ద్రవిడ సామాజిక బహుజన జీవనంతో ఉత్పత్తి కులాల సంస్కృతి, ద్రవిడ సంస్కృతి బలంగా ముడిపడి ఉన్నాయి. పెరియార్ రామస్వామి దగ్గరి నుంచి, ఎంజీఆర్, కరుణానిధి, స్టాలిన్ వరకు కొనసాగుతున్న రాజకీయ అస్తిత్వమంతా ద్రవిడ స్వీయ రాజకీయ అస్తిత్వంగా నిలబడింది. అట్టడుగు వర్గాల ఉత్పత్తి కులాల పక్షాన నిలిచిన డీఎంకే తమిళనాడులో తిరుగులేని శక్తిగా మారింది. తమిళనాట 57 ఏండ్లుగా వారి ప్రాంతీయ అస్తిత్వమే బహుజన రాజకీయ అస్తిత్వంగా గెలుస్తూ వస్తున్నది. కాంగ్రెస్ బీజేపీ లాంటి పార్టీలు తమిళనేలపై ఇప్పటికీ అడుగుపెట్టలేకపోతున్నాయి. భాషకు జాతికి అవినాభావ సంబంధం ఉందంటారు.
పెరియార్ కంటే ముందు తమిళనాడులో అయోధ్యదాస్, కేరళలో నారాయణ గురు పందొమ్మిదో శతాబ్దంలోనే ఉత్పత్తి కులాల ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. మహారాష్ట్రలో ఫూలే స్ఫూర్తి కూడా దక్షిణాదిపై పడింది. తమిళనాడు మాదిరిగానే తెలంగాణలో కూడా ఉత్పత్తి కులాల సంస్కృతి బలంగా ఉన్నది. తెలంగాణకు నీళ్లు, నిధులు నియామకాలు, స్వపరిపాలన దృక్కోణం నుంచి తెలంగాణ స్వీయరాజకీయ అస్తిత్వం స్వరాష్ట్ర ఉద్యమంగా ఎగసిపడింది. సహజంగానే తెలంగాణ నేలలో పోరాట వారసత్వం ఉన్నది. అదంతా ఉత్పత్తి కులాల నుంచి వచ్చినదేనన్నది స్పష్టం. అది వీరతెలంగాణ సాయుధ పోరాటమైనా, అది వేరు తెలంగాణ స్వరాష్ట్ర పోరాటమైనా.
ఉత్పత్తి కులాలు, సబ్బండ వర్ణాలు ఇందులో క్రియాశీల, త్యాగశీల పాత్ర పోషించాయి. ప్రపంచీకరణ తెరలను చీల్చుకుని జరిగిన పద్నాలుగేండ్ల ఉద్యమం ఉద్యమాల చరిత్రలో అసాధారణమైనది. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమానికి మద్దతు కూడగట్టడంలో కేంద్రంపై అలుపెరుగని పోరాటం చేయడంలో బీఆర్ఎస్ కృషి అజరామరం. తెలంగాణలోని ఉత్పత్తి కులాలను, సబ్బండవర్ణాలను ఒక్కతాటిపై తెచ్చిన ఘనత తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికే దక్కుతుంది. కేసీఆర్ మొండితనం, అలుపెరుగని దీక్ష ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చింది. ఉత్పత్తి కులాలు, సబ్బండవర్ణాలను ఏకంచేసి ఒక్కతాటిపైకి తెచ్చే క్రమాన్ని కేసీఆర్ రాజకీయ ప్రక్రియ ద్వారా ఒడుపుగా పట్టుకుని తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. ఇది తెలంగాణ చరిత్ర. రాష్ట్ర అవతరణ తర్వాత పునర్నిర్మాణానికి దారులు వేగంగా పడ్డాయి. స్వపరిపాలన విషయంలో సమాజంలో సగభాగమైన బీసీలకు అన్నిరంగాల్లో దక్కాల్సిన వాటాల ఖాళీలను పూరించవలసి ఉన్నది. స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ వరకు బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు లేవు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలోని బీసీల జీవన్మరణ సమస్య 77 ఏండ్లుగా కొనసాగుతూనే ఉన్నది. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వమంటే అది తెలంగాణ బహుజన స్వీయ రాజకీయ అస్తిత్వంగా మారవలసి ఉంది. బీఆర్ఎస్ ఈ చారిత్రక కర్తవ్యాన్ని నెరవేర్చే బాధ్యతను భుజం మీద వేసుకోవాలి. అందుకు తమిళనాడును ప్రతీకగా తీసుకోవాలి. బడుగులకు అందాల్సిన ఫలాలన్నీ అందించే కృషి జరగాలి.
తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వమే మనమూల భాషల్ని, మూల సంస్కృతుల్ని, ఉత్పత్తికులాల సంస్కృతిని కాపాడుతుంది. గ్రామదేవతల సంస్కృతి నుంచి వచ్చిన సామాజిక ఐక్యత, గంగాజమున తెహజీబ్ సంస్కృతి ఈ నేలపైన చిరస్థాయిగా నిలిచిపోవాలంటే తెలంగాణ బహుజన స్వీయ రాజకీయ అస్తిత్వం చెరిగిపోకుండా కాపాడుకోవాలి. ఈ మహా సంకల్పాన్ని బహుజనుల చేతుల మీదుగా నడిపించే శక్తి తెలంగాణను సాధించిన స్వీయ రాజకీయ పార్టీకే ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీలకు ఉండదు. ఉత్పత్తి కులాలను, ఉత్పత్తి కులాల పునాదులైన బీసీలను, దళిత ఆదివాసీ మైనార్టీలను కలుపుకొని తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. ఆ దిశగా బహుజన నాయకత్వం పెరగవలసి ఉంది.
ఇప్పుడు తెలంగాణలో రావాల్సిన మార్పు అంటే అది ఉత్పత్తి కులాల బహుజన సాధికారితనే చెప్పాలి. దీనికి స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ, పార్లమెంటు వరకు రాజ్యాధికారంలో వీరి వాటా వీరికి దక్కి తీరాలి. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలాగా ఇది నిరంతర ఉద్యమంగా సాగాలి. ఇదే బీఆర్ఎస్కు బలంగా మారి దేశంలో ప్రాంతీయ అస్తిత్వాలను కలుపుకొనిపోయే శక్తిగా నిలుస్తుంది. ఆధిపత్య వర్గాలు అధికారం పొందడం కోసం తిమ్మిని బమ్మి చేసే ఎన్నికల సందర్భాలను చూడడం విచారకరం. తెలంగాణలో ఇంకా కిర్రుచెప్పుల బుర్రమీసాల పెత్తందారీతనాలు తమ అధికారాన్ని చెలాయించే స్థితి నుంచి రాజకీయాలు తెలంగాణ బహుజన స్వీయ రాజకీయ అస్తిత్వం వైపునకు మళ్లాలి.
తెలంగాణ సమాజాన్ని అధికారం కోసం తమ ఆధిపత్య పెత్తనాల కోసం సమాజ విభజనలకు దారితీసే విద్వేష శక్తుల నుంచి కాపాడాలి. తెలంగాణ గ్రామసీమల్లో ఉన్న గొప్ప మానవీయ సంస్కృతి ఛిద్రం కాకుండా చూసుకోవాలి. స్థానిక సంస్థల్లో సగానికి పైగా జనాభా గల బీసీలకు సగం సీట్లు దక్కాలి. బీసీ, ఎంబీసీలు అసెంబ్లీలోకి వారి స్థానాలను భర్తీ చేస్తూ పోవాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు మేలు జరగాలి. బీఆర్ఎస్ మాత్రమే ఈ బాధ్యతను భుజంపై వేసుకుని ముందుకు సాగుతుంది. తెలంగాణ స్థానికత బహుజన మూలాలతో ఉంది. అదే తెలంగాణ సమాజం బలం, బలగం.
– జూలూరు గౌరీశంకర్