e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home ఎడిట్‌ పేజీ పరమ గురు హంస

పరమ గురు హంస

నేడు రామకృష్ణ పరమహంస వర్ధంతి

సర్వమత బోధనల, పారమార్థిక సాధనల కలబోతే రామకృష్ణ పరమహంస. మానవ శరీరంతోనే మాధవుడిని దర్శించుకునే మార్గాన్ని ఆచరణలో చూపిన ఆధ్యాత్మిక సుసంపన్నుడు ఆయన. యోగి మాత్రమే కాదు యోగీశ్వరులు, జ్ఞాని మాత్రమే కాదు విజ్ఞాని కూడా! ఒక్కమాటలో చెప్పాలంటే సకల మతాలు సంగమించే మహాసాగరం రామకృష్ణులు. అందుకే, పరమహంస ఈ లోకం నుంచి నిష్క్రమించిన కొన్నాళ్లకు, ఆయన ప్రధాన శిష్యుడైన వివేకానంద తన గురువు విశిష్టతను వ్యక్తపరుస్తూ సంస్కృతంలో ఓ గీతం రాశారు. అందులో రామకృష్ణులు పరమ గురువు ఎలా అయ్యారో శ్లాఘిస్తూ..

- Advertisement -

శక్తి సముద్ర సముత్థతరంగం
దర్శిత ప్రేమవిజృంభిత రంగమ్‌
సంశయ రాక్షస నాశమహాస్త్రం
యామి గురుం శరణం భవవైద్యమ్‌
అంటారు. ‘శక్తి అనే సముద్రంలో ఉవ్వెత్తున లేచిన తరంగమా! ఈ జీవిత రంగస్థలంపై ప్రేమను ప్రదర్శించావు. ఆ ప్రేమను భక్తుల హృదయాల్లో విజృంభితంగా ప్రసరింపజేశావు. నా మదిలోని సంశయమనే రాక్షసుడిని నీ జ్ఞానమనే మహాస్త్రంతో నాశనం చేశావు. సంసార బాధలకు వైద్యుడవైన నిన్ను గురువుగా ఎంచుకొని శరణాగతుడనవుతున్నాను’ అని కీర్తించారు.
గురువు ప్రేమ స్వరూపుడై ఉండాలి. లౌకిక, పారలౌకిక సంశయాలన్నిటినీ నాశనం చేయగలిగి ఉండాలి. అన్నిటికీ మించి త్యాగమూర్తిగా నిలవాలి. ఇవన్నీ ఆచరణలో చూపారు పరమహంస. అందుకే వివేకానందుడు పాశ్చాత్యదేశాల్లో తన గురువు విశిష్టతను వివరిస్తూ ‘రామకృష్ణ పరమహంస జన్మించిన రోజు నుంచి తూర్పు దిశలో ఆధ్యాత్మిక ఆదిత్యుని కిరణాలు కానవచ్చాయి. కాలప్రవాహంలో ఆ జ్ఞానజ్యోతి మిట్టమధ్యాహ్నం సూర్యుని వెలుగులా దేశం యావత్తూ ప్రకాశిస్తున్నది’ అన్నారు.
సద్గురువు మార్గదర్శకత్వంలోనే సన్న్యాసి అయినా, గృహస్థు అయినా ఆధ్యాత్మిక పురోగతిని సాధించగలరు. అవివేకంతో అర్హత లేని గురువును ఆశ్రయించిన వారు, ఆశ్రయం ఇచ్చిన వారు ఇద్దరూ భ్రష్టులవుతారు. దీనికి రామకృష్ణులు చక్కని దృష్టాంతాన్ని చూపుతారు. ఒక రోజు పరమహంస దక్షిణేశ్వరంలో పంచవటి వెళ్తుంటారు. ఇంతలో సమీపంలోని సరుగుడు తోపు నుంచి ఓ కప్ప దీనారావం వినిపిస్తుంది. ఆయన కుటీరంలో చాలాసేపు ధ్యానం చేసుకొని తిరిగి వస్తున్నప్పుడూ కూడా ఆ కప్ప అలాగే అరుస్తూ ఉంటుంది. కప్ప ఎందుకలా దీనంగా శబ్దం చేస్తుందా? అని పరమహంస అటుగా వెళ్తారు. ఓ నీటిపాము కప్పను నోట కరుచుకున్న దృశ్యం కనిపిస్తుంది. అది బక్కపల్చని పాము కావడంతో కప్పను మింగలేకపోతుంది. అలాగని నోటచిక్కిన కప్పను వదల్లేకపోతుంది. అదే కప్ప పెద్ద నాగుపాము నోట్లో పడుంటే పరిస్థితి వేరేలా ఉండేది. సద్గురువు కాని వ్యక్తిచేతిలో పడ్డ శిష్యుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని పరమహంస చక్కని వివరణ ఇస్తారు.
సద్గురువు చేతిలో పడితే శిష్యుడి సంశయాలన్నీ తీరిపోయి అతని బంధనాలు, బంధాలన్నీ తొలగిపోయి ప్రశాంతతను పొందుతాడు. కానీ, అదే శిష్యుడు అర్హతలేని గురువును ఆశ్రయిస్తే ఉన్న కష్టాలకు తోడు మరిన్ని ఆపదలు వచ్చిపడతాయి. ఉన్న సంశయాలు తీరకపోగా, కొత్త సందేహాలు జతకూడుతాయి. అప్పుడు నీటిపాము నోట చిక్కిన కప్పలా శిష్యులు అవస్థలు పడకతప్పదు. గురువూ ఆ నీటిపాములా అవమానాల పాలవుతాడు. సద్గురువులను పరమహంస బోధ గురువులుగా నిర్వచించేవారు. అర్హతలేని గురువులను బాధ గురువులు అనేవారు.
ఇంద్రజాల ప్రదర్శకుడు ఒక తాడులో అనేక ముడులు వేసి ఆ తాడు కొనను ఎక్కడో కడతాడు. రెండో కొనను చేతిలో పట్టుకుంటాడు. చేతిలో పట్టుకున్న కొనను ఒకటికి రెండుసార్లు విదిలిస్తాడు. అంతే! అన్ని ముడులు విడివడి పోతాయి. మరోవ్యక్తి తలకిందులుగా ప్రయత్నించినా ముడులు విడివడవు. గురుకృప ఉంటే అలా ఆధ్యాత్మిక సంశయాలతో కూడిన అన్ని ముడులూ క్షణంలో విడివడిపోతాయి. అందుకే రామకృష్ణ పరమహంస మహేంద్రజాలికుడు అంటే అతిశయోక్తి కాదు.

  • మనోజ్ఞ
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement