నేడు ఎమ్మెల్యేలు, నాయకులు కొందరు బీఆర్ఎస్ను వీడుతున్న క్రమంలో కొన్ని సోకాల్డ్ మీడియా సంస్థలు.. ‘ఇక బీఆర్ఎస్ పార్టీ పనైపోయింద’ని చంకలుగుద్దుకుంటూ పైశాచికానందాన్ని పొందుతున్నాయి. కొన్ని ఆంధ్రా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు తెలంగాణ ఉనికిని ప్రశ్నార్థకం జేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మీడియా సంస్థలకు రైతుల గోస, నేతన్నల ఆత్మహత్యలు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు చేస్తున్న నిరాహార దీక్షలు కనిపించవు. ‘కేసీఆర్ కంటే బాగా అభివృద్ధి చేస్తారని నమ్మి ఓటేస్తే మమ్మల్ని నిండా ముంచుతున్నార’ని పల్లెల్లో రచ్చబండల వద్ద నడుస్తున్న చర్చలు అసలే కనిపించవు.
ఒకరిద్దరు పోయినంత మాత్రాన బీఆర్ఎస్కు ఏమీ కాదు. 1984లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు స్థానాల్లోనే గెలుపొందిన బీజేపీ 2019కి వచ్చేసరికి 303 సీట్లలో విజయం సాధించింది. మళ్లీ 2024కు వచ్చేసరికి ఆ సంఖ్య 240కి పడిపోయింది. మన పొరుగు రాష్ట్రమైన ఏపీలో 2014లో వైఎస్సార్సీపీ 70 స్థానాలకే పరిమితమైంది. 2019లో అదే పార్టీ 151 సీట్లను కైవసం చేసుకొని అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ 11 సీట్ల వద్దే ఆగిపోయింది. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీ, జనసేనలతో పొత్తుపెట్టుకుంటే గానీ 164 సీట్లు సాధించలేదు. కాబట్టి, ప్రస్తుత బలాబలాలతో సంబంధం లేకుండా తర్వాతి ఎన్నికల్లో గెలుపోటములు ఉంటాయి.
తెలంగాణ సబ్బండవర్గాల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ప్రతీ వ్యక్తి నరనరానా తెలంగాణ నినాదం ఉన్నది. తెలంగాణ చరిత్రను, తెలంగాణ భాషను, యాసను, ఉనికిని రక్షించగలిగేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. తెలంగాణ ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా కేసీఆర్ మళ్లీ ఉద్యమిస్తారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై తప్పుడు ప్రచారాలతో బురదజల్లుతూ పైశాచికానందం పొందుతున్న సోకాల్డ్ మీడియా సంస్థల పట్ల తస్మాత్ జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఇక బీఆర్ఎస్ పైకి లేవదు, ఆ పార్టీలో కేసీఆర్ ఒక్కరే మిగులుతారని కొందరు అంటున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టింది కూడా కేసీఆర్ ఒక్కరేనన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. నిజానికి బీఆర్ఎస్ పనైపోయిందని ప్రచారం చేయడం ఒక పెద్ద మైండ్‌గేమ్. బీఆర్ఎస్, కేసీఆర్ పనైపోయిందనుకొని సంబురపడ్డ ప్రతీసారి అలా అనుకున్నవాళ్లే పత్తా లేకుండా పోయారు. కేసీఆర్ మాత్రం కిందపడ్డ ప్రతీసారి రెట్టించిన వేగంతో ఉవ్వెత్తున పైకి లేశారు. ఆయన తలచుకుంటే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించగలరు. ఒక్క ఓటమితో కేసీఆర్ పనైపోయిందనుకోవటం మూర్ఖత్వమే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కేవలం 2 శాతం లోపు ఓట్ల తేడాతోనే. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు మరిచిపోకూడదు.
కేసీఆర్‌ను బదనాం చేసి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి, బీఆర్ఎస్ను అస్థిరపరచాలని కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నది. అయితే బీఆర్ఎస్ను కాపాడుకోవటం ఇప్పుడు కేసీఆర్ కంటే తెలంగాణ ప్రజలకే ఎక్కువ అవసరం. ఎందుకంటే తెలంగాణ ప్రజల పక్షాన పోరాడేది, తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే. అందుకే త్వరలో బీఆర్ఎస్ పార్టీలో ప్రక్షాళన జరుగుతుందని పార్టీ శ్రేణులే కాదు, తెలంగాణ ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ మనుగడ తెలంగాణ రాష్ర్టానికి ఓ ప్రాణ వాయువు!
– మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి