2024, ఫిబ్రవరి 6న ముఖ్యమంత్రి రేవంత్ కార్యాలయంలో మూసీ నది సుందరీకరణ కోసం ఓ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ‘మెయిన్‌హార్ట్’ అనే సంస్థ పాల్గొన్నది. ఈ సమావేశ అనంతరం మూసీ నది సుందరీకరణ కోసం మెయిన్‌హార్ట్ సంస్థ ముందుకు వచ్చిందని ముఖ్యమంత్రి కార్యాలయం మీడియాకు ప్రకటించింది. అయితే, రాష్ట్ర ప్రజానీకం గమనించవలసిన ముఖ్య విషయం ఏమంటే… 2024, జనవరి 22 నాడే మెయిన్‌హార్ట్ సంస్థతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుబాయ్‌లో పర్యటించారు. ఒక ప్రైవేట్ కంపెనీకి ఎలాంటి కాంట్రాక్టులు దక్కకముందే, ఎలాంటి సమావేశాలు జరగకముందే రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డి ఆ ప్రైవేట్ కంపెనీ యజమానితో కలిసి విదేశీ పర్యటన చేయడం ఆశ్చర్యకరం.
మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ కోసం, కన్సల్టెంట్ సర్వీసుల ఎంపిక ప్రక్రియ కోసం నిర్వహించిన టెండర్లపై నాకే కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా ఎన్నో సందేహాలు కలు గుతున్నాయి. ఈ టెండర్ ప్రక్రియను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే, కావాలనే ‘మెయిన్‌హార్ట్’ కంపెనీకి అప్పగించినట్టు అర్థమవుతున్నది.
రాజకీయ నాయకుల జోక్యం కారణంగానే రేవంత్ ప్రభుత్వం టెండర్ నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలకు బలం చేకూరుతున్నది. అందుకోసమే ప్రాజెక్టు వ్యయం రూ.50,000 కోట్ల నుంచి ఏకంగా రూ.1.50 లక్షల కోట్లకు పెరిగిందనే చర్చ రాష్ట్రంలో జరుగుతున్నది. అంతేకాదు, ముఖ్యమంత్రి రేవంత్ కూడా పదే పదే ‘మెయిన్ హార్ట్’ సంస్థ తరఫున ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ ఈ కంపెనీని తానే ఎంపిక చేసినట్టు చెప్పడం కూడా టెండర్ నిబంధనలను ఉల్లంఘించడమే.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమ ప్రభుత్వం మూసీ నదిని సుందరీకరణ చేయబోతున్నదని ప్రకటించారు. ఆ తర్వాతనే ఎంఆర్డీసీఎల్ అధికారులు మూసీ ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ కోసం కంపెనీల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. ఈ మేరకు ప్రభుత్వం ఆసక్తి గల కంపెనీల నుంచి ఫిబ్రవరి 5న టెండర్లను ఆహ్వానించింది. ఇందులో 10 కంపెనీలు బిడ్లు దాఖలు చేయగా, వాటితో ప్రీ బిడ్ మీటింగ్ నిర్వహించారు. తర్వాత టెండర్ల విషయంలో ఏడు కంపెనీలకు మాత్రమే టెక్నికల్‌గా అర్హత ఉన్నట్టు ప్రకటించారు.
ఆ తర్వాత ఏప్రిల్ 10న రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)ల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి, జూన్ 24ను ఆఖరి తేదీగా నిర్ణయించింది. అయితే, అర్హులైన ఏడు కంపెనీల్లో ఐదు కంపెనీలు మాత్రమే స్పందించి ఆర్ఎఫ్పీలను సమర్పించాయి. వాటిలో ఎస్ఏఐ కన్సల్టెన్సీ కంపెనీ అతి తక్కువకు బిడ్డింగ్ చేసింది. అయినప్పటికీ ఆరు నెలల తర్వాత సాంకేతిక కారణాలను ఉటంకిస్తూ, ఇతర వివరణలేవీ ఇవ్వకుండానే ఆర్ఎఫ్పీలను ఎంఆర్డీసీఎల్ రద్దుచేసింది.
ఎంఆర్డీసీఎల్ రద్దుచేసిన ఈ తీరు పలు అనుమానాలకు తావిస్తున్నది. ఈ టెండర్లో సాయి కన్సల్టెన్సీ రూ.60 కోట్లకు అతితక్కువగా బిడ్ చేసిన కంపెనీ. ఆ తర్వాత వారం రోజులకు ముందే ప్రభుత్వం మరోసారి ఆర్ఎఫ్పీలను ఆహ్వానించింది. కానీ, ఆ సమయానికి కేవలం ఎల్ఈఏ అసోసియేట్స్, మెయిన్‌హార్ట్ కంపెనీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో ఎల్ఈఏ కంపెనీ రూ.141 కోట్లకు బిడ్ దాఖలు చేయగా, మెయిన్‌హార్ట్ కంపెనీ రూ.143 కోట్లకు బిడ్ దాఖలు చేసింది.
ఈ లెక్క ప్రకారం మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ఎల్ఈఏ కంపెనీకే ఎంఆర్డీసీఎల్ అధికారులు అప్పగించాల్సి ఉన్నది. కానీ, వారం రోజుల తర్వాత సాంకేతిక కారణాలను చూపుతూ ఎల్ఈఏ కంపెనీని తిరస్కరించినట్టు మెయిన్‌హార్ట్ మాత్రమే పోటీలో మిగిలిందని ప్రభుత్వం చెప్పింది.
