‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని పాత మాటల్లో చెప్పినా, ‘మీ శరీరం పట్ల శ్రద్ధ వహించండి. ఎందుకంటే, మీరు నివసించే ఏకైక ప్రదేశం అదే’ అని కొత్త పదాల్లో చెప్పినా సారాంశం ఒక్కటే.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని. దీన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్నది. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి అహరహం శ్రమిస్తున్నది. ఫలితాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ‘రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వార్షిక నివేదిక-2022’ దీనికి అద్దం పడుతున్నది. బస్తీ దవాఖానల నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల వరకూ అన్ని అంచెల్లోనూ పురోభివృద్ధి నమోదైంది. 2018లో కేవలం 35 ఉన్న బస్తీ దవాఖానలు గత ఏడాదికి 334కు పెరిగాయి. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ దవాఖానలకు ఇప్పుడు కొత్తగా మరో ఐదు జత కలుస్తున్నాయి. హైదరాబాద్ నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలతోపాటు, వరంగల్‌లో మరొకటి నిర్మితమవుతున్నది.
జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ దవాఖానల స్వరూపం మారిపోయింది. ఆరోగ్య పరీక్షలు, చికిత్స, ఔషధాలు, దవాఖానలో చేరిన రోగులకు అందుతున్న సేవలు, వారి వెంట ఉన్న సహాయకలకు లభిస్తున్న సదుపాయాలు.. ఈ విధంగా అన్నింటా తెలంగాణ ఆవిర్భావం నాటికి నేటికి పోలికే లేకుండా పోయింది. మాతాశిశు సంరక్షణకు ప్రభుత్వం పెద్ద పీట వేయటం భవిష్యత్ తరాల్ని సంరక్షించుకునే చర్య. న్యూట్రిషన్ కిట్లు, ఏఎన్సీ చెకప్‌లు, అమ్మ ఒడి వాహనాలు, కేసీఆర్ కిట్లతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు (61 శాతం) ప్రైవేటు దవాఖానలకు (39 శాతం) అందనంత దూరంలో నిలిచాయి. ప్రసవ మరణాలు 2014లో ప్రతీ లక్ష సజీవ జననాలకు 92 ఉండగా, ప్రస్తుతం అవి 43కి తగ్గాయి. నవజాత శిశు మరణాలు ప్రతీ వెయ్యి జననాలకు 2014లో 39 కాగా, ప్రస్తుతం 21కి తగ్గాయి. కంటి వెలుగు, ఉచిత డయాలిసిస్ కేంద్రాలు, ఉచిత డయాగ్నస్టిక్ కేంద్రాలు, ఆరోగ్య సమస్యలను మొదట్లోనే గుర్తించటానికి ఎన్సీడీ స్క్రీనింగ్.. పలు విధాలుగా రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు చేరువయ్యాయి.
జిల్లాకొక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యంగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. గత ఏడాదిలోనే ఏకంగా 8 కాలేజీలు ప్రారంభమయ్యాయి. మరో తొమ్మిది కాలేజీల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. మొత్తం 41 ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల ద్వారా 6,615 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా ఏటా వేల మంది యువ డాక్టర్లు కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. వైద్యారోగ్య శాఖలో వేలాది పోస్టులు భర్తీ అవుతున్నాయి. కరోనా వంటి అనుకోని ఆరోగ్య విపత్తులు ఎప్పుడు ఎదురైనా ఎదుర్కోవటానికి తెలంగాణ సన్నద్ధమవుతున్నది. ఆరోగ్య రంగంలో తెలంగాణ సాధించిన విజయాల్ని కేంద్రంతోపాటు పలు సంస్థలు గుర్తించి గౌరవించా యి. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత వల్ల, వైద్యారోగ్యశాఖ కార్యాచరణ వల్ల సాధ్యమైంది. ‘ఆశ కార్యకర్తల నుంచి ఆరోగ్యశాఖ కా ర్యదర్శి వరకూ సమిష్టిగా పని చేయటం వల్లే ఈ ఫలితాలు సాధించాం’ అన్న వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మాటలు అక్షరసత్యాలు.