కొన్ని ఉదయాలు గాయాలతో మేల్కొంటాయి…
నిరాశల నయనాలను ఎంత నులుముకున్నా
గమ్యం ఎంతో అస్పష్టం
చీకటి తిరగలి కింద
పిండిగా రాలిన ఊహలు
మళ్ళీ మారాకు తొడుగుతాయా..!
ఏకాంత మైదానంలో
ఎవరికి వారే.. అరేబియన్ గుర్రంలా
వెలుగు తీరం వైపు దౌడు తీశాక
బలమైన గుట్టల కింద
నలిగి విరిగిన కలల శకలాలు..!
రెక్కలు విప్పాల్సినదేదో
లోపలే ఉండిపోయింది
ఋతువులు మారుతున్నా
ఆ జరగాల్సిన క్రతువేదో
అలా సుషుప్తిలో దోగాడుతుంది..!
అంకురమై రెండాకులు తొడిగి
పచ్చని వాగ్దానాన్ని భరోసాగా నవ్వాల్సి ఉంది…
ఒక ధిక్కార స్వరమేదో
ఇంకా లోలోపలే కూనిరాగాలు పోతుంది
పిడికిలై.. నినాదమై గోడనెక్కాల్సిన గొంతుక
గరగరల్లో పూడికై నిండి ఉంది..!
– గరికపాటి మణీందర్
99483 26270