తెలంగాణ కమలనాథులు ఇటీవల కండువాలు కప్పుతాం… కండువాలు కప్పుతామంటూ ఇతర పార్టీ నేతల ఇండ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పార్టీలో పెద్ద ఎత్తున చేరికలుంటాయని రెండు, మూడేండ్లుగా రాష్ట్ర నాయకత్వం ఊరిస్తూ వచ్చింది. చేరికల కోసం ప్రత్యేకంగా ఈటల నేతృత్వంలో కమిటీని కూడా ఏర్పాటుచేసింది. పార్టీలో చేరడానికి క్యూ కడుతారని గప్పాలు కొట్టడం తప్ప ఎవరూ రావడం లేదేంటి? అని అధిష్ఠానం కొంతకాలంగా గుర్రుగా ఉంది.
వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డికి ఆ పార్టీ షోకాజు నోటీసు ఇవ్వగానే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ య్, ఈటల రాజేందర్ ఆగమేఘాల మీద మహేశ్వర్‌రెడ్డిని ఢిల్లీకి పట్టుకెళ్లి కాషాయ కండువా కప్పించారు. త్వరలో మరో ఇద్దరు, ముగ్గురు ముఖ్యనేతలను పార్టీలోకి తీసుకురానున్నట్టు బండి సంజయ్, ఈటల గొప్పగా చెప్పబోగా, మహేశ్వర్‌రెడ్డిని తీసుకొచ్చింది మీరా?, మరి మాకేమో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పడం వల్ల ఆయన పార్టీలో చేరినట్టు సమాచారం ఉందే? అని ప్రశ్నించినట్టు తెలిసింది. దీంతో ఇలా కూడా జరుగుతుందా? తమకు క్రెడిట్ దక్కకుండా ఈ విధంగా కూడా పార్టీ పెద్దలను తప్పుదోవ పట్టిస్తున్నారా? అని బండి, ఈటల ఢీలా పడినట్టు సమాచారం.
– వెల్జాల