
యః ఆత్మదా బలదాయస్య విశ్వ ఉపాసతే ప్రశిషం యస్యదేవాః
యస్యచ్ఛాయామృతం యస్యమృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమ॥
(యజుర్వేదం 25-13)
‘జీవకోటికి శరీర ప్రదాత, బల ప్రదాత పరమేశ్వరుడే. అతనినే విశ్వమంతా ఉపాసిస్తుంది. అతడి ఆజ్ఞనే విద్వాంసులు శిరసా వహిస్తారు. అతనిని ఆశ్రయిస్తే మోక్షం లభిస్తుంది. విస్మరిస్తే మృత్యువుపాలవుతాం’ అంటుంది వేదం.
ఈ సృష్టి రచన, జీవకోటి సుఖదుఃఖాలను అనుభవించడానికే ఉంది. జీవులు కర్మఫలాలు ఆశించడం వల్ల తదనుగుణంగా సృష్టి రచన సాగుతుంది. సమస్త జడ పదార్థాలు జీవులకు ఉపయోగకరమైనవే. సృష్టిలో ఏ పదార్థమూ నిరర్థకమైంది కాదు. అయితే, ఒక పదార్థం ఒకరికి సుఖాన్ని, మరొకరికి దుఃఖాన్ని ఎందుకు కలిగిస్తున్నట్లు? దీనికి కారణం మనం చేసే పనులే! పనిలోని వైవిధ్యమే ఫలరూప వైవిధ్యానికి కారణం అవుతుంది. జీవకోటికి సుఖభోగ సంపాదనకు కావాల్సిన జ్ఞానం పరమాత్మ నుంచే లభిస్తుంది. అతడే అన్ని బలాలను ఇస్తాడు. జ్ఞానబలంతో పాటు పరాక్రమం, ఐశ్వర్యం, కార్యకర్తృత్వ బలం అన్నీ అనుగ్రహిస్తాడు.
ఒక పనికి మనల్ని పరమేశ్వరుడు స్వయంగా కర్తలను చేయడు. మనమే మన బుద్ధి వైశద్యం చేత పనిని ఎన్నుకుంటాం. దాన్ని చేయడానికి కావలసిన నైపుణ్యం మనమే స్వయంగా పొందాల్సి ఉంటుంది. నైపుణ్యాన్ని బట్టి, అదృష్టాన్ని బట్టి ఫలితం లభిస్తుంది. మనం పనికి కర్తలమైనట్లే ఫలాలకు భోక్తలమవుతాం. కానీ, ఫలప్రదాత పరమేశ్వరుడే.
‘ఋతంచ సత్యంచ అభీద్ధాత్త పసోధ్యజాయత’ (ఋద్వేగం 10-170-1) పరమేశ్వరుడు తన సామర్థ్యం చేత ఈ విశ్వా న్ని రచించాడు. విశ్వమంటే ప్రపంచం. ఇది స్వతంత్రంగా ఏర్పడింది కాదు. ఎందుకంటే ప్రపంచం అంతా పరమాణువుల సంపుటిగానే దార్శనికులు భావిస్తారు. పరమాణువుల సామ్యావస్థకు ప్రకృతి అని పేరు. ఈ ప్రకృతి అనేది జడం. ఇది లేకపోతే ప్రపంచం లేదు. కానీ, పరమేశ్వరుడు లేకపోతే ప్రకృతి ప్రపంచంగా రూపుదాల్చదు. అందుకే పరమేశ్వరుణ్ని సృష్టి స్థితి లయకారునిగానే వేదాంత దర్శనం అభివర్ణిస్తుంది. సూక్ష్మంగా ఆలోచిస్తే విశ్వంలోని ప్రతి అణువూ పరమాత్మ ఆజ్ఞను శిరసావహిస్తుంది. సర్వాధారుడైన అతని మాటప్రకారం సృష్టంతా నడవవలసి ఉంటుంది. దిగంతాలకు వెలుగునిచ్చే సూర్యుడైనా, వెన్నెల కురిపించే చంద్రుడైనా యుగయుగాలుగా పరమేశ్వరుని ఆధీనంలో ఉంటున్నాయి!
పరమేశ్వరుడు విశ్వం లోపలా, బయటా అంతటా వ్యాపించి ఉన్నాడు. అతని అధికారానికి తిరుగులేదు. మనం ఎంత బలశాలురమైనా అనుకున్న ప్రతిదాన్ని విజయానుకూలంగా మార్చుకోలేం. ‘సత్యమేవ జయతే’ అన్నమాట పరమేశ్వరునికీ విజయమనే అర్థం ఇస్తుంది. మనం కూడా విజయులం కావాలంటే ఆ సత్యాన్ని ఆశ్రయించాలి. సత్య స్వరూపుడైన పరమేశరుణ్ని ఆశ్రయించాలి. అయితే, మనం ఈ ప్రపంచంలో భౌతిక సుఖాలకు అలవాటు పడి ఎప్పుడైతే సకలాధారుడైన ఈశ్వరుణ్ని విస్మరిస్తామో అప్పుడే కష్టాలు మొదలవుతాయి. అప్పటిదాకా మనకు అనుకూలంగా ఉన్న ప్రకృతి మనల్ని దుఃఖభాగుల్ని చేస్తుంది. మనం చేసే మంచిచెడ్డలు ఎప్పటికప్పుడు పరమేశ్వరునికి తెలుస్తూనే ఉంటాయి. ప్రతి అణువులో భాసించే పరమేశ్వరునికి తెలియని విషయం లేదంటుంది వేదం.
మనం చేసే మంచి పనులకు అతడి ఆజ్ఞను బట్టి సుఖం కలుగుతుంది. అందుకు ప్రకృతిలోని ప్రత్యణువూ స్పందిస్తుంది. జడమైనప్పటికీ ఎప్పటికప్పుడూ ఈ ప్రపంచంలోని స్థూల పదార్థాలు గానీ, సూక్ష్మ పదార్థాలు గానీ మనకు సుఖదుఃఖాలను కలిగించడంలో, వాటివెనుక అంతరాత్మ రూపంలో పరమేశ్వరుడు ఉండటమే కారణం. వ్యక్తిగతంగా గానీ, సామూహికంగా గానీ ప్రకృతి మనకు చేదోడువాదోడుగా ఉండి మన అభ్యుదయానికి తోడ్పడాలంటే, ప్రకృతిని సదా తన వశంలో ఉంచుకునే పరమేశ్వరుణ్ని ఉపాసించాలి. తద్వారా దుఃఖం నుంచి బయటపడవచ్చు. కేవలం ఇహపర సుఖాలనే కాదు మోక్షాన్ని కూడా పొందవచ్చు.
ఆచార్య మసన చెన్నప్ప
98856 54381