1990ల పదో తర్గతి పరీచ్చలైపోయి దగ్గెర దగ్గెర రెణ్నెళ్లయితున్నది గావొచ్చు. ఆ రోజే మన బండారం బైటవడ్తదని తెలిసి మాపటీలి అచ్చే పేపర్ కోసం పిట్టకు వెట్టినట్టు సూత్తున్న. ఆ పేపర్ ఇగొస్తలేదు, అగొస్తలేదు. నా గుండెనేమో లబ్‌డబ్, లబ్‌డబ్ అని కొట్టుకుంటనే ఉన్నది. నాకేం మన్సున వట్టక కాలుగాలిన పిల్లి లెక్క గుడికాడికి, మా ఇంటికాడికి అటీటు తిర్గుతనే ఉన్న. అప్పుడే ఎటో వొయ్యొచ్చిన బాపు కొట్టె రాజన్న చింతకిందున్న నుల్క మంచం మీద నున్నగ తయారై గూసున్నడు. పొద్దుగాళ్ల వెట్టిన నుదుటి మీది తిల్కం బొట్టు అట్లనే ఉన్నది. తెల్లారంగనే తెల్లంగి, దోతి గట్టుకొని నున్నగ తయారై పంచాయితీలు దెంపవోవుడు బాపుకు ఎన్కటి నుంచి ఉన్న అలవాటు.
‘అల్లో నేరడల్లో.. అల్లో నేరడల్లో.. అల్లల్ల అంటాడు, మల్లొచ్చి తింటాడు అల్లో నేరడల్లో..’ అని కొండంత రాగం దీత్తున్నడు. అక్షరం ముక్క రాదుగని రామాయణం మొత్తం నోటికే శెప్తడు. బాలశిక్ష ముట్టలేదు గని భాగవతం నోటికప్పజెప్తడు. మా మానకొండూరే గాదు, మా ఊరి సుట్టుపక్కలున్న ఏ ఊళ్లెనన్న నాత్రిపూట రామాయణం నడుస్తున్నదంటే ఆ నాటకంల రామునేశం ఏసేది కచ్చితంగా బాపే.
పదోతర్గతి ఎల్తమా, ఎల్లమా అనే రంది నాకుంటే.. మా బాపేమో రందిలేకుంట పాటలు వాడుతున్నడని మన్సుల అప్పడే అనుకుంటున్న, ఇంతల్నే ఆయన ‘వారి లక్ష్మణా..’ అని నన్ను విల్శిండు. పిల్వంగనే బాపు దగ్గర్కి వోయిన. ‘ఏంది బిడ్డా, ఏదో పరేషాన్లున్నవ్?’ అనడిగితే… ‘ఇయ్యాల్ల పదో తరగతి ఎల్తనో, ఎల్లనో తెలుస్తది బాపు, అందుకే పేపర్ కోసం జూస్తున్న’ అన్జెప్పిన. ‘నాకు తెల్సింది బిడ్డా నువ్వు పదిల దప్పినవని, అయినా సదువు మనకు అచ్చిరాదురా’ అని సావు కబురు సల్లగ జెప్పవట్టిండు. నేను ఫేలైన అని ఆయన ఫీల్ గాలె. ‘కొడుకా లక్ష్మణా.. నీనేమన్న సదువుకున్నాన్రా? మనిషికి సదువు ఉండాలె గని, బతికేటందుకు ఒక్క సదువే అక్కర్లేదురా, ఉపాయం ఉంటే ఉప్పమ్ముకొనైనా బతుకొచ్చునని’ ధైర్నం జెప్పిండు.
తెల్లారనే లేదు ‘అరేయ్ లచ్చిగా.. ఇంటికాడుంటే నువ్వు ఏగైతవ్, ఆ జడలొల్ల సోపతి వట్టి ఇంకా జంగిలైతవ్. నువ్వు ఏన్నన్న పనికి కుదిరినోనివి గావాలె ముందుగాల్ల’ అని మా అమ్మ లక్ష్మిబాయి లొల్లి షురూ జెయ్యనే జేసింది. ఇగ లాభం లేదని రెండంగీలు, రెండు పాయింట్లు వర్కు సంచిల సదురుకొని ఇంట్లకెల్లి బైటవడ్డ. ఆ తెల్లారే నౌకరెక్కిన. పది ఫేలైనోనికి ఇంకే నౌకరి దొర్కుతది, గదే క్లీనర్ నౌకరి దొర్కింది. అట్లా లారీలల్ల క్లీనర్నయి న. క్లీనర్ అంటే ఒక్క లారీకే గాదు, డ్రైవర్‌కు గూడ. డ్రైవర్ ఏం జెప్తే గది జెయ్యాలె, లేకుంటే స్టీరింగ్ శేతికియ్యడు. లారీ ఆగినప్పుడు క్లీన్ జేసుడు, టైర్ పంచరైతే స్టెపినెక్కిచ్చుడు, రోజు కాయగూరలు కోసుడు నా పని. ఒక్కరోజు నౌకరెక్కితే పది, పదిహేను రోజులు అటే వోవుడు. నాడు నేన్జేసిన పనులు యాదికొస్తే గుడ్లల్ల నీళ్లు దిర్గుతయి. అట్లా మూడేండ్లు మూడు లారీలకు క్లీనర్ జేసి నాలుగో యేడు క్లీనర్ జేసిన లారీకే డ్రైవర్నయిన. పన్నెండు టైర్ల లారీ నుంచి మొదలు డీసీఎం వ్యాన్, టిప్పర్, జేసీబీ ఆఖరికి మూడు టైర్ల ఆటో గూడ నడిపిన.
