1.శార్దూలము
స్వాతంత్య్రోద్యమ ఘట్టముల్ తలువగా సామ్రాజ్య కాంక్షల్ సదా
జాతుల్ ఖ్యాతిని గుర్తు చేయు చరితల్ సంగ్రామ త్యాగమ్ములన్
నేతాజీ యువశక్తి సైన్యములతో నేర్పించె విశ్వాసమున్
ప్రీతిన్ త్యాగము జేసి కీర్తి వడయన్ విశ్వమ్ము నేడేలెడిన్!!
2.సీసము
ఒకవైపు నైజాము లొకవైపు పాశ్చాత్య
పరపీడనమ్ములో బడుగు బ్రతుకు
కాల్మొక్త బాంచెను కనికరమ్మును జేయు
బుక్కెడన్నము జాలు పొట్ట నింప
యనుచునున్న ప్రజకునానందమును గూర్చు
స్వేచ్ఛా విహారమ్ము సిరుల నవ్వు
అల్లూరి,భీమన్న యంబేద్కరు పూలె
త్యాగ ధనుల కృషి ధైర్యమయ్యె
తేటగీతి
అమృత మాజాది యుత్సవసమత,మమత,
భరత మాతకు పాదాల వందనాలు
నీతి ధర్మము గెలిచిన నేస్తమగును
జాతి మోసాల పాలైన శక్తులుడుగు!!
3. శార్దూలము
వందేమాతరగీతమేపిలుపుగా స్వాతంత్త్య్రపోరాటమున్
సందెశమ్ము విదేశి వస్తువదలన్ స్వార్ధమ్ము ప్రాణమ్ములన్
బందూకుల్ కరమున్ విభూషణములై భారమ్ము ధీ శక్తియై
మందల్ మందల పౌరులంత పరుగన్ మైత్రిన్ విజేతల్ గదా!!
4. శార్దూలము
ఆజాదీ యమృతోత్సవమ్మున నమదానంద సందోహమై
బేజారెత్తిన పౌరులందు జవమున్ విద్వద్వికాసమ్ముతో
స్త్రీ జాతిన్ పరి రక్షజేయు వనరుల్ తేజమ్ము సంవృద్ధికై
ప్రాజాపత్యము ధర్మమార్గములలో పాలించ సౌభాగ్యమౌ!!
– మాడుగుల నారాయణమూర్తి
9441139106