రాజ్యాంగాన్ని మార్చడం నేరం కాదు. మార్చాలనడం కూడా నేరం కాదు. కానీ ఇన్నాళ్లూ ఏ విధంగా మార్చుతున్నారనేది, ఏమార్చుతున్నారనేది అసలు సమస్య. ప్రశ్నించవలసిన సమస్య. మొదటి సవరణ కన్నా ముందున్న మన రాజ్యాంగం చాలా గొప్పది, కొన్ని తీవ్రమైన లోపాలున్నప్పటికీ. కానీ తర్వాత వచ్చిన ఒక్కో సవరణ ద్వారా మౌలిక రాజ్యాంగ విలువలను ఒక్కొక్కటిగా హరిస్తూ వచ్చారని అర్థం చేసుకోవలసిన విషయం.
కొంత కొంత హక్కులను హరిస్తూ ప్రజాస్వామ్యాన్ని నింపాదిగా సంహరిస్తున్నారు. ప్రజాసంక్షేమం, దేశసమైక్యత సమగ్రత రక్షణ చాలా ముఖ్యం అనడంలో సందేహం లేదు. కానీ, పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ఆర్డర్ అనే రెండు పదాలను ఫిరంగులుగా వాడుతూ రాజ్యాంగ హక్కులపైన పేల్చేస్తున్నారు.
దేశ సమైక్యత, భద్రత ఎవరూ వద్దనరు. కానీ పెగాసస్ వంటి అతి ఖరీదైన విదేశీ సాఫ్ట్‌వేర్‌ను జనం డబ్బుతో కొని, వందలాది మంది స్మార్ట్ఫోన్లలో దూరి వారి ప్రైవసీ హక్కును ధ్వంసం చేయడానికి ఆ సాకులను వాడుతున్నారు. దేశ భద్రత పేరుతో జనం హక్కుల హననం చేస్తారా అని దేశ ప్రధాన న్యాయమూర్తి కూడా ప్రశ్నించవలసి వచ్చింది. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ చట్టం ద్వారా జనాన్ని చంపే అధికారాన్ని దేశభద్రత పేరుతో ఇచ్చారు. ఈ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ 17 మంది అమాయకులను నాగాలాండ్‌లో చంపేసి లోకసభలో క్షమాపణ కోరారు. కానీ జనాన్ని చంపిన వారి మీద ఏ చర్య తీసుకుంటారో తెలియదు.
రక్షిస్తున్నదెవరు?
రాజ్యాంగాన్ని ఎవరు రక్షిస్తున్నారు? ఎవరు పాటిస్తున్నారు? ఎవరు ధ్వంసం చేస్తున్నారు? ఇప్పటికి 105 సవరణలు చేశారు మన రాజ్యాంగానికి. 1950 జనవరి 26న రాజ్యాంగం ప్రాథమిక హక్కులతో సహా అమల్లోకి వచ్చింది. ఆరునెలల్లోపే పత్రికల భావవ్యక్తీకరణ స్వాతంత్య్రం మీద, ఆస్తి హక్కు మీద దాడి మొదలైంది. ఇవి ప్రాథమిక హక్కులకు భంగకరం అని సుప్రీంకోర్టు ఇచ్చిన మూడు తీర్పులతో పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం బెంబేలెత్తిపోయింది. కోర్టులు మమ్మల్ని పనిచేయనీయడం లేదని ప్రభువులు ఇప్పుడే కాదు అప్పుడూ అన్నారు. వెంటనే మొదటి సవరణకు పూనుకున్నారు. అప్పుడు ఇంకా మన పార్లమెంటు ఎన్నిక కాలేదు. ఉభయసభలు లేవు, అంటే రాజ్యసభ ఏర్పడలేదు. ఎన్నికలే కాలేదు. నెహ్రూ ప్రభుత్వం తాత్కాలికమైనది. ఆయన జనం