2010 అనుకుంటా.. ఇంటిముందు వెట్టిన టిప్పర్ లారీ కాడికచ్చిండు బాపు. అద్దాలు తుడుస్తున్న నాతోని ‘వారి లక్ష్మణా.. మన కన్నారం ఆర్టీసీ డిపోల డ్రైవర్ పోస్టులు వడ్డయని తెలిసింది. ఆర్టీసీ అంటే గవర్నమెంటు నౌకరితోని సమానం. ఓ అప్లికేషన్ వారెయ్యకపోయినవ్రా? దబ్బన నౌకరి అస్తెగినా ఇవన్ని తిప్పలు తప్పుతయి గదా బిడ్డా’ అని జెప్పవట్టిండు. ఆరుసార్ల రాస్తే పాసైన పదో తర్గతి సర్టిఫికెట్ వట్టుకవొయి అదేరోజు ఆర్టీసీ డ్రైవర్ పోస్టు కోసం అప్లయి జేసిన.
కన్నారం ఆర్టీసీ బస్టాండ్ల డ్రైవర్‌గా సెలెక్ట్ అయినోళ్ల లిస్టు వెట్టిర్రని నెలరోజుల తర్వాత తెలిసింది. పోయి ఆ లిస్ట్ జూస్తే… ‘కొట్టె లక్ష్మణ్‌రావు, సన్నాఫ్ రాజేశ్వర్‌రావు, మానకొండూర్’ అని నా పేరు కనవడ్డది. అబ్బర బిడ్డా ఇగ నాకు మంచిరోజులొచ్చినయిరా అని మస్తు సంబురవడ్డ. రెక్కలు ముక్కలు జేస్కొని, నోరు కట్టేసుకొని కట్టపడితే నెలకు 15 వేలు కూడా రాకపోతుండె లారీ డ్రైవర్గున్నప్పుడు. అవిగూడ కరెస్టు నెలకొస్తయనే నమ్మకం గూడ లేదు. ఇగ లారీ ఓనర్ దయ. వాడిచ్చిన్నాడు మనం తీస్కున్ననాడు. జేబుల వంద రూపాలు వెట్టుకొని తిరుగుదామంటే దైర్నం రాకపోతుండె. అసొంటిది నెలకు ముప్పై వేల రూపాల జీతం, అవిగూడ ఫస్టుకే తీసుకుంటూ పెండ్లాం పిల్లలతో సంబురంగా సాగుతున్నది నా జీవితం.
అప్పుడే ఆర్టీసీ కార్మికుల సమ్మె షురూ అయింది. ఆ సమ్మె జేసుడు నాకు ఇట్టం లేదుగనీ, నలుగురితోని నారాయణ అనాలె గదా? కనీ ఆ సమయంల అన్నం బెట్టే నౌకరి ఏడ ఊసిపోతదోనని మస్తు రందివడ్డ. నేనే గాదు, నా పెండ్లాం, పోరగాండ్లు గూడ మస్తు బాధవడ్డరు. కనీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను కండ్లకద్దుకొని కాపాడుకున్నడు. సమ్మెజేసిన కాలానికిగూడ జీతం ఇచ్చి నా అసొంటి పేద డ్రైవర్లను అక్కున జేర్చుకున్నడు.
కేసీఆర్ మాట తీసెయ్యకుండా నాడు మళ్లా నౌకరెక్కి స్టీరింగ్ వట్టిందే నయ్యమైంది. లేకుంటే నేనియ్యాళ్ల ప్రభుత్వ ఉద్యోగిని అయ్యేటోన్నా? ఆర్టీసీని ప్రభుత్వంల కలుపుకొని, నా అసొంటి కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన పోరుబిడ్డ కేసీఆర్‌కు ఉద్యమ శనార్థులు.
– గడ్డం సతీష్ 99590 59041