ఆ తర్వాత రూ.141 కోట్ల బిడ్‌తో ‘మెయిన్‌హార్ట్’ను ఎల్-1గా ప్రకటించారు. ఈ మూడు అంశాల నేపథ్యంలోనే మూసీ సుందరీకరణ ప్రాజెక్టు-మెయిన్‌హార్ట్ సంస్థ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమయ్యాయి. అందుకే, రూ.1.50 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టు డీపీఆర్‌ను అందించగలిగే అనేక సంస్థలను ఆకర్షించడంలో ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అయింది? ఈ టెండర్లలో అధిక సంఖ్యలో కంపెనీలు పాల్గొనేలా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? వంటి అనుమానాలు ప్రజల్లో సహజంగానే తలెత్తుతున్నాయి, తలెత్తాయి కూడా. అందుకే, ఇంత పెద్ద ప్రాజెక్టు ప్రాపర్టీ మేనేజ్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వచ్చాయి.
అయితే, పలు సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులు తొలగించి, క్షమాపణలు చెప్పాలని ‘మెయిన్‌హార్ట్’ సంస్థ నాకు లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. సదరు సంస్థ పంపిన లీగల్ నోటీసుల్లోనే తనపై ఉన్న ఆరోపణలను ఒప్పుకున్నది. అయితే ఈ సందర్భంగా మెయిన్‌హార్ట్ కంపెనీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకోవాల్సిన అవసరం ఉన్నది. పాకిస్థాన్‌లో జరిగిన రెండు భారీ కుంభకోణాలకు, మెయిన్‌హార్ట్ కంపెనీకి సంబంధాలున్నాయి. రావీ రివర్ ఫ్రంట్ కాంట్రాక్టులో లాహోర్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్లు మెయిన్‌హార్ట్ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం వాటిలో ఒకటి కాగా, ఇండ్ల నిర్మాణానికి సంబంధించి జరిగిన రూ.3,000 కోట్ల కుంభకోణంలో ఈ కంపెనీకి ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయడం రెండ వది.
కంపెనీ యజమానులు పరారీలో ఉన్న ట్లు ఆ నోటీసులో పేర్కొనడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా కోర్టు పత్రాల రూపంలో ఉన్నాయి. అంతేకాకుండా, పాట్నా విమానాశ్రయంలో మెయిన్ హార్ట్ కంపెనీ అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా సదరు కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టింది. వీటికి సంబంధించి ఆర్టీఐ ద్వారా బయటికి వచ్చిన సమాచారం, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్లు కోర్టుకు సమర్పించిన పత్రాలు కూడా ఉన్నాయి. ఝార్ఖండ్‌లో కాంగ్రెస్, జేఎంఎం పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం ఉన్నది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ఇండియా కూటమిలో భాగస్వామి. అయినప్పటికీ హేమంత్ సోరేన్ కూడా మెయిన్హార్ట్పై సీబీఐ విచారణ కోరారు. అంతేకాదు, ఝార్ఖండ్‌లో కూడా మెయిన్‌హార్ట్ సంస్థ బ్లాక్‌లిస్ట్‌లో ఉండటం గమనించాల్సిన విషయం.
ఒక బాధ్యత గల తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్లో నేను సోషల్ మీడియా కన్వీనర్‌గా కొనసాగుతున్నాను. మా పార్టీ తరఫున టీవీ చర్చల్లోనూ పాల్గొంటాను. అంతేకాదు, ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధన విద్యార్థిగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాలను విశ్లేషించి ప్రశ్నించే హక్కును ప్రజాస్వామ్యం నాకు కల్పించింది.
మూసీ నది సుందరీకరణ కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చవుతాయని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. ఆయన రాజకీయ బృందాలను వెంటపెట్టుకొని తెలంగాణ ప్రజల సొమ్ముతో దుబాయ్, లండన్, సియోల్ లాంటి నగరాల్లో కూడా పర్యటిస్తున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే ఎలాంటి డీపీఆర్, డిజైన్ లేకుండానే పేద ప్రజల ఇండ్లను కూల్చివేస్తున్నది. ఒక రాష్ట్ర పౌరునిగా ఇందుకు సంబంధించిన ఏ అంశంలోనైనా ప్రభుత్వాన్ని, ప్రాజెక్టును చేపట్టిన మెయిన్‌హార్ట్ సంస్థను ప్రశ్నించే హక్కు నాకున్నది.
అది నా బాధ్యత కూడా. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అనేది రాష్ర్టానికి సంబంధించిన అంశం. అలాంటి కాంట్రాక్టును ఇప్పటికే రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘మెయిన్‌హార్ట్’ సంస్థ దక్కించుకోవడం నన్ను విస్మయానికి గురిచేసింది. అందుకే సదరు కంపెనీకి సంబంధించిన గత చరిత్రను ప్రజలకు చెప్పదలచుకున్నాను. అందులో భాగంగానే ఈ తతంగాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాను. అందుకే, రాష్ట్ర ప్రభుత్వం కేసులని, లీగల్ నోటీసులని నన్ను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణ ఉద్యమంలోనే ఎన్నో కేసులను ఎదుర్కొన్న నన్ను ఇలాంటి కేసులు ఎలాంటి భయానికి గురిచేయవు. అలాచేయడం కూడా ఈ ప్రభుత్వానికి సరికాదు. ఇది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే. తెలంగాణ ప్రజల తరఫున, మూసీ నది పరీవాహక ప్రాంతంలో నివసించే స్థానికుల పక్షాన ఎంతటి న్యాయ పోరాటానికైనా నేను సిద్ధం.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్)
– క్రిశాంక్ మన్నె