ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత 200 టీఎంసీల గోదావరి జలాలను పోలవరం ద్వారా కృష్ణా బేసిన్‌కు తరలించి, అక్కడి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ ద్వారా పెన్నా బేసిన్లో ఉన్న రాయలసీమ ప్రాజెక్టులకు తరలించే ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ఈ తోవలో 150 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బొల్లపల్లి వద్ద ఒక భారీ కృత్రిమ జలాశయాన్ని నిర్మించడానికి ప్రతిపాదించారు.
రూ.80 వేల కోట్లు ఖర్చు అయ్యే ఈ గోదావరి-బనకచర్ల లింకు ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించాలని కేంద్రప్రభుత్వాన్ని చంద్రబాబు కోరిన వెంటనే అందుకు మోదీ సర్కారు సానుకూలంగా స్పందించింది. దీంతో ఈ ప్రాజెక్టు ప్రభావాలపై తెలంగాణలో చర్చ మొదలైంది. ‘మీరు వాడుకోలేని నీళ్లను, సముద్రంలోకి వృథాగాపోతున్న నీళ్లను మేము వినియోగించుకోవాలని అనుకుంటే తెలంగాణకు అభ్యంతరం దేనికి?’ అని చంద్రబాబు వాపోతున్నారు. ‘మీరు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టుకుంటే మేము వ్యతిరేకించామా?’ అని కూడా అంటున్నారు.
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ప్రభావాలు తెలంగాణ మీద ఏ విధంగా ఉండబోతున్నాయన్న అంశాన్ని చర్చించే ముందు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఏమున్నదో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం-2014 ప్రకారం రెండు రాష్ర్టాలు ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపట్టినప్పుడు గోదావరి/కృష్ణా బోర్డుల అనుమతి, ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిగా పొందాలి. చట్టంలోని ఈ నిబంధనని ఉటంకిస్తూ గతంలో చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, ఆర్ విద్యాసాగర్‌రావు డిండి, సీతమ్మసాగర్, తుమ్మిళ్ల, భక్త రామదాసు తదితర ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదులు చేసిన సంగతి ఆయన మరచిపోయినా తెలంగాణ సమాజం మరచిపోదు.
ఇవి ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్రభుత్వాలు రూపొందించిన ప్రాజెక్టులే అయినా వీటికి కృష్ణా/గోదావరి బోర్డుల అనుమతులు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదని, వాటిని వెంటనే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి, బోర్డులకు ఫిర్యాదులు చేసింది చంద్రబాబే. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌లో, సుప్రీంకోర్టులో ఆంధ్రా రైతులతో కేసులు వేయించి, పనులను అడ్డుకోవడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు.
కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టును కూడా చంద్రబాబు అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కేంద్రం ఇచ్చిన అనుమతులు అక్రమమని, వాటిని రద్దు చేయాలని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు 2018 జూన్‌లో లేఖ రాశారు. ఈ లేఖలో కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర విభజన తర్వాత చేపట్టిన ప్రాజెక్టు కనుక గోదావరి బోర్డు పరిశీలనకు ప్రాజెక్టు డీపీఆర్‌ను పంపించకుండానే, ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందకుండానే కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందని ఆరోపించారు.
తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ప్రాజెక్టుకు అనుమతి మంజూరు చేయడం అభ్యంతరకమని, ఆ అనుమతిని తమ సమక్షంలో తిరిగి సమీక్షించాలని కోరారు. అంతవరకు కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఆపివేయించాలని ఆ లేఖలో కోరారు. అన్ని అనుమతులు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఆపాలని లేఖ రాయడం చంద్రబాబు కుటిలబుద్ధికి నిదర్శనం. ఇప్పుడు ‘కాళేశ్వరం ప్రాజెక్టును మేము వ్యతిరేకించామా?’ అని జూటా మాటలు మాట్లాడుతున్నారు.
మరోవైపు ఎలాంటి అనుమతులు లేకుండానే పట్టిసీమ, పురుషోత్తపట్నం, ముచ్చుమర్రి, గుండ్రేవుల, గాజులదిన్నె, గురు రాఘవేంద్ర, పులికనుమ, సిద్దాపురం, శివభాష్యం, మున్నేరు, పెన్నా-అహోబిలం ఎత్తిపోతల పథకాలు చేపట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఆనాడు రూపకల్పన చేసిన గోదావరి-పెన్నా లింకు పథకం ఇప్పుడు గోదావరి- బనకచర్ల లింకు పథకంగా కొత్త రూపం సంతరించుకున్నది.
కాబట్టి ఆయనే చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం చంద్రబాబు గోదావరి-బనకచర్ల లింకు పథకం డీపీఆర్‌ను గోదావరి బోర్డుకు సమర్పించాలి. డీపీఆర్ ప్రతిని పరిశీలన కోసం తెలంగాణ ప్రభుత్వానికి పంపించాలి. గోదావరి బోర్డులో చర్చ జరిగిన తర్వాత అపెక్స్ కౌన్సిల్లో చర్చకు పెట్టాలి. అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందిన తర్వాతే ప్రాజెక్టు పనులు చేపట్టాలి. ఇవేవీ చేయకుండా నేరుగా ప్రాజెక్టు పనులు చేపట్టడం, అందుకు కేంద్రం నిధులు సమకూర్చడం చట్ట విరుద్ధం. ఇది మొదటి అంశం.
