మహాభారతం భారతీయుల జీవితాలతో తరతరాలుగా విడదీయలేని అనుబంధాన్ని పెనవేసుకున్నది. ప్రజాకవి జయరాజు విరచిత కావ్యగానామృతం ‘శిలా నీవే – శిల్పి నీవే- శిల్పం నీవే’ కూడా అంతే. ఇంకా ఓ అడుగు ముందుకేసి ఆధునిక ప్రపంచ మానవాళికి చేస్తున్న హితబోధ కూడా. మానవుని జీవన గమ్యాన్ని, గమనాన్ని తన పద చరణాలతో మానవజీవితపు చీకటి పొరల్లోకి తొంగిచూసే టార్చ్ ఇది. తన కావ్యగానాన్ని జీవిత సందేశంగా తొలి పదంలోనే చెప్తూ ముందు పంక్తుల్లోకి మనల్ని తీసుకెళ్తాడు జయరాజు. ‘శిలా నీవే-శిల్పి నీవే-శిల్పం నీవే’ పంక్తులు గాయకుని గొంతులో నుంచి పలికిన ప్రతిసారి ‘ఓ మానవుడా ఎలా ఉన్నావు. ఎలా ఉండాలి. ఎందుకీ వెంపర్లాట. ఎందుకీ ఎల్లలు లేని సుఖసంతోషాల వేట. ఎటు నుండి ఎటు వైపునకు వెళ్లాలని అనుకుంటున్నా’వని పదే పదే మనల్ని ప్రశ్నిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటుందీ గానం.
గుహల్లో నుంచి మానవ జీవనయా నం కాస్మోపాలిటన్ నగరాల వర కు పయనించింది. ఈ ప్రయాణంలో తనకు జీవామృతాన్నిచ్చిన ప్రకృతిని మనిషి ఎప్పటి కప్పుడు త్యజిస్తూ, దాన్ని సవాలు చేస్తూ త రాలుగా ముందుకు సాగుతున్నాడు. తన పూ ర్వపు తరాల కంటే తాను చాలా ఉన్నతంగా ఉన్నానని భావిస్తున్నాడు. భ్రమిస్తున్నాడు. అదే తీరులో జీవిస్తున్నాడు. ఇదే జీవన మార్గ మని అనుకుంటున్నాడు. మార్కెట్ మాయా లోకంలో మనిషి తానో వినియోగదారుడన్న విషయాన్ని గుర్తించనట్టుగానే తాను ప్రకృతి లో భాగం అనే విషయాన్నీ మర్చిపోతున్నా డు. పోయాడు కూడా. ఇదే విషయాన్ని ప్రతి నాలుగు లైన్లకోసారి శ్రోతలకు తలపై ప్రేమగా నిమిరి చెప్తున్నాడు. కొన్ని పంక్తుల్లో తల్లిగా హితబోధ చేస్తున్నాడు. మరి కొన్ని పంక్తుల్లో లెక్కల మాష్టారులా గుడ్లు రిమినట్టు కన్పి స్తాడు. మనతో పాటు మన పూర్వీకులు ప్రకృ తికి, సాటి మనుషులకు చేసిన తప్పిదాలను కాస్త కఠినంగా….హెచ్చ రిస్తూ పితృహృదయ హస్తాలతో నిమురుతూ హెచ్చరిస్తున్నట్టుగా జయరాజు మానవ జన సముహాలను సోయి లోకి రమ్మన్నట్టుగా పదాలల్లాడు.
బుద్ధుడు తథాగతుడై మానవ జీవితగమ నానికి మార్గనిర్దేశనం చేశాడు. ప్రజాకవి అయిన జయరాజు కూడా కమ్యూనిస్టు విప్లవమార్గం నుంచి ప్రాణికోటి ప్రాణాధారమైన ప్రకృతి ఒడిలోకి వెళ్లిపోయాడు. కాలంతో పాటు ప్రజల సమస్యలు మారాయి. వారి ఆలోచనలు మారాయి. ప్రజాకోణాన్ని ఆచరిస్తూ నాడు విప్లవం బోధించిన అతడే నేడు ప్రకృతిలో మనిషిగా మమేకం కావాలని చాలా ముం దుకు ప్రయాణించాడు.
ఈ సంధియుగంలో సాహిత్యంలో ఒక స్తబ్దత నెలకొన్నది. దాన్ని బద్దలు కొడుతూ శిలల్లోకి..శిల్పాల్లోకి అక్షరాలను జీవితాలను నేర్పుతో ఒంపి ముందు తరాలకు అమృతం లా అందించారు జయరాజ్.
