రావణ సంహారం తర్వాత శ్రీరాముడు పాలన సాగిస్తూ, తన పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని వేగులను అడుగుతాడు. కొంతకాలం రావణాసురుడి చెరలో ఉండి వచ్చిన సీతమ్మను ఏలుకోవడం పట్ల అయోధ్యలో కొందరు రకరకాలుగా అనుకుంటున్నారని చెప్పగానే శ్రీరాముడు మరో విషయం ఆలోచించకుండా సీతమ్మను అడవిలో విడిచిపెడతాడు. ఇది రామాయణం. ఒక సామాన్యుడి మాటకు కూడా విలువ ఇచ్చి పాలించిన రాజ్యం కాబట్టి శ్రీరాముని పాలనను రామరాజ్యం అని ఇప్పటికీ గొప్పగా చెప్పుకొంటున్నాం.
అదే రాముడిని ఆధారం చేసుకొని, మూడు దశాబ్దాల ప్రయత్నంతో రెండు సీట్ల నుంచి మొదలైన బీజేపీ ప్రస్తుతం రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. మూడవసారి అధికారం చేపట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నది. సీతను అనుమానించారని చెప్పగానే శ్రీరాముడు ఆగ్రహోదగ్రుడై వాడిని దేశద్రోహిగా ప్రకటించండి, వాడి తల నరకండి అని ఆజ్ఞాపించి ఉంటే పురాణాల్లో, చరిత్రలో మనకున్న కొన్ని వేల మంది రాజుల్లో శ్రీరా ముడు ఒకడిగా ఉండేవాడు. అలా చేయకుం డా సామాన్యుడి మాటకు కూడా విలువ ఇచ్చా డు కాబట్టే దేవుడిగా పూజలందుకుంటున్నాడు. రామరాజ్యం అని చెప్పుకొనేట్టు పాలించాడు. శ్రీరాముడిని తమ పార్టీ రాజకీయ జెండాగా మార్చుకున్న బీజేపీ పాలకులు మాత్రం సరిగ్గా దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
ఈ కలికాలంలో రామరాజ్యాన్ని ఆశించడం అత్యాశే అవుతుంది కానీ, ప్రపంచం అంతా ఆధారాలతో సహా వేలెత్తి చూపుతున్నా పట్టించుకోకపోవడమే కాకుండా దేశద్రోహులని ముద్ర వేయడం బీజేపీ పాలకులకే చెల్లింది. అదానీ మాయాజాలం గురించి ఇప్పుడే దేశానికి తెలిసింది, హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వల్లనే తెలిసింది అన్నట్టుగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు. కానీ, అదానీ బుడగ ఏదో ఒకరోజు పేలుతుందని స్టాక్ మార్కెట్‌తో పరిచయం ఉన్న అందరికీ తెలుసు. రెండు మూడు వేల మంది చూసే చోటామోటా యూట్యూబ్ ఛానల్ మొదలుకొని, లక్షల మందిపై ప్రభావం చూపే మన దేశానికి చెందిన బిజినెస్ ఛానళ్ల వరకు అందరికీ అదానీ గ్రూప్ స్టాక్స్ మాయాజాలం గురించి తెలుసు. చాలా ఛానళ్లు ఇన్వెస్టర్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంటాయి. ఏ స్టాక్ కొనాలి, ఏది అమ్మాలి, మార్కెట్ ఎలా ఉంటుంది, కంపెనీ బలాబలాల గురించి చెప్తాయి. ఒక్క అదానీ స్టాక్స్ గురించి మాత్రం అన్ని ఛానల్స్ సమాధానం ఒకేరకంగా ఉంటుంది. అదానీ స్టాక్స్ వీటికి అతీతమైనది, మోదీ-అదానీ బంధమే ఈ స్టాక్స్ బలం అని చెప్తాయి.
అదానీ మాయాజాలం గురించి హిండెన్‌బర్గ్ నివేదిక బయటికి రాగానే ఆ స్టాక్స్ పేక మేడల్లా కూలిపోయాయి. ప్రపంచ సంపన్నుల్లో రెండవ స్థానంలో ఉన్న అదానీ 26వ స్థానానికి పడిపోయారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం ఇప్పుడు అదానీ ఆస్తి 49.1 బిలియన్ డాలర్లు. హిండెన్‌బర్గ్ నివేదిక బహిర్గతం కాక ముందు అదానీ ఆస్తి విలువ 135 బిలియన్ డాలర్లు. అంటే, హిండెన్‌బర్గ్ నివేదికతో దాదాపు మూడొంతుల ఆస్తి కరిగిపోయింది. ఇది ఒక్క అదానీకే పరిమితం కాదు. ఆయన కంపెనీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసినవారిని సైతం కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టింది.
