సాహితీ శిఖరం నేలకొరిగింది. ఒక గొప్ప సంస్కృతాంధ్ర కవి పండితుడిని సాహితీలోకం కోల్పోయింది. ప్రముఖ సాహిత్య పండితుడు, ధార్మిక, ఆధ్యాత్మికవేత్త, అవధాని డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ అస్తమించడం ఆత్మీయ సాహిత్య లోకానికి తీరని లోటు. ప్రముఖ విద్వాంసులు జయలక్ష్మి-అనంత రాజయ్యశర్మల జ్యేష్ఠ పుత్రుడు డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ కామారెడ్డి సమీపంలోని రామారెడ్డిలో 1956 జూలై 17న జన్మించారు.
‘అచటబుట్టిన చిగురుకొమ్మైన చేవయగు’ అన్నట్టు అయాచితం వారింట్లో అయాచితమైన ప్రజ్ఞాపాటవాలు కలిగి అంచెలంచెలుగా అత్యున్నత సాహితీ శిఖరాలను అధిరోహించిన సంస్కృతాంధ్ర కవి పండితులు నటేశ్వరశర్మ. 1969లో సంస్కృత విద్యాభ్యాసం చేస్తున్న రోజుల్లోనే సంస్కృతం, తెలుగులో పద్య, శ్లోక, గేయ రచనలను ఆయన ప్రారంభించారు. 1970లో కంచి పీఠాధిపతుల సమక్షంలో విద్యార్థిగా సంస్కృత శ్లోక స్వాగతాన్ని పలికిన ఆయన.. గొప్ప కవిగా కీర్తిప్రతిష్టలు అందుకుంటారని అప్పట్లోనే అభినందనలు పొందారు. అయాచితం అర్ధాంగి అరుణకుమారి కూడా పండిత కుటుంబానికి చెందినవారే.
కామారెడ్డిలోని ప్రాచ్య విద్యాపరిషత్తు సాయంప్రాచ్య కళాశాలలో ఆచార్యుడిగా మొదలైన ఆయన ప్రస్థానం ప్రధానాచార్యుల వరకు సాగింది. అంతేకాదు, ఓయూలో ప్రాచ్య భాషా పీఠాధిపతిగా కూడా ఆయన సేవలందించారు. 2014 జూలైలో పదవీ విరమణ పొందారు. వేలాది మంది విద్యార్థులకు సంస్కృతాంధ్ర భాషలను ఆయన బోధించారు. అంతేకాదు, కవిత్వంలో, అవధానాల్లో పట్టువచ్చేలా వారిని తీర్చిదిద్దారు. అయాచితం శిష్య, ప్రశిష్యులెందరో గొప్పగొప్ప అవధానులుగా, కవులుగా వారి అవధాన కవిత్వ కీర్తిని నిలబెడుతున్నారు.
డాక్టర్ నటేశ్వరశర్మ అనేకమంది పండితుల సాహచర్యంలో ఉభయ రాష్ర్టాల్లో ఉభయ భాషా పాండిత్యాల్లో గొప్ప కీర్తిని పొందారు. వందలాది అవధానాలు, సాహిత్య గోష్ఠులు, వేలాది పుస్తకాలకు పీఠికలు, వివిధ పత్రికల్లో అనేక వ్యాసాలు రచించి ఎనలేని కీర్తిని గడించారు.
ఆణిముత్యాల్లాంటి అయాచితం నటేశ్వరశర్మ దస్తూరి ముందు ముద్రణా యంత్రాలు కూడా దిగదుడుపే. గుండ్రని, చక్కని దస్తూరి వారిది. ఎన్నో పురస్కారాలతో పాటు అత్యున్నతమైన దాశరథి పురస్కారం కూడా ఆయనను వరించింది. ‘శకుంతల’ అనే పద్యకావ్యానికి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ కావ్య పురస్కారం కూడా లభించింది. ‘భారత ప్రశస్తి’కి జాతీయ సాహిత్య పరిషత్తు పురస్కారం పొందారు. 1994లో ఓయూ నుంచి డాక్టరేట్ పట్టా, స్వర్ణ పతకం కూడా పొందారు. ఇటీవల పరిశోధన రచన ‘సౌందర్యలహరి సౌందర్యం’ అనే గొప్ప కావ్యం ప్రముఖ పండితులు, ధార్మికుల చేతులమీదుగా ఆవిష్కృతమైంది.
సంస్కృతం, తెలుగులో 60కి పైగా గ్రంథాలను అయాచితం రచించారు. అంతేకాదు, తెలంగాణ సుప్రభాతం రూపకం రాశారు. శ్లోక పద్య వచన ప్రక్రియలో రచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కవిగా తన గొంతు విప్పారు. గతేడాది జూన్ 2న జరిగిన రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగంలో నటేశ్వర శర్మ పద్య పాదాన్ని ఉటంకించడం విశేషం.
కామారెడ్డి బ్రాహ్మణ వికాస పరిషత్తుకు చాలా సంవత్సరాలు అధ్యక్ష, కార్యదర్శులుగా ఆయన ఎనలేని సేవలందించారు. అంతేకాదు, అనేక సాహిత్య అవధాన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే, సామాజిక సేవ చేసి ప్రజల్లో ఆత్మీయతను పొందారు. ఉన్నతమైన వ్యక్తిత్వం, విశాల హృదయం, కలుపుగోలుతనం, వినమ్రత ఇవన్నీ ఆయనకు చిరస్థాయి ఆభరణాలు. అనేక దిన, వార, పక్ష, మాస పత్రికల్లో ప్రచురితమయ్యే ఆయన వ్యాసాలు ఆబాలగోపాలాన్ని అలరించేవి.
డాక్టర్ అయాచితం మన ప్రాంతానికి అయాచితంగా లభించిన ఆణిముత్యం. వారి కీర్తి అజరామరం, అనంతం. వారి కీర్తి నగమేరు శిఖరమంత విస్తరించింది. ఇసన్నపల్లి భైరవస్వామి సుప్రభాతంతో పాటు అనేక దేవతల స్తోత్రాలు, శతకములు, అష్టకములు వారికి గొప్ప కీర్తినందించాయి. జంట అవధానాలు కూడా చేసిన అయాచితం నటేశ్వరశర్మ పూర్వ కవుల స్థాయికి చేరుకున్నారు. వారికి సదాసర్వదా మనం రుణపడి ఉన్నాం. వారి నిర్యాణం తెలంగాణ సాహితీ లోకానికే కాదు, తెలుగు సాహితీలోకానికి తీరని లోటు.
2023, జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినో త్సవంలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించిన డాక్టర్ ఆయాచితం నటేశ్వరశర్మ రాసిన పద్యం.
‘దారులు పూలతేరులయి, తావులు నింపును నేత్రశోభలన్
తేరులవోలె రమ్యపథ దీప్తుల నింపుచు సాగిపోవగా
మారిన గ్రామశోభ, నవ మంజులతాళిని కుంజమై, మనో
హారిణి రాష్ట్ర శోభ జనహాస వికాస విలాసమయ్యెడిన్!’