తెలంగాణ కథ మళ్లీ మొదటికి వస్తున్నది. నీళ్లు, నిధులు, నియామకాల్లో మొదటిది మరోసారి ప్రమాదంలో పడుతున్నది. ఇంటిదొంగ ఇగిలిస్తూ పొరుగుదొంగలకు సద్ది కట్టేందుకు సిద్ధమవుతున్నాడు. తెలంగాణ జలదోపిడీకి ఏపీ గురువు పావులు కదుపుతుంటే ఇక్కడ శిష్యుడు తందానా అంటూ తలూపుతున్నాడు. కేసీఆర్ హయాంలో ఇటు తొంగిచూసేందుకు సాహసించని పొరుగు నేత సర్కార్ మారడంతో సందు దొరికిందని సంబురపడిపోతున్నాడు. తెలంగాణ నోట్లో మట్టి కొట్టే బనకచర్ల లింకుకు రాష్ట్ర సర్కార్‌తో ‘మమ’ అనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. లక్ష కోట్ల ప్రాజెక్టుకు లంఘిస్తున్నాడు.
గోదావరిని కొల్లగొట్టి, తెలంగాణను ఎండబెట్టే కుట్రలకు ఏపీ సీఎం చంద్రబాబు తెరలేపుతున్నట్టు స్పష్టమైపోతున్నది. పోలవరం కుడికాలువ, తాడిపూడి కాలువ సామర్థ్యాన్ని పెంచి ఏకంగా 200 టీఎంసీల గోదావరి జలాలను ఎగరేసుకుపోవాలనేది ఎత్తుగడ. వరద జలాల ఆధారంగా ప్రాజెక్టులు కట్టరాదనే నిబంధనను తుంగ లో తొక్కి మరీ దీనిని ముందుకు తెస్తున్నారు. దీంతో ఎగువ రాష్ట్రమైన తెలంగాణ నీటిహక్కులకు ముప్పు ఏర్పడుతుందనేది తెలిసిందే.
పోలవరం నుంచి గోదావరి జలాలను ముందుగా కృష్ణా డెల్టాలోని ప్రకాశం బరాజ్‌కు, తర్వాత బొల్లాపల్లి రిజర్వాయర్‌కు తరలించి, అటు నుంచి పల్నాడుకు మళ్లించి, ఆపై బనకచర్ల క్రాస్ హెడ్ రెగ్యులేటర్‌కు చేర్చే పన్నాగం ఇది. దీనికి మార్గం సుగమం చేసుకునేందుకు కేంద్రం తలపెట్టిన గోదావరి-కావేరీ అనుసంధాన ఎత్తుగడలకు జైకొట్టారు చంద్రబాబు. ఈ నీటి మళ్లింపుపై కేంద్ర సంస్థలైన సీడబ్ల్యూసీ, ఎన్‌డబ్ల్యూడీఏ, జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. దాంతో బాబు కేంద్ర సర్కార్‌ను ముగ్గులోకి లాగారు. మరోవైపు తెలంగాణ ఇంజినీర్ల అభ్యంతరాలకు విరుద్ధంగా తెలంగాణ సీఎం రేవంత్ ఏపీతో చర్చలకు సిద్ధం కావడం బాబు స్క్రిప్టులో భాగమేనని భావించాలి. కేంద్ర జల్‌శక్తి శాఖ ఆధ్వర్యంలో దస్ర్తాలు తయారయ్యాయి. సంతకాలే తరువాయి అని సంకేతాలు వెలువడుతున్నాయి. తెలంగాణ నీటిహక్కుల చుట్టూ బనకచర్ల చక్రబంధం బిగిస్తుంటే తెలంగాణ సోయిలేని సీఎం ‘గురుదక్షిణ’ సమర్పించుకునేందుకు సమాయత్తమవుతున్నాడు.
ఓ వైపు వరద జలాల పేరిట గోదావరిని బనకచర్లకు ఎగరేసుకుపోయేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్న ఏపీ మరోవైపు కృష్ణా జలాల దోపిడీని ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నది. అయినా తెలంగాణ సర్కార్ ఉలుకూపలుకూ లేకుండా చోద్యం చూస్తున్నది. కాళేశ్వరాన్ని పడావు పెట్టి గోదావరి జలాలను దిగువకు వదిలేస్తుండటమే కాకుండా, కృష్ణా జలాలనూ ఎత్తిపోయకుండా దిక్కులు చూస్తున్నది. ఎగువ నుంచి వస్తున్న వరదను హంద్రీ-నీవా తదితర ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోసుకుంటూ శ్రీశైలం ప్రాజెక్టు నిండకుండా చేస్తున్నది ఏపీ సర్కార్. కేవలం కరెంటు ఉత్పత్తి కోసం కట్టిన ఆ ప్రాజెక్టును నీటి దోపిడీకి అడ్డాగా మార్చుకున్నది. మద్రాసుకు నీళ్లందించేందుకు మొదలుపెట్టిన తెలుగుగంగ కాలువల పరంపరను అడ్డుపెట్టుకుని శీశైలం నీళ్లను కొల్లగొడుతున్నది.
అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటివరకు 10 టీఎంసీల నీటిని మళ్లించారు. వాస్తవంగా 15-20 టీఎంసీలు ఎత్తిపోసుకున్నారని తెలుస్తున్నది. ఇది చాలదన్నట్టు వెలిగొండ ద్వారా భారీ జలదోపిడీకి ఏపీ సిద్ధమవుతున్నది. ఇంత జరుగుతున్నా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఏపీ కుట్రలకు వత్తాసు పలుకుతున్నది మన రాష్ట్ర ప్రభుత్వం. ఈ మూడేండ్లలో మూడు కిలోమీటర్ల కాలువను పూర్తి చేసి ఉంటే 30-40 టీఎంసీల నీటిని దక్కించుకునేవాళ్లం. నార్లాపూర్ నింపలేదు. కల్వకుర్తి లిప్ట్ నుంచి జలాలను ఎత్తిపోయలేదు.
దీంతో సీఎం రేవంత్ సొంత ఇలాకా కూడా నీటికి గోస పడుతున్నది. నదినిండా నీళ్లున్నా ఏమిటీ కర్మ అనుకునే పరిస్థితి తెచ్చిపెట్టాడు గురుభక్తిలో తరిస్తున్న శిష్యుడు.కాళేశ్వరాన్ని పడావుపెట్టి గోదావరి జలాలను జారవిడుస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ కృష్ణా జలాలను వదిలేస్తున్నారు. తెలంగాణ పంటలకు నీరు దక్కకుండా చేస్తూ సొంతగడ్డకు వెన్నుపోటు పొడుస్తున్నది కాంగ్రెస్ సర్కార్. నీటిహక్కులకు సీఎం రేవంత్ కలిగిస్తున్న శాశ్వత నష్టం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ తప్పిదాలను దిద్దడానికి ఎన్నేండ్లయినా సరిపోవు. ఏపీ నీటి దోపిడీని అడ్డుకునేందుకు మరో మహోద్యమం తప్పనిసరి అనిపిస్తున్నది.