వంచనే పాలసీగా, మోసమే పాలనగా సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం తీరు, బీసీ కులగణన వ్యవహారంతో మరోమారు బయటపడింది. బడుగుల జనాభాను లెక్కించే విషయంలో కాంగ్రెస్ ఆడిన నాటకం కేంద్ర సర్కారు ప్రకటన సాక్షిగా బట్టబయలైంది. తెలంగాణలో నిర్వహిస్తామని, దాని ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీల కోటాను 42 శాతానికి పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన కాంగ్రెస్, అధికారంలోకి దాదా పు ఏడాది తర్వాత, తూతూ మంత్రంగా బీసీ సర్వే పేరుతో ఒక తంతు నడిపించింది.
సుప్రీం ఇచ్చిన ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాలను పక్కనబెట్టి, ఇష్టారాజ్యంగా, తప్పు ల తడకగా, అసమగ్రంగా నిర్వహించిన ఈ సర్వేపై అప్పుడే అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బీసీల జనాభాను తక్కువ చేసి చూపించాలనే విమర్శలూ వ్యక్తమయ్యాయి. అయినా పట్టించుకోని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి, ఆమోదం కోసం వాటిని కేంద్రానికి పంపింది.
శాసనసభలో ఈ బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్, కేవలం బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టేందుకు, బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు రాజకీయ ఎత్తుగడగా మాత్రమే కాంగ్రెస్ వీటిని వాడుకుంటున్నదని, ఈ బిల్లులకు కేంద్రం ఆమోదం లభించే అవకాశం లేనేలేదని నాడే తేల్చిచెప్పింది. అదే నేడు నిజమైంది. తాజాగా 2026లో జనగణనలో భాగంగా దేశవ్యాప్తంగా కులగణన కూడా నిర్వహించబోతున్నట్టు ప్రకటించిన కేంద్రం, కులగణన తమ పరిధిలోకి వస్తుందనీ, కొన్ని రాష్ర్టాలు రాజకీయ కారణాలతో చేసిన కుల సర్వే చెల్లుబాటు కాదని స్పష్టం చేయడం గమనార్హం.
దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే, దాంతో పాటు కేంద్రానికి పంపిన రిజర్వేషన్ల పెంపు బిల్లు లు బుట్టదాఖలా అయినట్టే! అంటే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కోటా ఇప్పటికి సాధ్యం కానట్టే! పాలనలో విఫలమై ఏడాది కాలంలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రభు త్వం, కోటా పెంపు లేకుండానే స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధపడుతుందా? లేక దీన్ని మరో సాకుగా చూపి వాయిదా వేస్తుందా? అన్నది తేలాల్సి ఉంది.
బీసీలపై కాంగ్రెస్ తీరు ఇలా ఉంటే, ఇక బీజేపీ మరోసారి పిల్లిమొగ్గ ల పార్టీగా రుజువు చేసుకుంది. మండల్ కమిషన్ సిఫారసుల విషయం లో ఆడిన దాగుడుమూతల పరంపరను కొనసాగిస్తున్నది. కులగణన జరపడమంటే దేశంలో, హిందూ సమాజంలో కులతత్వాన్ని ప్రోత్సహించడమేనని ఇన్నాళ్లూ వాదిస్తూ వచ్చిన బీజేపీ, అకస్మాత్తుగా జనగణనతో పాటు కులగణన కూడా జరుపుతామని ప్రకటించడానికి కారణం బీసీ ల్లో వస్తున్న చైతన్యమే. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలు, రేపటి రాజకీయ అవసరాలు ఆ పార్టీ వైఖరిలో మార్పు తెచ్చాయే తప్ప బీసీలపై ప్రేమ కాదు.
మొత్తమ్మీద బీసీల విషయంలో రెండు జాతీ య పార్టీలు దొందూ దొందే అని చెప్పాలి. బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెస్, కాంగ్రెస్ చేతుల్లోంచి ఎజెండా లాగేసుకునేందుకు బీజేపీ బీసీలను పావులుగా వాడుకుంటున్నాయే తప్ప, వారిపట్ల రెండు పార్టీలకూ ఎటువంటి నిబద్ధత లేదని ఈ ఉదంతం తేల్చింది. ఇది బీసీలు రెట్టింపు అప్రమత్తతో వ్యవహరించాల్సిన సమయం. ఏమరుపాటుగా ఉంటే, తెలంగాణలో కాంగ్రెస్ చేసిన మోసాన్నే, జాతీయస్థాయిలో బీజేపీ కూడా చేసే ప్రమాదం పొంచి ఉన్నది. తస్మాత్ జాగ్రత్త!!