ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని గమనించినప్పుడు తరచూ ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఆయన పట్ల ఈ పది నెలల కాలంలో గౌరవనీయత ఏర్పడకపోవటమన్నది సరే సరి. కానీ, అంతకన్న ముఖ్యంగా తనకు అసలు గౌరవనీయతే అక్కరలేదన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఆశ్చర్యం కలగటం అందువల్లనే. ఎవరి పట్లనైనా కొన్ని విషయాలలో గౌరవం కలగవచ్చు, మరికొన్నింటిలో కలగకపోవచ్చు. అది సహజం. కానీ, రేవంత్‌రెడ్డికి సంబంధించి అసలు ఎందులోనైనా గౌరవనీయత ఉందా? అంటే ఆలోచించవలసి వస్తుంది. ఈ తెలుగు సీమను 1953-56, 1956-2014 నుంచి మొత్తం 20 మంది పాలించారు. వారిలో సమర్థులు, అసమర్థులున్నారు. ప్రతిష్ఠ గలవారు, లేనివారు ఉన్నారు. కానీ, గౌరవనీయత కలగకపోవటమే గాక అటువంటిది అవసరమే లేదన్నట్టు వ్యవహరించినవారు ఒక్కరంటే ఒక్కరైనా కన్పించరు.
రేవంత్‌రెడ్డి విషయానికి వస్తే, తనకు పరిపాలనాపరమైన అనుభవం లేనందున ఎన్నో కొన్ని తప్పటడుగులు వేయవచ్చు గాక. సమస్య అది కాదు. అనుభవం లేదని ప్రజలకు తెలియటమే గాక ఆ మాట తానే ఒప్పుకున్నందున, కొన్ని తప్పటడుగులను ప్రజలు కొంతకాలం అర్థం చేసుకొని ఉపేక్షించగలరు. అదే విధంగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చెప్పిన గడువు ప్రకారం అత్యధిక భాగం అమలుచేయకపోయినా, ఆ కారణంగా తగినంత నిరసన ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితులు బాగా లేవని కొంతకాలం ఓపిక పట్టండనీ సానునయంగా చెప్పినట్టయితే, అది కూడా ఒక మేరకు అర్థం చేసుకోగలరు. ఇటువంటివన్నీ పరిపాలనాపరమైనవి. వీటిలో వైఫల్యాలు విశ్వసనీయతను తగ్గించవచ్చు. నిరసన కలిగించవచ్చు. కానీ వీటన్నింటికి భిన్నంగా, గౌరవనీయత రావటం రాకపోవటమన్నది వ్యక్తిగతమైన వ్యవహరణ, భాషకు సంబంధించినటువంటిది. సమస్య అక్కడ వస్తున్నది.
ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన మాట ఒకటున్నది. ఒకవైపు పరిపాలనాపరమైన తప్పటడుగులు, హామీలు అమలుచేయకపోవటానికీ, మరొక వైపు గౌరవనీయత ఉండటానికీ, లేకపోవటానికీ మధ్య సంబంధం ఉంటుంది. గౌరవనీయతను సంపాదించుకున్నట్టయితే ప్రజలు తప్పటడుగులను, హామీలు అమలుకాకపోవటాన్ని మామూలు కన్న కొంత ఎక్కువకాలం ఉపేక్షిస్తారు. అట్లా సంపాదించుకొనకపోతే ఆ ఉపేక్ష మామూలు కన్న తక్కువ కాలంలో ఆవిరవుతుంది. రేవంత్‌రెడ్డి తీరును చూడగా ఆయన ఈ విషయం గ్రహించినట్టు కనిపించటం లేదు. ఆ స్థితిలో జరుగుతున్నదేమిటి? తప్పటడుగులు, హామీల అమలు వైఫల్యం, గౌరవనీయత లేమి అనే మూడు కూడా తనకు వ్యతిరేకంగా మోహరించి ముప్పేట దాడి వంటిది చేస్తున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని మాసాలకే మొదలైన ఈ స్థితి, నానాటికీ వేగంగా పెరుగుతూ, ఇంకా ఒక సంవత్సరమైనా పూర్తికాక మునుపే తీవ్రస్థాయికి చేరటం అసాధారణమని చెప్పాలి. తెలుగు నేలను పాలించిన ముఖ్యమంత్రులందరిలో మరెవరి విషయంలోనూ ఇట్లా జరగలేదు. అసాధారణమనటం అందువల్లనే.
