మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కార్ చేపడుతున్న మార్పు రాజకీయాలు వివాదస్పదంగా మారుతున్నాయి. రేవంత్ తీరును గమనిస్తే తెలంగాణ ప్రజలకు ఏదో చేయాలనే తలంపు కాకుండా, కేసీఆర్‌ను ప్రజల నుంచి దూరం చేయాలనే కక్షతోనే ఆయన ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నది.
ముఖ్యమంత్రి పదవి శాశ్వతమైనది కాదు. తీన్మార్ మల్లన్న ైస్టెల్లో చెప్పాలంటే సీఎం జీతగాడు మాత్రమే. కానీ, రేవంత్ మాత్రం తనకు అధికారం శాశ్వతమన్నట్టు వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసినవన్నీ మార్చుకుంటూపోతే ప్రజాధనం వృథాకావడంతో పాటు ఒక ప్రాంతం ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే టీఎస్‌ను టీజీగా మార్చారు. ఆ తర్వాత తెలంగాణ రాజముద్రలో మార్పులు చేసేందుకు ప్రయత్నించి చేతులు కాల్చుకున్నారు. ఇటీవల తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేశారు. వాస్తవానికి ఉద్యమకాలంలో మనకూ ఒక తల్లి ఉండాలనే భావన మొదలైంది.
అయితే, ఉద్యమ ప్రతీకగా తెలంగాణ తల్లిని ముందుకు తేవాలన్న ఆలోచన మాత్రం ఉద్యమ సారథి కేసీఆర్‌దే. ప్రముఖ రచయిత బీఎస్ రాములు, బీయూ ఆర్ చారిలు తెలంగాణ తల్లి విగ్రహానికి రూపం ఇవ్వగా.. గంగాధర్, ఎక్కా యాదగిరిరావు, దుర్గం రవీందర్, కాపు రాజయ్య, ఏలె లక్ష్మణ్ తదితర రచయితలు, జర్నలిస్టులు, ఉద్యమకారులతో సమావేశమై మార్పుచేర్పుల గురించి కేసీఆర్ సూచించారు. వెనుకబడ్డ తెలంగాణకు గుర్తుగా, పేద తల్లిగా తెలంగాణ తల్లి ఎందుకు ఉండాలనే ప్రశ్నను కేసీఆర్ లేవనెత్తారు. కేసీఆర్‌తో పాటు ఇతర మేధావుల సూచనల మేరకు ప్రొఫెసర్ గంగాధర్ తెలంగాణ తల్లికి తుదిరూపమిచ్చారు.
తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా బతుకమ్మ.. గద్వాల, పోచంపల్లి చీర, కరీంనగర్ వెండి మట్టెలు, కోహినూర్ వజ్రం, జాకబ్ వజ్రం, మక్క కంకులు, బంగారు నగలు, అందమైన కిరీటం, వడ్డాణం, జరీ అంచు చీర, నిండైన కేశ సంపదతో తెలంగాణ తల్లి ప్రాణం పోసుకున్నది. ఉద్యమ కాలంలో ఊరూరా వేల విగ్రహాలు ఏర్పాటయ్యాయి.
దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా భరతమాత విగ్రహం రూపు మారలేదు. ఏపీలో తెలుగుతల్లి విగ్రహం అలాగే ఉంది. కానీ, మార్పు అంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ మాత్రం తెలంగాణ తల్లిని మార్చేసింది. నాడు ఏర్పాటైన తెలంగాణ తల్లి విగ్రహం కేసీఆరో, బీఆర్ఎస్ పార్టీనో ఏర్పాటు చేయలేదు. కేసీఆర్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడూ కాదు. ఉద్యమసమయంలో మేధావులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, ఉద్యమకారులతో చర్చించి ఏర్పాటు చేశారు. తెలంగాణ తల్లి కూడా తెలుగు తల్లి, భరతమాత మాదిరిగా సిరిసంపదలకు ప్రతీకగా ఉండాలి. అంతేకానీ, పేద తల్లిగా విగ్రహాన్ని తయారు చేయించడం తెలంగాణ వెనుకబాటుతనానికి నిదర్శనం. అంతేకాదు, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఎదుగుదలను అవమానించడమే. తెలంగాణ ఆడపడుచులకు ప్రతీకగా ఉండే బతుకమ్మను తొలగించడం దారుణం. పండుగలు, పబ్బాలకు పోతే మన ఆడపడుచులు నగలు కచ్చితంగా వేసుకుంటారు. కనీసం రోల్డ్‌గోల్డ్ అయినా ధరిస్తారు. పాలకుల కుటుంబీకులు మాత్రం బంగారు ఆభరణాలతో మెరిసిపోవాలి. మన తెలంగాణ తల్లి మాత్రం బీద తల్లిగా ఉండాలా?
ఇప్పటికైనా ఇలాంటి రాజకీయ ప్రేరేపిత కార్యక్రమాలకు చరమగీతం పాడాలి. తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ముందుకు సాగవద్దు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలె కానీ, విగ్రహాలు, రాజముద్ర, కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాల్లో కాదు. ‘మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అన్నట్లు భవిష్యత్‌లో అధికారంలోకి వచ్చే పార్టీలు రేవంత్ మార్పు కార్యక్రమాలను మార్చడం ఖాయం.
– జీడిపల్లి రాంరెడ్డి 96666 80051