అప్పు చెల్లించని ఎగవేతదార్ల ఇండ్లముందు బ్యాంకర్లు ధర్నాలు చేసిన ఉదంతాలున్నాయి. అదే తరహాలో అప్పు రాబట్టుకునేందుకు బీజేపీ తెలంగాణ ముఖ్యనేత ఒకరు తన సొంత పార్టీ నాయకుడి వార్తలు, ఫొటోలు, చివరికి ఆయన పేరు కూడా తన సొంత మీడియాలో రాకుండా నిషేధం విధించారు. ఉప ఎన్నికల ఖర్చుల కోసం బీజేపీ పారిశ్రామికవేత్త ఒకరు అప్పు ఇచ్చారు. వాటిని అభ్యర్థి తిరిగి చెల్లించకపోవడంతో డిఫాల్టర్‌గా మారారు. దీంతో సదరు నేతకు సంబంధించిన వార్తలను తన సొంత మీడియాలో నిషేధం విధించారు.
ఇటీవల బీజేపీ తెలంగాణ ముఖ్యనేతలు ఢిల్లీలో పార్టీ అగ్రనేత అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆ వార్తను సదరు నేతకు చెందిన ఛానల్ ప్రసారం చేసినప్పటికీ, అందులో తనకు బాకీపడిన నేత పేరు, ఫొటో ఎక్కడా కనిపించకుండా చేసిన సెన్సారింగ్ జరగడం కొట్టొచ్చిన్నట్టు కనిపించింది. అంటే, అప్పునకు.. వార్తకు సదరు మీడియా అధిపతి లింక్ పెట్టడమేమీ బాగులేదని ప్రస్తుతం బీజపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.