ఆచార్య వెలుదండ నిత్యానందరావు పరిశోధన జిజ్ఞాస, అభిరుచి, పాండిత్యాల మేలు కలయిక. దృష్టికి వచ్చిన ప్రతి రచనను చదివి సాహిత్య రసానందాన్ని అనుభవించి, దాన్ని లోకానికి పంచడం ఆయనకు ‘పెన్నుతో పెట్టిన విద్య’. ఇదే ఎన్నో కావ్యాలపై, సాహిత్య పరిశోధన వ్యాసాలపై, విశిష్ట వాఙ్మయ మూర్తులపై వందలాది విమర్శనాత్మక వ్యాసాలు రాయటానికి కారణమైంది.
సాహిత్యేతర అంశాలను చారిత్రకంగా పరిశీలించి రాయడం కూడా నిత్యానందరావు నిర్నిద్ర పరిశ్రమకు నిదర్శనం. పరిశోధనా చక్షువైన ఆయన మూడు తరాల సాహితీ విమర్శకుడిగా ఖ్యాతి గడించారు. తనకన్నా ముందుతరంవారైన నిడదవోలు వెంకటరావు, జీవీ సుబ్రహ్మణ్యం, ఎస్వీ రామారావు, అక్కిరాజు రమాపతిరావు, ఆరుద్ర మొదలైనవారి స్ఫూర్తితో తన తరానికే కాక భావి పరిశోధకులకూ మార్గదర్శిగా మారారు.
నిత్యానందరావు ఎన్నో ఉపయుక్త గ్రంథాలు, వ్యాసా లు చదివి కావలసిన విపులమైన విషయ సేకరణకు పూనుకుంటారు. పూర్వకాలపు పీఠికలు పుస్తక సమీక్షల కోసం నాటి ‘భారతి’ పత్రికలన్నీ అధ్యయనం చేయడ మే కాదు వాటి ఫొటో కాపీలన్నీ తీసి దాచుకున్నారు. పరిశోధన ఆయన వ్యసనం. రచన ఆయనకు అశనం (ఆహారం). దేశ విదేశాల్లో వివిధ విశ్వవిద్యాలయాల్లో తెలుగులో పరిశోధన చేసినవారి వివరాలన్నీ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సేకరించారాయన.
డిగ్రీ పూర్తికాకముందే ఆయన రాసిన సాహితీ విమ ర్శ వ్యాసాలు నాటి సుప్రసిద్ధ పత్రికలు ప్రచురించాయి. తనను తీర్చిదిద్దిన విశ్వవిద్యాలయంలోనే ఉపన్యాసకునిగా ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి ఆచార్యునిగా, తెలుగు శాఖాధ్యక్షునిగా రాణించారు. నిత్యానందరావు నిర్మలహృదయుడు. వెలుదండ ఇంటిపేరైతే, నిత్యానందమైన ‘హాస విలాసం’ ఆయన ఒంటి తీరు. మాటలో స్వచ్ఛత, నిర్మొహమాటత్వం ఆయన సొంతం. ఇదే ఆయన విమర్శలోనూ ప్రతిఫలిస్తుంది. విమర్శకుడిగానే కాకుండా ‘చంద్రలేఖా విలాపం’ అనే తొలి వికట ప్రబంధంపై ఎంఫిల్ పట్టాను, ఎవరూ స్పృశించని తెలుగు సాహిత్యంలో పేరడీలపై డాక్టరేట్ పట్టాను పొందారు.
బంకించంద్ర ఛటర్జీ, బూర్గుల రామకృష్ణారావుల జీవితం-రచనలపై చేసిన రచనలు దేశభక్తికి, రాజనీతిజ్ఞతకు నిలువుటద్దాలు. వచ్చే శుభకృత్లో స్వీట్ సిక్సీలోకి అడుగుపెట్టబోతున్న వేళ.. కలిసివచ్చిన ఖాళీ సమయా న్ని (కరోనా కాలాన్ని) సద్వినియోగపరచుకొన్నారు. గతంలో తాను వెలువరించి ప్రచురించిన అనేక వ్యాసా లు, సమీక్షలను తన ‘సమగ్ర సాహిత్యం’ పేరిట 7 పుస్తకాలను విడుదల చేస్తున్నారు. వాటిలో ‘అనుభూతి-అన్వేషణ’ పేరిట147 పుస్తక సమీక్షలతో, 82 భిన్నభావాల పీఠికలతో బృహత్ సంకలనాన్ని తెచ్చారు. నిత్యానందరావు సాహిత్య వికాసానికి ఈ గ్రంథం కొలమా నం. పత్రికలకు ‘కాలమ్’ దాటని ప్రతిభతో సంక్షిప్తతతో కూడిన విషయ సమగ్రత సాధించడం మరో విశిష్టత. ఇలా 1978లో మొదలైన రాతపనికి విరామమే లేదు.
నాగరకర్నూల్ జిల్లా మంగునూరు ముద్దుబిడ్డ, నిత్య నవీన పరిశోధకుడు నిత్యానందరావును తెలుఘ/ ఉత్తమ విమర్శకునిగా గుర్తించి కీర్తి పురస్కారాన్ని అందిస్తున్నవేళ ఇది వెలుదండ మెడలో అక్షరాల విరిదండ.
(రేపు ఆచార్య వెలుదండ ఉత్తమ సాహిత్యవిమర్శకునిగా ‘కీర్తి పురస్కారం’ అందుకోనున్న సందర్భంగా..)
(వ్యాసకర్త: గురుకుల విద్యాలయాల సంస్థలో విశ్రాంత ప్రధానాచార్యులు)
మరుమాముల దత్తాత్రేయ శర్మ