత చర్యలను ఎవరూ పట్టించుకోవడం లేదు. వీధుల్లో దోమలు ప్రబలుతున్నాయి. పదేండ్లలో ఉళ్లల్లో తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయటం ఊరు బయట చెత్త నిర్వహణను చేపట్టడం వంటివి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. దీంతో గ్రామాలు పచ్చదనంతో, స్వచ్ఛంగా మారాయి.
ట్రాక్టర్ల నిర్వహణ మూలకుపడింది. గ్రామ పంచాయతీ పాలక వర్గాల గడువు ముగిసిన వెంటనే ప్రత్యేకాధికారులను నియమించినప్పటికీ రెండు, మూడు గ్రామాలకు కలిపి ఒకే అధికారిని నియమించటం వల్ల చాలాచోట్ల అధికారులు సంతకాలు చేసి చేతు లు దులుపుకొంటున్నారు. వాళ్ల మాతృశాఖ బాధ్యతలకే పరిమితమై కనీ సం గ్రామ పంచాయతీలను సందర్శించడం లేదు. ట్రాక్టర్లకు చెల్లించాల్సిన రుణాలు సకాలంలో చెల్లించడం లేదు. పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాల నిర్వహణను గాలికి వదిలేశారు. చెత్త డబ్బాలు, ట్రీ గార్డులకు నిధుల్లేక వాటి నిర్వహణ అధ్వానంగా మారింది. పంచాయతీ చెత్త వాహనాలకు డీజిల్‌కు కూడా డబ్బులు చెల్లించలేకపోవటంతో అవి పంచాయతీ కార్యాలయాలకే పరిమితమయ్యాయి. అసలు పంచాయతీ ఖాతాల్లో ఒక్క పైసా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు కేటాయించక పోవడం శోచనీయం.
129 మున్సిపల్ కౌన్సిల్స్, 9 కార్పొరేషన్ల పాలకవర్గాల గడువు గత జనవరి 26తో ముగిసింది. గ్రామాల్లో ఉన్న పరిస్థితి కంటే అధ్వానంగా పురపాలక సంఘాలున్నాయి. పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సమస్య పట్టి పీడిస్తున్నది. ఇలా ప్రత్యేకాధికారుల పాలన వల్ల నిధుల కేటాయింపుల్లోనూ స్థానిక సంస్థలకు అన్యాయం జరుగుతున్నది. కేంద్ర ఆర్థికసంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికైన పంచాయతీలకే నిధులు విడుదల చేస్తున్నది. 15వ ఆర్థిక సంఘం రాష్ర్టానికి రూ.7,201 కోట్లు కేటాయించింది. ఇందులో 2022లో రూ.1,365 కోట్లు, 2023లో 1,415 కోట్లు కేటాయించింది. 2023-24 ఏడాదికి రూ.1,430 కోట్లు కేటాయించినప్పటికీ రూ.715 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఈయేడు మొదటి విడత నిధులు ఇంకా విడుదల కాలేదు. ఈ నిధులు విడుదలవ్వాలంటే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగి పాలకవర్గాలు కొలువుదీరాలి. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నేతృత్వంలో రాష్ట్ర ఆర్థికసంఘాన్ని ఏర్పాటుచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంఘం నివేదికను ఇప్పటివరకూ ప్రజల్లోకి తీసుకురాకపోవటంతో నిధుల కేటాయింపు జరగలేదు.
మొదట అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామన్న రేవంత్ మొదటి ఆరు నెలలు వాటి ఊసే ఎత్తలేదు. ఆ తర్వాత కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు పెంచి నిర్వహిస్తామని చెప్పి ఆ తర్వాత మాట మార్చారు. కేంద్రం ఆమోదిస్తేనే బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యమని తెలిసి కూడా కావాలనే తాత్సారం చేస్తున్నారు. ఇప్పుడు కులగణన నివేదిక బయటకు వచ్చాక మరో ఆరు నెలల వరకు ఎన్నికలు నిర్వహించే సూచనలు కనిపించడం లేదు. ప్రత్యేకాధికారుల పాలన ఆరు నెలలకు మించకూడ దు. కానీ, ఈ ప్రభుత్వం ఏడాదిన్నర గడుస్తున్నా ప్రజా ప్రాతినిధ్యాన్ని నిరాకరిస్తున్నది. మార్చి, ఏప్రిల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ సహా ఇతర ప్రవేశ పరీక్షల్లో అధికార యంత్రాంగం తలమునకలయ్యే అవకాశమున్నది. అంటే మరో 4 నెలల వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఇలాగే ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కొనసాగితే వాటి పాలన పడకేస్తుం ది.
కార్మికుల జీతాలు, పైపుల లీకేజీల మరమ్మతులు, నెల నెలా విద్యుత్తు బకాయిలు చెల్లించే పరిస్థితి లేదు. రాష్ట్రంలోని సుమారు 12,600 గ్రామ పంచాయతీల్లో సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు సహా గెజిటెడ్ అధికారులకు ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు అప్పగించారు. వీరికి అసలు పంచాయతీరాజ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలియదు. అటు తమ బాధ్యతలు నిర్వహించాలా, లేక గ్రామాల్లో బాధ్యతలు చేపట్టాలా వారికి అర్థం కావడం లేదు.
కాబట్టి, ప్రభుత్వం ఇప్పటికైనా పంచాయతీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలి. గ్రామాల శుభ్రతకు సరిపడా నిధులు కేటాయించాలి. ఎన్నికలు నిర్వహిస్తేనే కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, నిధులు విడుదలవుతా యి. ఆలస్యం చేసిన కొద్దీ ఆ నిధులు మురిగిపోతాయి.
– మఠం భిక్షపతి, 95424 23242