తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అసువులు బాసిన త్యాగధనులకు వేల వేల వందనాలు… అరవై ఏండ్ల తెలంగాణ అస్తిత్వ ఉద్యమాలలో మీ పోరాటం, అమరం.. అజరామరం…మీ త్యాగం.. మీ త్యాగస్ఫూర్తి నిరూపమానం. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం మీరు చేసిన త్యాగం వెలకట్టలేనిది.
ప్రత్యేక తెలంగాణే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. రాష్ట్ర సాధనకోసం కేసీఆర్ నాయకత్వంలో అనేక రకాలుగా ఉద్యమం కొనసాగింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నా కేంద్రం స్పందించకపోవడంతో ‘తెలంగాణ వచ్చుడో-కేసీఆర్ చచ్చుడో’ అని గర్జించిన కేసీఆర్ 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షకు కూర్చున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలతో సకల జనం రోడ్ల పైకి వచ్చారు. అనేక మంది ఆత్మబలిదానాలకు సిద్ధపడ్డారు. ఒక వైపు కేసీఆర్ దీక్ష.. మరో వైపు బిడ్డల ప్రాణాలు.. ఈ ధర్మ పోరాటంలో మన ఉద్యమానికి ఆనాటి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. కానీ సీమాంధ్రులు కుట్రలు పన్ని సమైక్య ఉద్యమాన్ని లేవనెత్తారు. దీంతో కేంద్రం వెనక్కుతగ్గింది. దీంతో కేసీఆర్ తిరిగి ఉద్యమానికి పిలుపునిచ్చారు. సుదీర్ఘ పోరాటం ఫలితంగా 2014 జూన్ 2న స్వరాష్ట్రం సిద్ధించింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు.
మలిదశ తొలి అమరుడు శ్రీకాంతాచారితో పాటు, పోలీస్ కిష్టయ్య, యాదిరెడ్డి, సువర్ణ, సిరిపురం యాదయ్య, వేణుగోపాల్ రెడ్డి, ఇషాంత్ రెడ్డి.. విలేకరి సునీల్, పావని, చింతకింది మురళి, రవీందర్, సుమలత… ఇలా ఎందరో తెలంగాణ బిడ్డలు రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత వారందరికీ ఘనంగా నివాళులు అర్పించేందుకు గాను హుస్సేన్‌సాగర్ తీరాన అమరజ్యోతిని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. అమరుల త్యాగఫలితమే తెలంగాణ రాష్ట్రం అందుకే ఏ పని మొదలు పెట్టాలన్నా అమరులకే మొదటి వందనం.. నివాళులు అర్పించడం మన కర్తవ్యం. ఎందుకంటే అమరుల త్యాగం గొప్పది. వారి ఆశయాలను, ఆకాంక్షల్ని నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉన్నది.
అమరుల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతున్నది. కాళేశ్వరంతో సాగునీటి రంగంలో విజయం సాధించింది. ఇతర ప్రాజెక్టుల ద్వారా చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. పచ్చని పంట పొలాలు పసిడి సిరుల పంటలతో ఆకుపచ్చ తెలంగాణగా అవతరించింది. అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణ వర్ధిల్లుతున్నది. 90 వేల ఉద్యోగాల నియామకం తుది దశకు చేరుకున్నది. దళిత బంధు ద్వారా దళిత బిడ్డలకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ఐటీ రంగంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి. మన ఆత్మగౌరవ నిలయం అంబేడ్కర్ సచివాలయం. అంబేడ్కర్ విగ్రహం. వీటి మధ్యనే ఆకాశానికే వెలుతురై నిలిచిన అమరుల స్మృతి చిహ్నం.. అమరుల స్ఫూర్తితో మన ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు పోతున్నారు.
ప్రజ్వలించే అమరుల జ్యోతిగా, ఆకాంక్షలను, ఆత్మగౌరవాన్ని నిల్పి వందలాది మంది త్యాగధనుల బలిదానాల చరిత్ర స్మరించుకోవాలని మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆకాంక్ష. మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన పోరాట యోధుడు కేసీఆర్. ఆయన మస్తిష్కం నుండి పురుడు పోసుకున్నదే నేటి తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం. అమరుల త్యాగ స్ఫూర్తి దేదీప్యమానంగా వెలుగుతూ ఉండే అఖండ అమర ద్వీపం… నిత్యం అమరులను మననం చేసుకుందాం..
తెలంగాణ అమర వీరులకు జోహార్లు ! జోహార్లు…