ఇకపోతే చంద్రబాబు అంటున్నట్టు మనం వినియోగించుకోలేని నీళ్లను, సముద్రంలోకి నిరుపయోగంగా పోతున్న గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ కరువు ప్రాంతాలకు తరలించుపోతానంటే తెలంగాణకు అభ్యంతరం ఎందుకు ఉండాలి? అన్న ప్రశ్న సామాన్య జనాలకు సబబే కదా అనిపించక మానదు. అయితే ఇది లోతుగా పరిశీలించవలసిన అంశం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే గోదావరి జలాల పున:పంపిణీ కోసం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం, 1956 సెక్షన్ 3 కింద గోదావరి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రానికి అర్జీ పెట్టుకున్నది. వారి అర్జీని కేంద్రప్రభుత్వం పరిశీలిస్తున్నది. తెలంగాణ సహా గోదావరి బేసిన్ రాష్ర్టాల అభిప్రాయాలను సేకరిస్తున్నది. రేపోఎల్లుండో గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటవడం ఖాయం. అంతకుముందే ఏపీ 200 టీఎంసీల నీటిని వినియోగించే గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు పనులను ప్రారంభించి రూ.వేల కోట్లు ఖర్చు చేసి గోదావరి ట్రిబ్యునల్ ముందు 200 టీఎంసీల నీటిని జీబీ లింకు ప్రాజెక్టుకు కేటాయించాలని వాదించే అవకాశం ఉన్నది.
ఇప్పుడు అమల్లో గోదావరి ట్రిబ్యునల్‌లో పొందుపరచిన 10 అంతర్రాష్ట్ర ఒప్పందాల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్కగట్టిన 1486 టీఎంసీలలో తెలంగాణ ప్రాజెక్టులకు 969 టీఎంసీలను కేటాయించారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో వాస్తవ వినియోగం 200 టీఎంసీలకు మించలేదు. కేటాయింపులు కాగితాల మీదనే ఉన్నాయి. కొన్ని ప్రాజెక్టులు అసంపూర్ణంగా ఉండిపోవడంతో తెలంగాణ తన వాటాను సంపూర్ణంగా వినియోగించుకోలేకపోయింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గోదావరి జలాలను సంపూర్ణంగా వినియోగించుకోవడానికి కాళేశ్వరం, సమ్మక్క బ్యారేజీ, సీతమ్మసాగర్, చనాక కోరాట ప్రాజెక్టులను చేపట్టింది. దేవాదుల, కుమ్రం భీం తదితర పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసింది. గోదావరి ప్రాజెక్టులన్నిటికి కేంద్ర జల సంఘం నుంచి అనుమతులు సాధించుకున్నది. గోదావరి బేసిన్లో తెలంగాణ వాటా 969 టీఎంసీలను ఏపీ సదా వ్యతిరేకిస్తూనే ఉన్నది. అదే సమయంలో ఏపీ తన వాటా 775 టీఎంసీలని పేర్కొంటున్నది. గోదావరి జలాల్లో వాటాలు తేల్చడానికి ట్రిబ్యునల్ వేయాలని ఇప్పటికే కేంద్రాన్ని ఏపీ కోరింది కనుక, గోదావరి ట్రిబ్యునల్ ఎప్పటికైనా ఏర్పడే అవకాశముందన్న సంగతి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రహించారు.
పైన తెలిపిన పరిస్థితుల నేపథ్యంలో గోదావరి జలాల్లో ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన 969 టీఎంసీల నికర జలాలపై, గోదావరిలో వానకాలంలో లభ్యమయ్యే అపారమైన వరద జలాలపై తెలంగాణ హక్కులను ట్రిబ్యునల్ ఏర్పడకముందే స్థిరపరిచే దిశగా ముందుచూపుతోనే కాళేశ్వరం మూడో టీఎంసీ పనులను చేపట్టాలని, 36 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో సీతమ్మసాగర్ బ్యారేజీని నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించారు.
కేసీఆర్ ప్రభుత్వం చొరవ వల్ల 969 టీఎంసీల నికర జలాల్లో ఇప్పటికే 950 టీఎంసీలకు పైగా కేంద్ర జల సంఘం నుంచి హ్రైడాలజీ క్లియరెన్సులు పొందడం విశేషం. ఇంకా సమ్మక్కసాగర్ (47 టీఎంసీలు), కాళేశ్వరం 3వ టీఎంసీ, వార్ధా (12 టీఎంసీలు) ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు రావలసి ఉన్నది. ఈ స్థితిలో ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ప్రాజెక్టులకు చేసిన 969 టీఎంసీల నీటిపై హక్కులు స్థిరపరచుకోకుండా ఆంధ్రప్రదేశ్ చేపట్టే ఏ కొత్త ప్రాజెక్టునైనా అనుమతించడం ఆత్మహత్యా సదృశం కాగలదు.