నుంచి ఎన్నికైన ప్రతినిధులు ఎన్నుకున్న ప్రధానిగా ఇంకా రూపొందలేదు. రాష్ర్టాల్లో శాసనసభలు లేవు. కానీ రాజ్యాంగంలోని రెండు ప్రాథమిక హక్కులను విపరీతంగా తగ్గిస్తూ మొదటి సవరణను తీసుకువచ్చారు. పార్లమెంట్ ఉభయసభల్లో మూడింట రెండు వంతుల మెజారిటీతో మార్చవలసిన రాజ్యాంగాన్ని రాజ్యాంగ రచనాసభలో మామూలు మెజారిటీతోనే తీవ్రంగా మార్చిపడేశారు. రాజ్యసభ లేదు. కనుక ఉభయసభల నియమం భంగపడింది. శాసనసభలు లేవు కనుక సగం శాసనసభలు ఆమోదించాలనే షరతు కూడా ఉల్లంఘించారు. తాత్కాలిక రాష్ట్రపతి దాన్ని ఆమోదించారు. లక్ష్మణరేఖను గీసిన కొద్ది గంటల్లోనే దాన్ని దాటినట్టు, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కొద్దినెలల్లోనే, రాజ్యాంగాన్ని రచించి, చర్చించి ఆమోదించిన గొప్పవారే ఉల్లంఘించారు. దురదృష్టమేమంటే రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడు డాక్టర్ అంబేద్కర్ కూడా ఈ మొదటి సవరణను సమర్థించారు. రాజ్యాంగం గురించి మాట్లాడే పెద్దలందరూ ఈ మొదటి సవరణను ఎందుకు ఒప్పుకొన్నారు? దానివల్ల రాజ్యాంగ విలువలు ఎంతగా దెబ్బతిన్నాయో, 71 ఏండ్ల తర్వాత కూడా ఈ సవరణ దుష్ప్రభావాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో పరిశీలించాలి, పరిశోధించాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి.
నేనే తగలబెడతాను – అంబేద్కర్
నాలుగో సవరణ దారుణమైంది. ఆర్టికల్-31 ప్రకారం ఎవరి ఆస్తులైనా, ఎస్టేట్లైనా, మేనేజ్మెంట్ హక్కులనైనా సరే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. ఎంతో కొంత నష్టపరిహారం ఇస్తాం. కానీ పరిహారం సరిపోలేదని కోర్టుల్లో సవాలు చేయడానికి వీల్లేదు. ఈ విధంగా పార్లమెంటు చేసే చట్టాలు ఆర్టికల్-14 సమానతకు భంగకరమైనా, ఆర్టికల్-19 సప్త స్వాతంత్య్రాలను హరించినా సవాలు చేయడానికి వీల్లేదని రాజ్యాంగ హక్కుల అధికరణల్లో మార్పులు చేశారు. ఇంతటితో ఆగకుండా ఈ సవరణ చట్టం రాజ్యాంగబద్ధం కాదని ఎవరూ హైకోర్టులో, సుప్రీంకోర్టులో సవాలు చేయడానికి వీల్లేదంటూ తొమ్మిదో షెడ్యూల్లో చేర్చారు. రాజ్యాంగంలో మొదట ఎవరూ ఆశించని, ఊహించనివిధంగా ఏడు షెడ్యూళ్లకు 9వది కలిపారు. పార్లమెంటు రాజ్యాంగాన్ని బలహీనపరిచే చట్టం చేసినప్పుడు దాన్ని 9వ షెడ్యుల్‌లో చేర్చితే చాలు. అది రాజ్యాంగవిరుద్ధమని సవాలు చేయడానికి, కోర్టులు కొట్టివేయడానికి వీల్లేదు. ఎంత దారుణం