రేవంత్‌రెడ్డికి తెలిసి కూడా ఎందుకొరకో గాని ధ్యాసలో ఉంచుకోనివి మరికొన్ని ఉన్నాయి. వాటిలో అన్నింటికన్న ముఖ్యమైనది, ప్రమాదకరం కూడా అయినది కాంగ్రెస్‌లోని అధికార సంస్కృతి. పార్టీలోని గ్రూపులు, గ్రూపు ఒత్తిడితో తమ పనులు చేయించుకునేవారు కొందరైతే మొహం ఎదుట మెచ్చుకుంటూ వెనుక గోతులు తవ్వి తామే అధికారానికి రాజూసేవారు కొందరు.
ఈ సంస్కృతి కాంగ్రెస్‌లో మొదటి నుంచి ఉన్నదే. అందరికీ తెలిసిందే. ఆ బెడద బలవంతులు, సమర్థులైన ముఖ్యమంత్రులకే తప్పలేదు. ఇక బలహీనులైన వారి విషయం చెప్పేదేమున్నది. ఆ విధంగా చూసినప్పుడు, పైన పేర్కొన్న ముప్పేట దాడి వంటి పరిస్థితి, లేదా బలహీనత, రేవంత్ వ్యతిరేక గ్రూపు సంస్కృతికి బాగా కలసివచ్చేది. అట్లాగే జరుగుతున్నది కూడా. తనకు ఇది గతం నుంచే తెలిసినది కాగా ప్రస్తుతం ప్రత్యక్షానుభవం ద్వారా మరింత తెలిసి వస్తుండవచ్చు. అయినప్పటికీ ధ్యాసలో ఉంచుకొని ఎందుకు వ్యవహరించటం లేదో తెలియదు. లేదా అటువంటి ధ్యాసను తన మౌలిక వ్యక్తిగత సంస్కృతిలోని బలహీనతలు కప్పివేస్తునాయేమో చెప్పలేము.
రేవంత్‌రెడ్డి తెలిసి కూడా ధ్యాసలో ఉంచుకోని, లేదా అహంభావంతో లెక్కచేయక తోసిపుచ్చుతున్న విషయాలలో ఒకటి ఇది కాగా, బీఆర్ఎస్, బీజేపీ అనే రెండూ బలమైన ప్రతిపక్షాలనే వాస్తవాన్ని గుర్తించి వ్యవహరించకపోవటం మరొకటి. బీఆర్ఎస్ ఎన్నికలలో ఓడినా క్షేత్రస్థాయిలో తగినంత బలం ఉంది. వారికి అనుభవజ్ఞులు, తెలివికలవారు అయిన నాయకులున్నారు. అటువంటి పార్టీని మంచి పరిపాలనతో, హామీల అమలుతో, గౌరవనీయతను సంపాదించుకోవటంతో మాత్రమే బలహీనపరచగలరు. కానీ ఈ మూడు విషయాలలోనూ రేవంత్‌రెడ్డి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నప్పుడు, బలహీనపర్చటం మాట అట్లుంచి, తానే వారికి ఆయుధాలను సమకూర్చుతున్నారు. అదెట్లా జరుగుతున్నదో నిత్యం కండ్ల ఎదుటనే కనిపిస్తున్నప్పుడు, మళ్లీ వివరించి చెప్పే అవసరం ఉండదు.
బీజేపీ సంగతి కూడా ఇంతే. వారు గతం కన్న పుంజుకోవటం అసెంబ్లీ ఎన్నికలలో, లోక్‌సభ ఎన్నికలలో కూడా కన్పించింది. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి సభ్యత్వం గణనీయంగా పెంచుకునేందుకు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటం, ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టగల అవకాశం, అపారమైన ధనబలం ఆ పార్టీకి గల సానుకూలతలు. మత భావనలను పెచ్చరిల్లజేసేందుకు క్షేత్రస్థాయిలో కనిపించే ప్రతి అంశాన్ని ఉపయోగించుకుంటున్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆందోళనలలో పాల్గొంటున్నారు. తమతో మునుముందు చేరవచ్చుననుకునే కాంగ్రెస్ నేతలతో సంబంధాలలో ఉన్నారు. ఇవన్నీ రేవంత్‌రెడ్డి గమనించటం లేదని ఎంతమాత్రం అనుకోలేము. అయినప్పటికీ, పైన పేర్కొన్న మూడు విధాలైన వైఫల్యాల వల్ల ఏ విధంగానైతే బీఆర్ఎస్కు ఆయుధాలనిస్తున్నారో, బీజేపీకి కూడా అదే పద్ధతిలో ఇస్తున్నారు.