భారతీయ స్టాక్‌మార్కెట్‌కు ఇటువంటి దెబ్బలు మొదటిసారేమీ కాదు. కానీ ఇలాంటి పరిస్థితే తొలిసారి. హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్, సత్యం రామలింగరాజు కుంభకోణాలను ఈ మార్కెట్ చూసింది. దోషులకు శిక్ష పడింది. మార్కెట్లో లోపాలు ఏమిటో గుర్తించి ఇలాంటివి పునరావృతం కాకుండా కొన్ని మార్పులు తీసుకువచ్చారు. అదానీ వ్యవహారాలపై అందరూ వేలెత్తి చూపినప్పుడు, అర్థం పర్థం లేకుండా ఆ కంపెనీ స్టాక్స్ దూసుకువెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవలసింది. కానీ అచ్చోసిన ఆంబోతును వదిలేసినట్టు వదిలేశారు. వదిలేయడమే కాదు. గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఎదురుదాడి జరుగుతున్నది.
అదానీ వ్యవహారాన్ని బయటపెట్టిన వారు, ప్రశ్నించిన వారు అందరూ ఈ దేశంపై కుట్ర పన్నుతున్న దేశద్రోహులని దుష్ప్రచారం చేస్తున్నారు. అదానీ ప్రమోటర్స్ వాటా స్టాక్స్‌ను అదానీ సోదరుడు రష్యా బ్యాంకులో తనఖా పెట్టాడు. దీనికి సంబంధించి సెబీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అని బ్లూమ్‌బర్గ్ బయటపెట్టింది. ఐనా సెబీ నుంచి మౌనమే. ఒక మామూలు వ్యక్తి ఫలానా స్టాక్ కొనండి అంటూ ఓ వీడియో చేసి యూట్యూబ్‌లో పెడితే, అది తప్పుదారి పట్టించేదిగా ఉందని భావిస్తే సెబీ ఆ యూట్యూబర్‌కు జరిమానా విధిస్తుంది.
చాలామందికి అలా జరిమానా విధించింది కూడా. చీమలు, దోమలను వెతికి పట్టుకుంటున్న సెబీకి అదానీ ఏనుగు కనిపించడం లేదు. హిండెన్‌బర్గ్ నివేదికలో అదానీ స్టాక్స్‌కు బయట కనిపిస్తున్న విలువలో అసలు విలువ 20 శాతమే అని, 80 శాతం వరకు తగ్గాలి అని పేర్కొన్నారు. నివేదిక వెలుగు చూశాక పలు స్టాక్స్ ఆ మేరకు తగ్గాయి కూడా. అదానీ గ్రీన్ రూ.2,500 నుంచి రూ.567కు పడిపోయింది. ఈ విధంగా 80 శాతం తగ్గినా, కనీసం ఆ ధర అక్కడైనా స్థిరంగా ఉంటుంద న్న నమ్మకం లేదు.
ప్రతి రోజు ఐదు శాతం లోయర్ సర్క్యూట్లో స్టాక్ నిలుస్తున్నది. స్టాక్ మార్కెట్ అంటేనే ఇలాంటి భారీ ఎగుడు దిగుళ్లు ఉంటాయి. వాటికి సిద్ధపడే వస్తారు. కరోనా, యుద్ధాలు వంటి పరిస్థితుల్లో మార్కెట్ పడిపోతే ఎవరూ చేయగలిగిందేమీ లేదు. కానీ మిత్రుడిపై గుడ్డి ప్రేమతో దేశం ఏమైనా సరే మిత్రుడికి పాలకులు అండగా నిలిస్తే, అది రాముడిని ఆదర్శంగా తీసుకున్న పాలన కాదు. ధృతరాష్ర్టుడి గుడ్డి ప్రేమ అవుతుంది.
అదానీ అక్రమాలను బయటపెడితే దేశంపై దాడి అంటున్నారు. అదానీ కంపెనీలోని అవకతవకలను ఎవరు ప్రశ్నించినా దేశద్రోహి అనే ముద్ర వేస్తున్నారు. ఇలాంటి భారీ కుంభకోణం మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవటానికి ఒక నిపుణుల కమిటీ వేయాలని సుప్రీంకోర్టు భావిస్తే, కేంద్రం సీల్డ్ కవర్లో పేర్లు పంపింది.