ఈ సవరణ. ఇది రాజ్యాంగాన్ని విధ్వంసం చేయడం కాదా. నాలుగో సవరణ 1955లో చర్చకు వచ్చినపుడు డాక్టర్ అంబేద్కర్ రాజ్యసభలో ఉన్నారు. ఈ సవరణతోసహా రాజ్యాంగాన్ని తాను తగలబెడతానన్నారు. అంతకుముందు మైనారిటీ హక్కులను హరించాలనే ప్రతిపాదన చేసినప్పుడు కూడా అంబేద్కర్ దాన్ని వ్యతిరేకిస్తూ ‘ఈ విధంగా సవరిస్తే రాజ్యాంగాన్ని నేనే కాల్చేస్తాను’ అని 2 సెప్టెంబర్ 1953న అన్నారు. డాక్టర్ అనూప్‌సింగ్ (పంజాబ్) 1955 మార్చి 19న రాజ్యసభలో మీరు రాజ్యాంగాన్నే తగలబెడతానన్నారు కదా అని వ్యంగ్యంగా అన్నారు. అంబేద్కర్ సమాధానమిస్తూ ‘అవును. రాజ్యాంగాన్ని తగలబెడతానన్నాను. అప్పుడు కారణం చెప్పలేదు. ఇప్పుడు చెప్పే అవకాశం ఇ చ్చే ప్రశ్న వేశారు. మనం దేవుడిని స్థాపించడానికి గుడి కట్టాం. కానీ దేవు డు రాకముందే దెయ్యం వచ్చి కూర్చున్నది. గుడిని ధ్వం సం చేయకతప్పదు కదా. దేవతలు ఉండాల్సిన గుడిలో అసురులను ఉండనిద్దా మా? అంతకన్న దాన్ని తగలబెట్టడమే మంచిదంటాను’ అని చెప్పారు.
అప్పుడు బీహార్ నుంచి ఎన్నికైన ఒక సభ్యుడు ‘గుడి కూలగొట్టడం ఎందుకు దెయ్యాన్నే ధ్వంసం చేయవచ్చు కదా’ అని ప్రశ్నించారు. దానికి అంబేద్కర్.. ‘సాధ్యం కాదు, మీరు శతపథ బ్రాహ్మణం చదివితే.. ఎప్పటికీ అసురులే దేవతలను ఓడిస్తూ ఉండేవారు. అసురుల దగ్గరే అమృతం ఉండేది. దేవతలు ప్రాణాలు కాపాడుకోవడానికి అమృతం తీసుకుపోకతప్పదు. నేను ఆర్టికల్-31కి బాధ్యుడిని కాదు. అందులో నష్టపరిహారం ఇవ్వాలనే నియమం చేర్చాం. ఉమ్మడి జాబితాలో 42వ ఎంట్రీ, 1935 నాటి భారత ప్రభుత్వచట్టం సెక్షన్ 299 కలిపి చదివితే పౌరుడి ఆస్తి తీసుకున్నపుడు నష్టపరిహారం ఏ విధంగా ఇవ్వాలో వివరణ కనిపిస్తుంది’ అని అంబేద్కర్ వివరించారు.
నియమాలు మార్చి, పరిహారం సరిపోలేదని సవాలు చేయకూడదంటూ, తగిన పరిహారం ఇవ్వకుండా కూడా ఆస్తులు స్వాధీనం చేసుకునే చట్టాలు చేస్తామని, అయినా అవి ఆర్టికల్స్-14, 19కు విరుద్ధంగా ఉన్నాయంటూ కోర్టుల్లో సవా లు చేయడానికి వీల్లేదంటూ నాలుగో సవరణను చూసి ఆయన తట్టుకోలేకపోయా రు. ‘ఈ రాజ్యాంగాన్ని చూడటం కూడా నాకు ఇష్టం లేదు, కనుక నాలుగో సవరణతో కూడిన రాజ్యాంగాన్ని తగలబెడతా’నని అంబేద్కర్ అనడం రాజ్యసభ డిబేట్లో ఎవరైనా చూడవచ్చు.
ఇంకా ఉంది..
– ఫ్రొఫెసర్ మాడభూషి శ్రీధర్
(వ్యాసకర్త: డీన్, స్కూల్ ఆఫ్ లా, మహింద్రా యూనివర్సిటీ, కేంద్ర సమాచార మాజీ కమిషనర్)