రేవంత్ ప్రభుత్వం చెల్లని నాణేల్లాంటి హామీలతో ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నది. వాటిలో ఒకటి బీసీ కులగణన. స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల అవసరార్థం ఇప్పుడు ఈ లెక్కలు చేపట్టింది. మొదట ఈ కార్యాన్ని బీసీ కమిషన్ చేతిలో పెట్టింది. సరిపడా సిబ్బంది లేని బీసీ కమిషన్ తన వల్ల కాదని చెప్పలేక, వివిధ శాఖల సహకారంతో ఈ కార్యాన్ని ఎత్తుకోవడానికి సిద్ధపడింది.
నిజానికి బీసీ కమిషన్ విధులు వేరు. సర్వే చేసినా ఆ సంస్థ ఇచ్చే గణాంకాలకు ఎలాంటి చట్టబద్ధత ఉండదు. ఆ విష యం ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు. ఈ కుట్రను గమనించిన బీసీ నేతలు కులగణన కోసం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. దాని నియామకం కోసం కోర్టుకు వెళ్లారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340కి లోబడి చేయని గణన చెల్లదని ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. అప్పుడు దిగొచ్చిన సర్కారు ఓ విశ్రాంత ఉన్నతాధికారి నేతృత్వంలో కులగణన కోసం ఓ డెడికేటెడ్ కమిషన్‌ను నియమించింది. నవంబర్, 2024 మొదటి వారంలో ఈ సర్వే జరిగింది.
ప్రభుత్వం ఈ గణనకు ‘సామాజిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే’ అని పేరు పెట్టింది. ప్రశ్నావళిని ‘ఆల్ ఇన్ వన్’ ైస్టెల్లో రూపొందించారు. ‘మీరు ఏ కులానికి చెందినవారు?’ అని ఒకే ప్రశ్న ప్రజలను అడిగితే స్పష్టమైన సమాధానం వచ్చేది. కానీ ‘మీకు ఎన్ని ఇండ్లున్నాయి, ప్లాట్లున్నాయా? భూములున్నాయా? ఆదాయమెంత? కారు ఉన్నదా? ఇన్కమ్ టాక్స్ కడుతున్నారా?’ లాంటి 57 ప్రశ్నలు ఉండేసరికి ఇదేదో నష్టం చేసేలా ఉందని కొందరు భావించారు. వివరాలు సరిగ్గా చెప్పలేదని, ఈ లెక్కలన్నీ మీకెందుకు చెప్పాలని, కులం తప్ప మరేమీ చెప్పబోమని గణనకు వెళ్లిన ఉద్యోగులను జనం నిలదీస్తున్నారని అప్పుడే పత్రికల్లో వచ్చింది. సర్వేలో చెప్పిన కులం వాస్తవమే అని నమ్మడానికి రుజువేమీ లేదు. ఇంటివాళ్లు ఏం చెప్పారో, ఎన్యుమరేటర్ ఏమి రాసుకున్నాడో అనే విషయంలోనూ స్పష్టత లేదు.
ఈ గణనలో సేకరించిన వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని, ఎవరికీ ఇవ్వబోమని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే. ఒక నిర్ణీత ప్రాంతానికి చెందిన కుటుంబాలు తెలిపిన కులానికి చెందిన సమాచారం ప్రభుత్వం ఇవ్వగలిగితే ‘ఈ లెక్కలు తప్పుల తడక’ అంటున్న సంఘాలు, పార్టీలు ఆయా ప్రాంతాల్లో రీ సర్వే నిర్వహించుకొనే అవకా శం ఉన్నది. ఎవరైనా ఈ పని చేపట్టడానికి ముందుకు వస్తే ప్రభుత్వం అధికారికంగా సహకరించాలి.
