‘మందు మంచిగెయిరా.. కింద ఎగజల్లకు’ మక్కకు మందేస్తున్న నా మీదికి నాల్కె మర్రేసింది అజ్జిరవ్వ. ‘పోరని దిక్కు జూసింది మా సాలుగని నువ్వయితే ఈ తట్టల మందు వోస్కరాపో..’ నా మీదికి గుర్కాయించి సూత్తున్న అజ్జిరవ్వ చేతిల తెల్లతట్ట వెట్టిండు బాపు. నపరో సాలుకు మక్కకు మందేసుకుంటా ముందుకువోతాంటే మజ్జల్నే మందు (యూరియా) అయిపోయింది. మందు బర్కతిస్తలేదు, చెట్టు మొదళ్ల నేను ఎక్కువ మందు పారవోస్తున్ననేమోనని అజ్జిరవ్వ అనుమానం.
నా దిక్కు గుర్కాయించి జూసేసరికి అమ్మమీదికి గుడ్లు దెర్సిండు బాపు. ఆయన సూపులకు భయపడ్డ అమ్మ ఆ తెల్లతట్టను దీస్కొని మక్కసాలు మజ్జనకెల్లి శింతచెట్టు కాడికి నడుస్తున్నది. మేం మక్కశేనుకు మూడు సార్లు మందేస్తం. మొదాలు అమ్మోనియా, రెండోసారి అడుగుమం దు.. మూడోసారి యూరియా ఏస్తం. ఇప్పుడు మేం ఏసేది యూరియా కావట్టి మక్క పీసేత్తున్నదన్నట్టు. అంటే ఇంకో ఐదారు రోజులైతే కంకి ఊరుతది. బాపు, నేను అదే మక్కసేను మజ్జల్నే గూసున్నం. తట్టల మందు వోస్కరాను వోయిన అజ్జిరవ్వ అటేవోయింది. ‘మందు ఎక్కువ తక్కువ పారవొయ్యొద్దు బిడ్డా.. అసలే యూరియా పిరం ఉన్నది. పిరికిట్ల మందు దీస్కొని బొటనేలుతోని శిన్నగ జారిడువాలె, అప్పుడే మందు ఎదిగొస్తది’ అని ఎర్ర దుబ్బను పిడికిట్ల వట్టుకొని మక్కకు వోసుకుంటా సూపెట్టిండు బాపు.
మక్కశేనుకు మందెయ్యడానికి ముందురోజు..: నాత్రి ఎనిమిది గొడ్తున్నది. అప్పుడే వాడుక సీసకు వొయ్యొచ్చిన బాపు పెద్దర్వాజ ముందు నుల్క మంచమ్మీద గూసున్నడు. ‘అన్నం ఉమ్మగిలేముందు పొయిల నీళ్లు వోత్తవా?, నోటికాడి బుక్కను కింద వారెత్తవా?’ మంచం మీద బాపును అడుగుతున్నది అజ్జిరవ్వ. ‘అర్రె అజ్జిరీ… నేనేం జెయ్యాల్నె, ఇంటికి రాంగనే మన్సున వట్టనియ్యవ్? ఆ కోమటాయెన దగ్గర్కి ఇప్పుడే వొయ్యొస్తున్న. ఉద్దెరనుకొని ముందుగాల్లనేమో యూరియా మందు లేదన్నడు. “ఏ సేటు పైసలిత్త ఉద్దెరేం గాదు” అన్న తర్వాత రామసామి రేపు రాపో మరి’ అన్నడు.
‘తెల్లారేసరికి ఎనభై రూపాలకు ఏడికి వోవాలె? (1998 అనుకుంటా.. యూరియా బత్తా 80 రూపాలు) కైకిలి పైసలు ఎవ్వలిత్తలేరు? ఎవ్వల్నన్న ఓ ఎనభై రూపాలడిగి ఒక్క యూరియా బత్తా దే, లేకుంటే మక్క నాశిడమైతది?’ అమ్మకు, బాపుకు ఎనభై రూపాల కోసం ఒక్కటే మొకాన చర్చలు నడుస్తున్నయి. ‘ఇగొవట్టు గా నర్సిగాన్ని అడిగితే నలభై రూపాలిచ్చిండు.. ఇంకో నలబై అయితే పొద్దుగాల్ల యూరియా బత్తా దెస్తా’ ‘నలభై రూపాలకు నేనేడికి పోవాలె..’, ‘ఇగ్గొ ఊకె ఒర్రియ్యకు… దొర్కితెనేమో మక్కకు మందేద్దాం.., లేకుంటెనేమో బంగ్లా రాజవ్వ బర్లనిడుద్దాం’ అని నెత్తి రుమాలు దీసి న్యాలకు సంపిండు బాపు. ఆయన కోపాన్ని అర్థం జేసుకున్న అజ్జిరవ్వ నోర్మూసుకొని పళ్లెం ముందల వెట్టి ఇంత బువ్వేసింది. రెండుకాళ్ల మీద గూసున్నడు. తెల్లబువ్వల ఇంత ఉప్పేసుకొని ఇన్ని నీళ్లు వోసుకొని దబదబా నాలుగు బుక్కలు మల్శి నోట్లె వెట్టిం డు. నేను, బాపు బైట పండుకున్నం. అమ్మా-చెల్లె రేకుల కింద పండుకున్నరు.
