తొమ్మిదేండ్ల తెలంగాణ బాల
పదవ జన్మదినంలోకి అడుగిడుతున్న వేళ
అభివృద్ధిలో అందనంత ఎత్తులో ఇలా
పెరుగుతున్న తరుణ వయస్సు హేల
పెద్దలతో చిన్నలతో కలిసి
ముందుచూపుతో జాగ్రత్తగా నడుస్తూ
అందరూ తనవైపే చూస్తున్న
చిన్నారి తెలంగాణ ఎన్నో గొప్ప గుణాల మాల
కాళేశ్వరంలో ముడిచిన కురులను
జడపాయలుగా అల్లుకుంటున్నది
తడిసిన పొలాలపై పచ్చల హారం వేసుకున్నది
నిండిన చెరువుల్లో చేప పిల్లలతో
గుట్టలు, గట్ల మీద పెరిగిన వనాలలో
గొర్రె మేక పిల్లలతో ఆడుకుంటున్నది
రైతన్నలకు దళితన్నలకు బంధువై
నేతన్నలకు స్నేహ బంధంగా
అందరికీ తలలో నాలుకలా
అన్నింటా ముందుంటున్నది
వయసు పైబడ్డ పెద్దలకు
ప్రతి నెలా వేతనంతో ఊత కర్రవుతున్నది
తోడు నీడ ఆధారం లేని అవ్వలకు
ఆసరా అవుతున్నది
అపుడే పుట్టిన తమ్ముళ్లు, చెల్లెండ్లను
అమ్మలా ఆదుకుంటున్నది
పెండ్లవుతున్న అక్కలకు కల్యాణలక్ష్మవుతున్నది
పల్లె పల్లెనా నేనున్నానని అందాలు చిందేస్తున్నది
మేడల మీద నుంచి మెట్రో కిటికీల్లోంచి
ఉల్లాసంగా చేతులూపుతున్నది
ఆకాశమంత ఎత్తున్న బోధ గురువు
అంబేద్కర్‌కు చేతులు జోడిస్తున్నది
చీకటిని తరిమేసి పొద్దు పొడిచినట్టు
తన ముఖాన ఎప్పుడూ విద్యుద్దీప వెలుగు
తన నోట విద్వన్మయమైన మధురమైన పలుకు
ఎప్పుడూ ప్రశాంతంగా ప్రసన్నంగా
ఎందరినో ఆకర్షిస్తున్నది
విదేశీ కంపెనీలు వ్యాపారవేత్తలు
చేతులు కలుపుతున్నారు
బోనాలు బతుకమ్మ పండుగల్లో
పెద్ద ముత్తైదువలా పేరంటాలు చేస్తున్నది
ప్రపంచంలోని తెలుగువాళ్లందరినీ
మహాసభలు పెట్టి పిలిచి పండుగ చేసింది
దేశం దేశమంతా చూస్తున్నది
దశ మార్చిన తీరుకు నివ్వెర పోతున్నది
తొమ్మిదేండ్ల బాల తెలంగాణ
ఎన్నో నేర్చిన జాణ
పదవ జన్మదినం వేడుక శుభ దినం
ఎదనిండా ఆశీర్వదించాలి అఖిల జనం