ఇక్కడ కృష్ణా బేసిన్ అనుభవాలను మనం విశ్లేషించుకోవాలి. ఆనాడు బచావత్ ట్రిబ్యునల్ ఏపీలో ముందే వినియోగంలో ఉన్న నీటికి రక్షణలు కల్పించిన కారణంగానే బేసిన్ పెరామీటర్లలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలతో పోల్చినప్పుడు ఆంధ్రపదేశ్ వెనుకబడి ఉన్నప్పటికీ 811 టీఎంసీల పెద్ద వాటాను సాధించుకోగలిగింది. బచావత్ ట్రిబ్యునల్ గడువు 2000 మార్చిలో ముగిసిపోతుందని అన్ని రాష్ర్టాలకు ముందే తెలుసు కాబట్టి, కొత్త ట్రిబ్యునల్ ముందు తమ నీటి హక్కులను స్థిరపరచుకోవడానికి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలు సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిచ్చి, నిధులు కేటాయించి ప్రాజెక్టులను నిర్మించుకున్నాయి. ఆంధ్రపదేశ్ కూడా వరద జలాలపై ఆధారపడిన రాయలసీమ ప్రాజెక్టులను ఆగమేఘాల మీద పూర్తిచేసింది.
తెలంగాణలో కూడా వరద జలాలపై ఆధారపడిన ఎత్తిపోతలు.. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రారంభమైనా అవి పెండింగ్ ప్రాజెక్టులుగానే మిగిలిపోయాయి. వరద జలాల కేటాయింపులతో మంజూరైన డిండి, పాలమూరు ఎత్తిపోతల పథకాలు అమలు కాకుండానే అటకెక్కాయి. కృష్ణా ట్రిబ్యునల్ అనుభవాల నుంచే కేసీఆర్ ప్రభుత్వం కూడా గోదావరి బేసిన్లో నీటి హక్కులను స్థిరపరచుకునే ఆలోచనతోనే కాళేశ్వరం మూడో టీఎంసీ, సీతమ్మసాగర్ బ్యారేజీ పనులను చేపట్టడం, ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు సాధించడంపై దృష్టిపెట్టింది. కృష్ణా బేసిన్లో వేసిన ఎత్తుగడతోనే ఇప్పుడు చంద్రబాబు ముందుకు సాగుతున్న సంగతిని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి.
మరొక ముఖ్యమైన డిమాండ్‌ను కూడా గోదావరి బోర్డు ముందు, కేంద్ర ప్రభుత్వం ముందు తెలంగాణ ఉంచడం అవసరం. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టా అవసరాలకు తరలించుకోవచ్చు. ఆ మేరకు కృష్ణా నీటిని నాగార్జునసాగర్ ఎగువన పోలవరం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం అనుమతించిన రోజు నుంచే మహారాష్ట్ర 14 టీఎంసీలు, కర్ణాటక 21 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 45 టీఎంసీలను బేసిన్లో ఉండే ఆయకట్టు అవసరాలకు, తాగునీటి అవసరాలకు వినియోగించుకోవచ్చు. రాష్ట్ర విభజన తర్వాత నాగార్జునసాగర్ ఎగువన తెలంగాణ రాష్ట్రమే ఉన్నది కనుక ఉమ్మడి ఏపీకి కేటాయించిన 45 టీఎంసీలు తెలంగాణకే చెందుతాయి. అందుకే ఈ నికర జలాలను పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించడం జరిగింది.
గోదావరి అవార్డులోనే 80 టీఎంసీలకు మించి గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించినట్టయితే ఆ నీటిలో కూడా అదే నిష్పత్తిలో.. అంటే 45:21:14 నిష్పత్తిలోనే కృష్ణా జలాల్లో వాటాను ఎగువ రాష్ర్టాలైన తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర డిమాండ్ చేయవచ్చు. ఇప్పుడు ఏపీ 200 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు, అటు నుంచి పెన్నా బేసిన్‌కు తరలించుకుపోతున్నది కనుక గోదావరి అవార్డు ప్రకారం కృష్ణా జలాల్లో అదనంగా 112.5 టీఎంసీల వాటాను డిమాండ్ చేయవచ్చు.
ఈ వాటాకు ఏపీ అంగీకరిస్తే గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ అంగీకరించే అంశాన్ని పరిశీలించవచ్చు. తెలంగాణ ఎల్లప్పుడూ గివింగ్ ఎండ్‌లో, ఏపీ రిసీవింగ్ ఎండ్‌లో ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు కృష్ణాలో నీటి వాటాను పొందడానికి తెలంగాణ ప్రభుత్వం ఏపీ సర్కార్‌ను డిమాండ్ చేస్తుందా? లేదా గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు మౌనంగా అంగీకారం తెలియజేస్తుందా? అనే విషయాన్ని తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తూ ఉండాలి. అప్రమత్తతే మనకు శ్రీరామ రక్ష.
– విశ్రాంత సూపరింటెండింగ్ ఇంజినీర్ శ్రీధర్‌రావు దేశ్‌పాండే ,94910 60585