‘కొండల్లో కోయిలపాట’ అయి న కవి… నాడు అక్షరాలు దిద్దాలని చెప్పాడు. ‘పచ్చని చెట్టు నేనురా..పాలు కారే మనస్సు నాదిరా’ అంటూ తేనెలూరే జీవితరసాన్ని సరికొత్తగా ఆవిష్కరించాడు. వాస్తవానికి జయరాజ్ సాహిత్యంలో ప్రకృతి ఎప్పటి నుంచో అంతర్భాగంగా ప్రవహిస్తూ ఉన్నది. బహుశా అడవి జీవితానికి దగ్గరగా ఉండటం వల్లనో… భూమి పొరల్లో పనిచేసే బొగ్గుగని కార్మికుల జీవితా లతో మమేకం కావడం వల్లనో కానీ అక్షరాలు నిప్పులనే కాదు పండు వెన్నెల్లాంటి చల్లదనాలను పంచడాన్ని అలవర్చుకొని ఏరు లా పారు తున్న కవి జయరాజ్. ఇప్పుడు బు ద్ధుని వెంట బోధివృక్షమై నడుస్తున్నాడు.
మానవ జీవన సమస్యలకు మనస్సు కారణమని గౌతమ బుద్ధుడు చెప్పాడు. ఆధునిక మానవుడు అంతులేని ఉచ్చుల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరవుతున్నాడు.అన్నీ అందుబాటు లో ఉన్నట్టే ఉంటాయి.ఏవీ తనవి కావు. ఏదో చేయాలనుకుంటాడు.ఏమీ చేయలేక పోతాడు. ఇలాంటి అనేక సందేహాలకు అలతి అలతి మాటలతో మార్గాన్వేషణను చూపిస్తున్నాడీ కవి. ఈ సుదీ ర్ఘ కావ్యగానంలోని కొన్ని పంక్తులు మానసిక వికాస నిపుణుడిలా ఈ తరానికి బోధిస్తున్న ట్టు ఉంటాయి. మరికొన్ని జనన మరణాల గుట్టును మనుషుల డీఎన్ ఇదే అంటూ సు లభంగా విప్పిచెప్పే సీసీఎంబీ సామాజిక పరిశోధకునివిగా దర్శనమిస్తాయి. వెనువెంట నే సరి కొత్త స్వరంతో కొత్త జీవపు పరిమళా లు వెదజల్లే సరికొత్త వసంత రుతువులా నూ తన పల్లవి అందుకొన్న పిల్లన గ్రోవి అవుతాడు.
కాళిదాసు మేఘసందేశంలో ప్రియుడు, ప్రియురాలికి మేఘాలతో సందేశం పంపిస్తే ఈ తరం వాగ్గేయకారుడు జయరాజు యావ త్ ప్రకృతి కలవరింతల, పలవరింతల, తుళ్లింతల, తుంపరల, పిల్లగాలుల తెమ్మెరలను జన సమూహాలపై కుమ్మరించాడు. పాల పిట్టల అరుపులను, పక్షి రెక్కల చప్పుళ్లను తనతత్వగీతంలో మనిషి చెవుల దగ్గరకు తీసుకొచ్చా డు. తనను తాను చెక్కుకుంటూ చరిత్రలో ఎట్లా నిలిచిపోవాలో ఈ తత్వగీతాలు ముక్కు సూటిగా చెప్తాయి. చేయి పట్టుకుని లక్ష్య మా ర్గం వైపు తీసుకెళ్తాయి. ప్రకృతిలో తానే ఓ భాగమనే విషయాన్ని మర్చి పోయిన మనకు ప్రకృతి ప్రతి అణువును తమదే అని, పరవశించాలనే జీవిత లోతులను సునాయాసంగా నాలుగైదు అక్షరాల్లో ఒడిసి పట్టుకుని మన దోసిళ్లలో పోసినట్టుగా ఆ ఆలోచనకు రూపమిస్తే ఇట్లా ఉంటుందనే బొమ్మను మన గుండెల్లో ముద్రవేస్తున్నట్టుగా ఈ తాత్విక పద కావ్యగాన ప్రవాహం సాగిపోతూ ఉంటుంది.