పైన పేర్కొన్న మూడు వైఫల్యాలన్నవే నిజానికి ఒక పెద్ద సమస్య. ఆ విషయాన్ని ఆయన గ్రహించగలిగితే వాటిని చక్కదిద్దుకోవటమే ఒక బృహత్తరమైన బాధ్యత. పరిపాలనలో క్రమంగా అనుభవాన్ని సంపాదిస్తూ తప్పటడుగులు పడకుండా చూసుకోవటం, కొండంత ఎత్తున నిలిచి ఆర్థిక స్థితిని భయపెడుతున్న ఎన్నికల హామీలను వైఫల్యాల వలయం నుంచి బయటకుతెచ్చి వివిధ వర్గాల ప్రజలను పూర్తిగా కాకున్నా తగినంత మేర సంతృప్తి పరచటం, మహా గందరగోళంగా మారుతున్న తన విశ్వసనీయతను, గౌరవనీయతను కనీసం ఇప్పటి నుంచైనా చక్కబెట్టుకోవటం మామూలు పని కాబోవటం లేదు. విచిత్రం ఏమంటే, వీటికివే కొండంత భారం కాగా, ఆ భారంతో ఇప్పటికే సతమతమై ఆందోళనకు, ఒత్తిడికి గురవుతున్న ఆయన, మరికొన్ని కొత్త భారాలను, ఆందోళనలను, ఒత్తిడిని చేజేతులా కొని తెచ్చుకుంటున్నారు. మూసీ, హైడ్రాల ఆలోచన కాకపోయినా వాటిని నిర్వహిస్తున్న తీరు అటువంటిదే. అదెంత ప్రణాళికా రహితంగా, అస్తవ్యస్తంగా సాగుతూ, రకరకాల పరస్పర విరుద్ధమైన మాటలు చేతలతో సమస్యలను ప్రజలకు, ప్రభుత్వానికి సృష్టిస్తున్నదో చూస్తూనే ఉన్నాము. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం పరీక్షల నిర్వహణ, రైతులకు రుణమాఫీతో పాటు రైతు భరోసా వంటివి కేవలం ముఖ్యమంత్రి అవకతవక ధోరణులు, నాలుగు రోజులకొక మాట తీరుతో పెద్ద తల నొప్పులుగా మారాయి. ఆరు గ్యారంటీల గురించి అయితే మాట్లాడకపోవటం మంచిది. వాటిపై బేఫికర్‌గా బుకాయింపులు, పదే పదే అవే అబద్ధాలు, ప్రతిపక్షాలకు సవాళ్లు చేసి పారిపోవటాలు తరచూ కనిపిస్తున్నాయి.
రోజులు గడిచేకొద్దీ పరిపాలనానుభవం గడించి, ప్రజలకు మెరుగైన ఫలితాలు చూపుతూ, తన పట్ల గౌరవాన్ని, విశ్వాసాన్ని పెంచుకోవలసిన ముఖ్యమంత్రి నానాటికి నేల చూపు చూస్తుండటాన్ని అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇందుకు అదనంగా ఆయన, పైన అనుకున్నట్టు అసలు గౌరవనీయత అన్నదే తనకు అక్కరలేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. రోజూ మాటలు మార్చుతూ, లోపాలు ఎత్తిచూపే వారిపై దాడులు చేస్తూ, ఎప్పుడు ఏమి మాట్లాడుతారో తనకైనా తెలుసునా అనే అనుమానం కలిగిస్తున్నారు.
ఈ మొత్తం ధోరణి కారణంగా అందరి దృష్టిలో చులకనవుతున్నారు. ఇప్పటికే చాలా అయ్యారు. ఆయనపై ఎవరికి ఏ విమర్శలు ఉన్నప్పటికీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి ఈ విధంగా ఉండటం తనకే కాదు, ఈ రాష్ర్టానికి, ప్రజలకు కూడా గౌరవప్రదం కాదు. తమను బట్టి తమ దేశానికి, రాష్ర్టానికి గౌరవం తెచ్చిన ప్రధానులు, ముఖ్యమంత్రులు అనేకులున్నారు. రేవంత్‌రెడ్డికి ఆ జాబితాలో చేరాలనే కోరిక అయినా ఉన్నట్టు లేదు.