అమెరికాను కాదని స్వతంత్రించి నిలబడటానికి బ్రిక్స్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను అగ్రరాజ్యం ఏ మాత్రం ఇష్టపడటం లేదనేది తెలిసిందే. అమెరికా, పశ్చిమ యూరప్ ప్రభా వ పరిధికి దూరంగా ఆర్థికాభివృద్ధి కోసమే ఏర్పడిన బ్రిక్స్ కూటమిని లక్ష్యంగా చేసుకొని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాఖీదులు జారీ చేస్తున్నారు. ఇంతకూ అగ్రరాజ్య పెద్దకు బ్రిక్స్ పై అంత కోపం దేనికి? ఆ కూటమి ప్రభావం రోజురోజుకు పెరగుతుండటమే అందుకు కారణమని చెప్పాలి. 2009లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలతో ఏర్పాటైన కూటమిలో 2010లో సౌతాఫ్రికా చేరింది. ఆయా దేశాల ప్రథమాక్షరాలతో బ్రిక్స్ అనే పేరు స్థిరపడింది. తర్వాతి కాలంలో బ్రిక్స్‌పై మరిన్ని దేశాలు ఆసక్తిని పెంచుకున్నాయి. 2024లో ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 2025లో ఇండోనేషియా సభ్యత్వం తీసుకున్నాయి. థాయ్‌లాండ్, నైజీరియా, క్యూబా, ఉజ్బెకిస్థాన్ సహా మరో 10 దేశాలు ‘భాగస్వామ్య’ హోదా పొం దాయి. సౌదీ అరేబియా, పాకిస్థాన్‌తోపాటు ఇంకా అనేక దేశాలు సభ్యత్వం కోసం ఎదురుచూస్తున్నాయి. ఆర్థిక రంగంలో అమెరికా, పశ్చిమదేశాల పెత్తనం నుంచి దూరంగా వైదొలగాలని భావించే దేశాలన్నీ బ్రిక్స్ గొడుగు నీడకు చేరుతున్నాయి.
బ్రిక్స్ దేశాలు తమలో తాము ప్రత్యామ్నా య వాణిజ్య సంబంధాలు నెలకొల్పుకోవాలని భావిస్తున్నాయి. సహజంగానే ఇది ‘పశ్చి మ’ ఆధిపత్యానికి గండికొడుతున్నది. ఆ గుం పులోని శక్తివంతమైన దేశం అమెరికాకు ఇది ఏ మాత్రం గిట్టని వ్యవహారంలా తయారైం ది. డాలర్ మారకాన్ని వదిలేసుకొని, సరికొత్త అంతర్జాతీయ కరెన్సీ వ్యవస్థను రూపొందించుకోవాలనే బ్రిక్స్ ఆలోచనపై ఆరు మాసాల క్రితమే, రెండోసారి ఎన్నికైన తొలినాళ్లలో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. డాలర్‌ను వదిలేస్తే వంద శాతం సుంకాలకు సిద్ధం కావాలని బ్రిక్స్ దేశాలను ఆయన బెదిరించారు. సభ్యదేశాలపై అదనపు టారిఫ్ విధిస్తానని ఇదివరకే బెదిరించిన ట్రంప్.. తాజాగా బ్రిక్స్ కూటమి ‘అమెరికా వ్యతిరేక’ విధానాలతో ‘చేతులు కలిపే’ దేశాలపై అదనంగా పది శాతం సుంకం, అదీ ఎవరికీ ఎలాంటి మినహాయింపులు లేకుండా విధించనున్నట్టు ప్రకటించడం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. బ్రెజిల్లో బ్రిక్స్ శిఖరాగ్ర సద స్సు మొదలయ్యేరోజే ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
అమెరికాలో అంతకంతకూ పెరుగుతున్న నిస్పృహ ట్రంప్ తాఖీదుల్లో వ్యక్తమవుతున్నది. బ్రిక్స్‌ను ఏకాకిని చేసి ముక్కలుచెక్కలు చేయాలనేది ఆయన అంతిమ లక్ష్యమని తెలిసిపోతూనే ఉన్నది. ఏకధ్రువ ప్రపంచంలో తన ఆధిపత్యానికి ఏ మాత్రం భంగం కలిగి నా అమెరికా సహించదని మరోసారి రుజువైంది. అయితే ట్రంప్ ప్రకటనతో బ్రిక్స్ దిగిరావడం మాటేమో గానీ, తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురుకావడం మనం చూస్తున్నాం. ట్రంప్ తీరును ప్రస్తుత బ్రిక్స్ చైర్మన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ద సిల్వా తప్పుపట్టడమే కాకుండా బాధ్యతారాహిత్యమని దుయ్యబట్టారు. మారిన ప్రపంచానికి ‘చక్రవర్తులు’ అక్కరలేదని, సార్వభౌమాధికారం కలిగిన దేశాలతో ఇలా వ్యవహరించడం కుదరదని ఆయన కొంచెం ఘాటుగానే ప్రతిస్పందించా రు. చైనా కొంత నర్మగర్భితంగా, రష్యా ఇం కొంచెం సూటిగా అమెరికాను మందలించాయి. త్వరలో బ్రిక్స్ చైర్మన్ పదవి చేపట్టను న్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను సరికొత్తగా సవరించుకోవాల్సి ఉన్నదని చెప్పడం విశేషం. బ్రిక్స్ మౌలికంగా వాణిజ్య ప్రయోజనాల పరిరక్షణకు ఏర్పడిన కూటమి. రష్యా, చైనా, బ్రెజిల్, ఇండియా వంటి దేశాలను టారిఫ్‌లతో బెదిరించి సాధించేదేమీ ఉండ దు. తన ప్రయోజనాలు తనకు ఎంత ముఖ్య మో, ఇతర దేశాలూ అలాగే ఆలోచిస్తాయని అమెరికా గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే, అమెరికాను ధిక్కరించాలని బ్రిక్స్‌కు ఎంత తపన ఉన్నా.. సదస్సు చివరన వెలువరించిన ఉమ్మడి ప్రకటనలో పేర్లు ప్రస్తావించకుండా సుంకాల బెదిరింపులు, ఇరాన్‌పై దాడిని ఖండించడం గమనార్హం. ఇది అనివార్యతల ప్రపంచం కదా!