2014లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జరిపిన ‘సమగ్ర కుటుంబ సర్వే’లో 51శాతం ఉన్న బీసీల జనాభా పదేండ్లలో 5 శాతం ఎలా తగ్గుతుందని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టా యి. దీనికి సర్కారు వద్ద సరైన జవాబు లేకుం డాపోయింది. ఈ సర్వేలో ప్రభుత్వం కావాలని బీసీల సంఖ్య తగ్గించిందా? లేక, సమాచార సేకరణలో లోపముందా? ఏదైనా జరగవచ్చు. బీసీల జనాభా ఎలా తగ్గిందని మేధోమథనం చేయకుండా కాంగ్రెస్‌లోని బీసీ పెద్ద లు, మంత్రులు ‘అంతా పద్ధతి ప్రకారమే జరిగింది. ఇందులో లోపాలు లేవు’ అనడం తమ జాతికి ద్రోహం చేయడమే అవుతుంది. రాష్ట్రంలో 96.9 శాతం కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయని ప్రభుత్వం చెప్తున్నది. పర్సంటేజీలో 3 శాతం అనిపించినా సర్వేలో పాల్గొనని కుటుంబాల సంఖ్య 3.56 లక్షలు. అంటే సుమారు 15 లక్షల మంది వివరాలు సేకరించలేదు. వాటి ని కూడా సేకరించి లెక్కల్లో కలపాలి. ప్రశ్నావళి ఒకరితో పూరింపబడి మరొకరితో కం ప్యూటర్‌లో ఎంట్రీ అయింది. ఇందులో మానవ తప్పిదాలు జరిగే అవకాశం ఉన్నది. ఈ విషయంలో క్రాస్‌చెక్ అవసరం. ప్రశ్నల్లో కులం లేదు, మతం లేదనే కాలమ్స్ కూడా ఉన్నాయి. వాటిని వాడుకోవచ్చు. ‘లేదు’ అన్న వ్యక్తులు ఎందరున్నారో ప్రభు త్వం చెప్తే బాగుంటుంది.
కులగణన తప్పులపై అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసి ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే బీజేపీ సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నది. ఎన్నో ఏండ్లుగా దేశంలోని వెనుకబడిన వర్గాలు జనాభా లెక్కల్లో ‘కులం’ కూడా చేర్చాలని కోరుతున్నాయి. కులాల లెక్కలు దేశాన్ని ముక్కలు, చెక్కలు చేస్తాయనేది బీజేపీ కేంద్ర పెద్దల మొరటు అభిప్రా యం. కులం గురించి అడిగేవారిని దేశ విచ్ఛిన్నకర శక్తులుగా ప్రచారం చేస్తున్నారు. దీనివ ల్ల క్యాస్ట్ ఫీలింగ్ పెరుగుతుందని, మనుషుల మధ్య అగాథం ఏర్పడుతుందని వారు కొత్త రాగం ఎత్తుకున్నారు. జనగణన జరిగినా అం దులో కులం చేర్చే ప్రసక్తే లేదని కేంద్రం గట్టి గా చెప్తున్నది. ఆ పార్టీలోని బీసీలు ఈ విషయంలో కిమ్మనడం లేదు.
కులగణనలో బీసీల సంఖ్య తప్పుగా ఉన్నదని, బీసీల్లో ముస్లింలను కలిపి ఎలా చూపిస్తారని రాష్ట్ర బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. ఇప్పు డు తెలంగాణలోని బీసీ, మాదిగల అగ్రనేతలు బీజేపీ మనుషులయ్యారు. వారిని ఆయా కుల నేతలుగా కాకుండా బీజేపీ ప్రతినిధులుగానే ప్రభుత్వం భావిస్తున్నది. వారి డిమాండ్ల సాధన బీజేపీ ఖాతాలోకి వెళ్తుంది. ‘ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను కాపాడే, బీసీ రిజర్వేషన్‌ను నీరుగార్చే కుట్రలో భాగంగానే బీసీల జనాభాను తక్కువ చేసి చూపించారని’ ఆర్.కృష్ణయ్య అంటున్నారు. ఈ లెక్కలు సరిచేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా బీసీల తిరుగు బాటు తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. అదే నిజమైతే బీజేపీ ఆయనకు దన్నుగా నిలబడుతుందా? కేంద్రం నుంచి ఆయనకు ఎలాంటి సాయం అందుతుందో చూడాలి.