మన దేశంలో విడాకుల సంఖ్య ఒక శాతంలోపేనని ఒక అంచనా. ప్రపంచ సగటుతో పోలిస్తే ఇది చాలా తక్కువగా అనిపిస్తుంది. కానీ, భరణం విషయంలో మాత్రం వివాదాలకు మన దేశంలో కొదవలేదు. భరణం ఇబ్బడిముబ్బడిగా డిమాండ్ చేయవచ్చనే భావన బహుశా ఈ వివాదాలకు దారితీస్తుండవచ్చు. అడిగినంత కట్నం తేలేదని అత్తింటివారు పెట్టే ఆరళ్లు భరించలేక కోడళ్లు బలైపోవడం అనాదిగా జరుగుతున్న అనాచారం. దీనికి విలోమ దిశగా కూడా వేధింపులు ఉంటాయి. భర్తపై వేధింపుల కేసులు పెట్టి, విడాకులు పొంది, ఆపై భరణం పేరిట పీల్చిపిప్పి చేసే భార్యలూ ఉంటారు. అలాంటివారిని రెచ్చగొట్టి, కాపురాల్లో చిచ్చుపెట్టే తల్లిదండ్రులూ ఉంటారు. ఈ తరహా వేధింపులకు బలైపోయిన ఓ అభాగ్యజీవి అతుల్ సుభాశ్ ఉదంతంపై ప్రస్తుతం పెద్ద దుమారమే చెలరేగుతున్నది. ఈ బెంగళూరు టెకీ ఆత్మహత్య చేసుకునే ముందు విడుదల చేసిన సుదీర్ఘ లేఖలు, పెద్ద పెద్ద వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
అతుల్ విషయమే తీసుకుంటే భారీ భరణం కోసం భార్యతో సహా అత్తింటివారు వేధించడం, తన కుమారుడిని చూసేందుకు సైతం పెద్దమొత్తం చెల్లించాలని డిమాండ్ చేయడం నాణేనికి మరోవైపు చూపిస్తున్నది. కోర్టులో విచారణ సమయంలో ‘అడిగినంత భరణం ఇవ్వలేకపోతే చచ్చిపో’ అని సుభాశ్ భార్య పరుషంగా మాట్లాడినప్పుడు జడ్జి నవ్వారనే అంశం నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. బహుశా ఈ కారణంగానేమో చట్టాలు, కోర్టులు మహిళలకే అనుకూలంగా ఉన్నాయని అతుల్ తన మరణ వాంగ్మూలంలో విమర్శలు చేసి ఉండవచ్చు. మరో కేసులో నెలకు రూ.6 లక్షల భరణం డిమాండ్ చేసిన భార్యను ‘నువ్వు సంపాదించి చూపు’ అని కర్ణాటక హైకోర్టు మందలించడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. జీవనభృతి కాస్తా కొందరి విషయంలో గొంతెమ్మ కోరికలా మారుతున్నట్టు దీనిని బట్టి అవగతమవుతున్నది. మరోవైపు సుభాశ్ వంటివారి విషయంలో ఈ డిమాండ్లు ప్రాణాల మీదకు రావడం మనం చూస్తున్నాం.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మరో కేసులో భరణం సమస్యపై కీలక తీర్పు వెలువరించింది. భరణంపై అంచనాకు వచ్చేందుకు ఎనిమిది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించడం విశేషం. సామాజిక ఆర్థిక స్థోమత, భార్యాపిల్లలకు భవిష్యత్తు అవసరాలు, ఇరుపక్షాల విద్య, ఉపాధి స్థాయి, ఆదాయం, ఆస్తులు, ఇతర ఆర్థికవనరులు, పెండ్లి అయ్యేనాటికి భార్య స్థితిగతులు మొదలైనవి అందులో ఉన్నాయి. భరణం అనేది ఓ శిక్షలా మారకూడదనేది సుప్రీంకోర్టు తీర్పులో ముఖ్యాంశం. అది అటు భర్తకు తలకు మించిన భారం కారాదని, అదే సమయంలో భార్య జీవికకు సరిపోయే స్థాయిలోనూ ఉండాలనేది గీటురాయి అని సర్వోన్నత న్యాయస్థానం చేసిన సూచన ఆహ్వానించదగినది. అంతేకాదు, వరకట్న వేధిపుల నిరోధానికి ఉద్దేశించిన 498-ఏ చట్టం దుర్వినియోగం అవుతుండటాన్ని సుప్రీంకోర్టు ఎత్తిచూపడం గమనార్హం. భరణం విధివిధానాలపై ధర్మాసనం వెలువరించిన తీర్పు కీలకమైనదే అయినప్పటికీ సుభాశ్ వంటి బాధితులకు అది ‘ఆలస్యంగా అందిన న్యాయమే’. ఆ తీర్పు నుంచి లబ్ధి పొందేందుకు అతడు సజీవుడై లేకపోవడం విషాదం.