‘రేపు ఉదయం పదింటికి టీవీలు చూడండి. నేను చెప్పే ప్రకటన వింటే ఆశ్చర్య పోతారు..’ వనపర్తి బహిరంగసభలో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు చేసిన ప్రకటన ఇది.
విషయమేమిటో తెలియకపోయినా, అసలు ఆ ప్రకటన చేసిన తీరే జనాలను ఆశ్చర్యపరచిన మాట నిజం. కేసీఆర్‌లో ఉన్న వైచిత్రి అదే! అన్నట్టుగానే కేసీఆర్ ఉదయం పది గంటలకు శాసనసభలో ఆ ప్రకటన చేశారు. ఉద్యోగ నియా మకాలకు సంబంధించిన ప్రకటన. షరామామూలుగా రాజకీయ ప్రకటన ఆయన నోటినుంచి వస్తుందని, విమర్శ చేద్దా మని ఆశలు పెట్టుకున్నవాళ్లు ఉసూరుమన్నారు. మరోపక్క ముఖ్యమంత్రి ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జనాలు డప్పులతో నృత్యం చేస్తున్న దృశ్యాలు టీవీ తెరలపై దర్శనం ఇచ్చాయి.నిజం ఒప్పుకోవాలి. నాకు మాత్రం ఈ ప్రకటన ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్క ళ్ళం మన దృష్టి కోణం నుంచే ఆలోచన చేస్తుంటాం. పరిశీలన చేస్తుంటాం. వ్యాఖ్యలు చేస్తుంటాం. రాజకీయ నాయకులు, ప్రత్యేకించి కేసీఆర్ వంటి ప్రజల నాడి పట్టుకోగల నాయకుడు ఆలోచన చేసే తీరే విభిన్నం అని కొద్దిగంటల తర్వాత నాకే తెలిసివచ్చింది. మా ఇంట్లో సహాయకురాలు వనిత ఈ మధ్యాహ్నం కొంత ఆలస్యంగా వచ్చింది. మావి అపరాహ్న భోజనాలు కాబట్టి ఇబ్బందేమీ లేదు. ఎండన పడి వచ్చింది కానీ మొహంలో సంతోషం కొట్టవచ్చినట్టు కనబడుతున్నది.
‘ఇన్నాళ్ళకు మా కష్టాలు గట్టెక్కేలా ఉన్నాయి. మా చిన్నోడు ఇన్నాళ్లు సరైన ఉద్యోగం లేక రోడ్డు పట్టుకు తిరుగుతున్నాడు. తెలంగాణ వస్తే మా వాడికి కొలువు దొరుకుతుందని ఆశపడ్డాం. ఈరోజు కేసీఆర్ సారు చెప్పిండట. ఏదో ఒక ఉద్యోగం తప్పక దొరుకుతుందమ్మా..’ అన్నది. నాకు ఎక్కడలేని సంతోషం వేసింది. మా వాడికి కొలువు దొరికినంత ఆనందమైంది. కేసీఆర్ సారు
గురించి ఇంట్లో అందరం మాట్లాడుకుంటూ ఉండిపోయాం. అందుకే పనికిరావడం ఆలస్యమైందన్నది మా వంట మనిషి. నిజమే! కేకులు తినే నా వంటివారికి రొట్టెలు తినేవారి ఆకలి ఎలా తెలుస్తుంది?
– భండారు శ్రీనివాసరావు