ఒక్కడు.. ఒకే ఒక్కడు.. కదిలాడు.. కదం తొక్కాడు. కదనశంఖం పూరించాడు. తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చినవాడు.. అభివృద్ధి పథంలో అంచెలంచెలుగా అగ్రస్థాయికి నడిపించినవాడు. రెండు విడుతల పరిపాలన దిగ్విజయంగా సాగించి మూడో విడుతకు లంఘిస్తున్నవాడు. ఒక్కడు.. ఒకే ఒక్కడు.. కేసీఆర్. ఈ మూడక్షరాల మంత్రం ఇప్పుడు తెలంగాణ జనం గుండెల్లో మార్మోగుతున్నది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జనసంద్రాలు స్వాగతిస్తున్నాయి. ఎన్నికల సభలా? విజయోత్సవ సభలా? అని అబ్బురపరుస్తున్నాయి. సీఎం కేసీఆర్ శరపరంపరగా పాల్గొంటున్న ప్రజా ఆశీర్వాద సభలకు జనం ఉబికివస్తున్నారు. గులాబీ జెండాల రెపరెపల నీడన జనసునామీ పోటెత్తుతున్నది. సభా ప్రాంగణాలు చాలక జనం చెట్లు, మిద్దెలు ఎక్కి మహానేత మాటలను రిక్కించి వింటున్నారు. హర్షాతిరేకాలతో జయజయధ్వానాలు చేస్తున్నారు.
ఎన్నికల యుద్ధాలు కేసీఆర్కు కొత్త కాదు. ప్రత్యర్థులను చిత్తు చేసి విజయాన్ని ముద్దాడటం తనకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికలను ఉద్యమరూపంగా మలిచిన అపూర్వ అనుభవం తనది. ఓటు పోటుతో ఉద్యమాన్ని మున్ముందుకు నడిపించిన అపురూప వ్యూహరచన తనది. స్వరాష్ట్ర సాధన తర్వాత ఒకటికి రెండుసార్లు ఓటర్లతో జేజేలు చెప్పించుకున్న ఘనత జనహృదయ విజేత సొంతం. అయినా ఇంకా సాధించాల్సింది చాలా ఉన్నదంటూ వినమ్రంగా ప్రజల ఆశీర్వాదం కోరుతున్నారు. ఇవాళ తెలంగాణ నిండుకుండ. బంగారు కొండ. స్వయం సమృద్ధి సాధించిన రాష్ట్రంపై స్వార్థపరశక్తులు కన్నువేశాయి. ఒక్క చాన్స్ అంటూ చొంగలు కారుస్తూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. కానీ ఈనగాచి నక్కలపాలు చేస్తామా? అభివృద్ధి పరుగులకు బ్రేకులు పడకుండా చూసుకోవాల్సిన తరుణం. పచ్చబడిన తెలంగాణను ముక్కలు కోసి పంచుకుందామని, మూలస్తంభాలైన నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలకు తూట్లు పొడవాలని కొందరు చూస్తున్నారు.
ధరణిని బంగాళాఖాతంలో పారేస్తామని, రైతు ఉచిత కరెంటు గంటలను కుదిస్తామని పేలుతున్నారు. అసత్య ప్రచారాలతో జనాన్ని గోల్మాల్ చేయాలని చూస్తున్నారు. వందలాది తెలంగాణ బిడ్డల ఉసురు తీసినపార్టీ ‘ఒక్కచాన్స్’ అంటూ ఎక్స్ట్రా వేషాలు వేస్తున్నది. మతం తప్ప ప్రజల సంక్షేమం పట్టని మరో పార్టీ నీడల్లో తచ్చాడుతున్నది. తెలంగాణ అస్తిత్వం పొడగిట్టని శక్తులతో చేతులు కలిపి దొంగదెబ్బ తీసేందుకు చాటుమాటు చీకటి ఒప్పందాలకు తెగబడుతున్నాయి. ఇది దీక్షా సమయం.. పరీక్షా సమయం. తెలంగాణ ప్రజలు అస్తిత్వ పోరాటంలోనే కాదు ఓటు ఒడుపుగా విసిరే చాకచక్యంలోనూ రాటుదేలారు. శత్రుమిత్ర జ్ఞానం కలవారు. ఎవరు జనహితులో, ఎవరు ప్రజా ద్రోహులో వారికి ఎరుకే. ఆ ఎరుకతోనే వారు ఒకటికి రెండుసార్లు గులాబీదండును గుండెపై నిలుపుకొన్నారు. మూడోసారి అందుకు సిద్ధమవుతున్నారనడానికి దిగ్విజయంగా సాగుతున్న సీఎం కేసీఆర్ ఎన్నికల సభలే సాక్షి.