‘ఓ పోడ… గా ఎంకటవ్వ పెద్దమ్మ దగ్గర్కి వొయ్యి అమ్మ పది రూపాలియ్యిమంటున్నదని అడుక్కరాపోరా’ అని నన్ను మామిడోల్ల వాడకు దోలింది. నాకన్న ముందు ‘బుజ్జీ… గంగిపెల్లి శిన్నమ్మ దగ్గర్కి వొయ్యి కైకిలి పైసలియ్యిమనుపోయే.. ఇచ్చేదాన్క ఇంటికాన్నే గూసో, ఇయ్యకుంటె అస్సల్కే రాకుమని’ శెల్లెను గడెన్కతోటకు దోలింది. అద్దగంటయిన తర్వాత నేను, శెల్లె ఇద్దరం ఒక్కసారే ఇంటికి జేరుకున్నం. ‘అమ్మా.. గంగిపెల్లి శిన్నమ్మ పది రూపాలే ఇచ్చిందే.. ఇంకో పది మల్లిస్తనన్నది’ అని శెప్పుకుంటా అమ్మ చేతిల పదిరూపాలు వెట్టింది శెల్లె. నేన్గూడ ఎంకటవ్వ పెద్దమ్మ ఇచ్చిన 10 రూపాలు అమ్మ చేతిల వెట్టిన. మొత్తం అరువై రూపాలైనయి. యూరియా బత్తా రావాల్నంటే ఇంకో ఇరువై గావాలె. ఆ అరువై రూపాలు బాపుచేతిల వెట్టింది. అట్లా వెట్టంగనే బాపు కోపం నశాలానికంటింది… ఈ అరువై రూపాలకు యూరియా బత్త రాదు, మన్ను రాదు, కోమటాయెన దగ్గర్కి వోయి మళ్లా మర్రి రావాల్నా?’ అని అమ్మ మీదికి కోపానికొచ్చిండు. ‘ఆగుల్లా.. ఆయింత ఇరువై మా దెస్తనని సాయమాన్లకు వోయింది అమ్మ.. సాయమాన్లకు వొయ్యొచ్చిన అమ్మ తతిమా ఇరువై రూపాలు గూడ బాపు చేతిల వెట్టింది’. పక్కకే ఉన్న నా ముక్కులకు చాపత్త వాసన గుమగుమా గొట్టింది.
నిన్న పొద్దుగాల్ల.. టైం జూత్తే పది యాబై గొడ్తున్నది. ఒక్కసారి ఫోన్కు మెసేజ్ వచ్చింది. గిప్పుడేం మెసేజా అని ఓపెన్జేసి జూసిన. నీ అకౌంట్ల 1687 రూపాలు జమయినయనేది ఆ మెసేజ్ సారాంశం. గిప్పుడెవ్వల్ పైసలేసిర్రా అని శిట్కెనేలు నోట్లె వెట్టుకొని గోరు కొర్కుతున్న… అప్పుడే ఇంకో మెసేజ్ అచ్చింది. ఆ మెసేజ్ ఎవ్వలు పంపిర్రో తెలుసా?
“తెలంగాణ ప్రభుత్వం ‘రైతుబంధు’ (వానకాలం 2023) పథకం ద్వారా 1,687/- రూపాయలు మీ బ్యాంకు ఖాతా నం…… నందు జమచేసింది. ఈ సహాయం పెట్టుబడి, ఇతర వ్యవసాయ పనుల కోసం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను..
– మీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ముఖ్యమంత్రి” అని ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిండు.
ఆ మెసేజ్ సదివినంక ఒక్కసారి నాకు బాల్యం యాదికొచ్చింది. పెట్టువడి పైసల కోసం అమ్మాబాపులు వడ్డ తిప్పలు గుర్తుకొచ్చినయి. యాసంగి, వానకాలం అచ్చినప్పుడల్లా ఫోన్జేసి ‘కేసీఆర్ పైసల్ వడ్డయారా’ అని అడిగే బాపు ఇప్పు డుంటే ఎంత మంచిగుండో అనిపిచ్చింది.
గడ్డం సతీష్: 99590 59041