సమభావమే సరైన భావన!
భక్తి సంకీర్తన సంప్రదాయాన్ని ఉద్యమంలా కొనసాగించిన చైతన్య మహాప్రభు వు ఒకసారి జగన్నాథ స్వామి దర్శనం కోసం పూరీ క్షేత్రానికి వెళ్లారు. ఆయన ఆలయ సమీపానికి చేరుకోగానే అక్కడ ఆనాటి సమాజ దృష్టిలో నిమ్నజాతిగా భావించే ఓ భక్తుడు కనిపించాడు. వెంటనే చైతన్యులు భక్తిగానంలో ఓలలాడు తూ అతణ్ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోబోతారు. కానీ, ఆ వ్యక్తి భయంతో, బిడియంతో ‘స్వామీ! నేను హీన జాతివాణ్ని. నన్ను మీరు తాకకూడదు’ అంటాడు. అప్పుడు చైతన్యులు.. ‘ఎందుకలా సంశయిస్తావు? భగవంతుడి సృజనలో అధికులు, అంత్యజులు అన్న మాటే లేదు! ఆయన దృష్టిలో అందరూ సమానమే! ఆయనకే భేదం లేనప్పుడు ఆయన భక్తులమైన మనకెందుకు ఉచ్ఛనీచాలు! నిజానికి నీ స్పర్శతో నేనే పునీతం అవుతాను!’ అన్నారు. అదే ప్రేమతో ఆ భక్తుడిని ఆలింగనం చేసుకున్నారు. చైతన్యప్రభువుల ప్రేమ స్పర్శతో ఆ భక్తుడు పులకించిపోతాడు. అన్నాళ్లూ ఆయనలో గూడుకట్టు కొని ఉన్న ఆత్మన్యూనతా భావం తొలగిపోతుంది. ఆత్మవిశ్వాసంతో పులకించిపోతాడు.
ఇలా భాగవతోత్తములైన వారు కులం పేరుతోనో, వర్ణం పేరుతోనో, మరో కారణంతోనో మనుషుల్లో భేద భావాన్ని చూడరు. పైగా అందరిలోనూ ఆ దేవదేవుణ్నే దర్శిస్తారు. ప్రతి జీవినీ ఆ పరమాత్మ ప్రతినిధిగానే భావిస్తారు. ప్రతి ఒక్కరినీ తాము ఉన్న స్థితి నుంచి ఉన్నతస్థితికి తీసుకువెళతారు.అయితే, చాలాసార్లు మనం ప్రపంచాన్ని, పరమాత్మను వేరువేరుగా చూస్తూ ఉంటాం. అందుకే ఆయన ఉనికిని ఆకాశానికో, ఆలయానికో పరిమితం చేస్తూ ఉంటాం. ఇలాంటి భావన వల్లే మనలోని భక్తి ప్రాథమిక దశను దాటి ముందుకు సాగటం లేదు. మాధవుడిలోని మాధుర్యాన్ని మనసు అనుభూతి చెందటం లేదు. సాటి మనిషితో సఖ్యతగా, సామరస్యంగా మెలగలేని ఏ ఆధ్యాత్మిక సాధన కూడా ఎలాంటి సత్ఫలితాలను ఇవ్వదు. ఈ లోకంలో తననొక ప్రత్యేక వ్యక్తిగా భ్రమిస్తూ పటాటోపాలకు పోయేవారికి ఆ పరంధాముడి ప్రాపకం లభించదు.
దిండు గలీబులు ఎన్ని రంగుల్లోనైనా ఉండవచ్చు, వాటిపైనున్న వస్ర్తాలు కొన్ని ఖరీదైనవి, మరికొన్ని సాధారణమైనవి అయి ఉండవచ్చు. కానీ, వాటిలోని దూది మాత్రం ఒకటే! అలాగే మన ఆత్మ, దానిని ఆవరించిన దేహాలు కూడా! పైపై మెరుగులు చూసి విలువ ఇస్తే అది మన సంకుచిత దృష్టికి సంకేతం! నిజంగా వ్యక్తిలోని పారమార్థికత పురోగతి చెందుతుందనటానికి ప్రతీక సమభావమే! అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ‘అర్జునా! అన్ని జీవుల్లో అంతర్యామియై ఉన్నది నేనే!’ అంటాడు. ఈ లోకాన్ని నాకు వేరుగా చూసేవారు అల్పదృష్టులే అని స్పష్టం చేస్తాడు.
ఈ లోకంలో భిన్నత్వాన్ని చూస్తున్నామంటే, కొందరు ప్రియమైనవారని, మరికొందరు పరాయివారని భేదభావాన్ని చూపుతున్నామంటే అది దైవాన్ని ధిక్కరిస్తున్నట్లే! ఆయనలోని సమత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లే! ఆయన భక్తులమని చెప్పుకొంటూ, ఆయన బిడ్డల్ని ద్వేషిస్తే, దూషిస్తే ఏ తండ్రి మాత్రం మన ఆరాధనల్ని అందుకుంటాడు? అంగీకరిస్తాడు? అందుకే ద్వైదీభావం, ద్వేషం, దూషణ వంటివి మన మనస్సులో ఉన్నాయంటే మనం ఎన్నటికీ ఆ దైవానికి ప్రీతిపాత్రులం కాలేం. ఎన్ని జన్మలకైనా ఆయనను సమీపించలేం.
తన ప్రతినిధులైన జీవుల విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నామన్నదే పరమాత్మ మనకు పెట్టే పరీక్ష! మన సమభావమే దానికి సరైన సమాధానం! ఈ సమత్వదృష్టి తీక్షణమవుతున్న కొద్దీ ఎదుటివారి ఆనందం మన ఆనందంగానే తోస్తుంది. ఎదుటివారి కష్టం మన కష్టంగానే అనిపిస్తుంది. అప్పుడు మనది ఆగ్రహావేశాలకు, అసూయాద్వేషాలకు తావులేని మానవలోకమవుతుంది. అందుకే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తమ ‘గీతాంజలి’ గేయసంపుటిలో ‘నిన్నెరిగిన వారికి పరుడనేవాడే లేడు; మూసిన తలుపే ఉండదు’ అంటాడు.
-మనోజ్ఞ
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!