సీల్డ్ కవర్ అవసరం లేదు, పారదర్శకంగా ఉండేట్టు కమిటీ మేమే వేస్తామని సుప్రీం చెప్తే, బీజేపీ అనుకూల మీడియాలో ఏకంగా అత్యున్నత న్యాయస్థానానికే వ్యతిరేకంగా వ్యాసాలు. దేశంలో బీజేపీ దాదాపు 30 శాతం ఓట్లతోనే అధికారంలోకి వచ్చింది. అంటే, మిగిలిన 70 శాతం మంది ప్రజలను దేశద్రోహులని చిత్రీకరిస్తారేమో.
కరోనా దెబ్బతో అనేక దేశాలు చైనాకు ప్రత్యామ్నాయంగా మరో దేశం వైపు చూస్తుంటే ఆ అద్భుత అవకాశాన్ని మన దేశం అందిపుచ్చుకోలేదు. శ్రీలంక, పాకిస్థాన్‌లా చైనా మారబోతుంది, మోదీ.. మోదీ అంటూ వాట్సాప్ యూనివర్సిటీలు ఓ వైపు ప్రచారం చేస్తుంటే, మన స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ నిధులు పెద్ద మొత్తంలో చైనాకు తరలివెళ్తున్నాయి. అదానీ కుంభకోణం వెలుగులోకి రాక ముందునుంచే నిధులు వెళ్తున్నాయి. విదేశీ సంస్థల నిధులు అలా వెళ్లిపోతుంటే నిజానికి మన మార్కెట్లు కుప్పకూలాలి. కానీ కొద్దిపాటి ప్రభావమే పడుతున్నది. దానికి కారణం రిటైల్ ఇన్వెస్టర్లు. కరోనా కాలంలో పెద్ద సంఖ్యలో యువత స్టాక్‌మార్కెట్ వైపు వచ్చింది. ఇలా రిటైల్ ఇన్వెస్టర్ల మార్కెట్‌ను నిలబెట్టడం గతంలో ఎప్పుడూ లేదు.
అఫ్గానిస్థాన్‌తో సహా ఏ దేశం కూడా ఇప్పుడు ప్రపంచంతో సంబంధం లేకుండా ఒంటరిగా జీవించలేదు. అదానీ తప్పును ఎవరు ప్రశ్నించినా దేశద్రోహి అనో, దేశంపై కుట్ర అనో ముద్ర వేసి తప్పించుకోవడం సాధ్యం కాదు. ప్రపంచం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకతప్పదు. అదానీ స్టాక్స్ ధరలు 80 శాతం వరకు పడిపోయాయి, అదానీ సంపద మూడొంతులు తగ్గింది అంటేనే అక్రమాలు నిజమో కాదో తెలుస్తున్నది. మన దేశీయుల విశ్వాసాన్ని నిలుపుకోవాలన్నా, ప్రపంచం విశ్వాసం పొందాలన్నా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. నిజానిజాలు బయటపెట్టాలి.
భారతదేశం అంటే అదానీ కాదు, బీజేపీ కాదు. దేశంలో వాళ్లు భాగమే కానీ వాళ్లే దేశం కాదు. ఈ దేశం అందరిదీ. ఈ దేశాన్ని పాలిస్తున్న వారు మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుంటారా? అధర్మ మార్గాన వెళ్తున్నప్పటికీ తనయులపై గుడ్డి ప్రేమ చూపిన గుడ్డిరాజు ధృతరాష్ర్టుడిని ఆదర్శంగా తీసుకుంటారో చూడాలి. ధృతరాష్ర్టుడే ఆదర్శమైతే ధృతరాష్ర్టుడి జీవితం లాగానే వీరి జీవితం తయారవుతుంది.
భారతదేశం అంటే అదానీ కాదు, బీజేపీ కాదు. దేశంలో వాళ్లు భాగమే కానీ వాళ్లే దేశం కాదు. ఈ దేశం అందరిదీ.ఈ దేశాన్ని పాలిస్తున్న వారు మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుంటారా? అధర్మ మార్గాన వెళ్తున్నప్పటికీ తనయులపై గుడ్డి ప్రేమ చూపిన గుడ్డిరాజు ధృతరాష్ర్టుడిని ఆదర్శంగా తీసుకుంటారో చూడాలి. ధృతరాష్ర్టుడే ఆదర్శమైతే ధృతరాష్ర్టుడి జీవితం లాగానే వీరి జీవితం తయారవుతుంది.
బుద్దా మురళి: 98499 98087