అతి కొద్ది మంది మాత్రమే జీవితంలో అనుకున్నది సాధిస్తున్నారు. రాబోయే తరా లకు మార్గ దర్శకులవుతారు. ఎందువల్ల అనే సందేహం వచ్చే వారికి ఈ తత్వజ్ఞానం తప్పకుండా సమాధానం చెప్తుంది. ప్రపంచ ప్ర ఖ్యాతిగాంచిన ప్రకృతిని ఆరాధించే విలియ మ్ వర్డ్స్ వర్త్, భారతీయుడైన బిబూతి భూష ణ్ బంధోపాధ్యాయ, విశ్వకవి రవీంద్రనాథ్ కంటే ఓ అడుగు ముందుకేసి ప్రకృతిని చూపిస్తున్నాడు జయరాజు.
ప్రకృతిని చూసే కండ్లు వాటిని ఆరాధించాలి. వాటిని అంతం చేయ కూడదు. ప్రకృతి ధ్వంసమైతే మానవ జీవితం అంతరించినట్టే. ఇల్లు, పిల్లలు సుఖంగా, సంతోషంగా ఉండాలంటే.. చెట్టు పచ్చగా ఉండాలని మోదుగుపూలంత అందంగా వలపోస్తాడు కవి. పిచ్చుకలు, చిలు కలు, తీరొక్క పూలంత అందంగా విహరించే సీతాకోక చిలుకలు, సెలయేళ్ల ధారలు, మక రందాలను మోసుకొచ్చే తేనేటీగల అడుగులను, పండ్లరుచి, శుచిలను సజీవంగా ఉంచుకోవాలంటున్నాడీ కవి.
అంతేకాదు జీవావరణాన్ని బతికిస్తున్న వాతావరణంలోని మేఘాలు, గాలి, ధూళి మిశ్రమాల సంకేత మూలకాలను విడ మర్చి చెప్తూ గోధూళిని ఆస్వాదించాలంటున్నాడు. పసిడి పంటలు, పాల ధారలు, అన్నీ మనచు ట్టే ఉన్నాయి. ఏవీ లేవని బాధపడతా వెందుకంటూ అనంతమైన దృక్కులతో తన సువిశా ల ఆలోచనతో జీవించడంలో ఉన్న మధురిమను చూపెడుతాడు. ఈ కావ్యగానామృతం విన్న తర్వాత తమ చుట్టూ ఇంతటి అద్భుతమైన ప్రపంచం అల్లుకుని ఉన్నదా అనిపిస్తుం ది. ఈ లోకంలో ఎవ్వరూ అనాథలు కారని… అన్నీ ఉన్నా కూడా ఏమీ లేదని భావించే వా రి గురించి ఈ కవి వేదన చెందుతాడు. చందమామ, ఇంద్ర ధనస్సు, వెండి వెలు గు, విశ్వమున విర బూసే తారలు అంటూ మానవుల పుట్టుక ఎంత అదృష్టమో కదా అంటూ వేద నా భరిత జీవులను, అచే తన హృదయాలకు ప్రకృతి లేపనాన్ని అద్ది వారి కండ్లను తన తాత్వికతతో స్పర్శిం చేందుకు యత్నిస్తాడీకవి.
జన్మ, పునర్జన్మల గురించి వేల ఏండ్ల కింద నే బుద్ధుడు చెప్పిన సూక్ష్మ సారాంశాన్ని, బుద్ధ్ది స్టు తాత్వికతను ఎత్తి చూపించాడు. మేఘాలు కదిలి కరిగితే నదులై పారుతాయంటూ మనుషులు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ప్రయాణించాలో చూపిస్తాడు. అంతులేని దురాశలను, నీతి బాహ్య విషయాలను ఎట్లా త్యజించాలో, ప్రకృతిలో ఎట్లా మమేకం కావాలో ఇరవై మూడు నిముషాల తాత్వికధారలో గు దిగుచ్చి ముందు తరాలకు అందించిన ప్రకృ తి కవి జయరాజు. ఈ కావ్యగానాన్ని విన్న ప్రతి ఒక్కరూ ప్రకృతిని తమ గుండెలతో చూస్తారు. మనకాలపు గిజిగాడు ఈ జయరాజు. తమ జీవితాలను శిలా నీవే శిల్పం నీవే అ ని కవిరాజు..జయరాజు కలం వెలు గు దారిలో చూసు కుంటారనటంలో సందేహం లేదు.
– గొర్ల బుచ్చన్న 87909 99116