ప్రపంచంలో రకరకాల మనుషులుంటారన్నది అందరికీ అనుభవమే! అయితే, మామూలు వాళ్లను వదిలేస్తే, రెండురకాల మనుషుల గురించి అందరూ మాట్లాడుకుంటారు. చాలా సంస్కారవంతులు, పూర్తిగా సంస్కారహీనులు. వీరిద్దరు కూడా పక్కవారిని ఎప్పటికప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉంటారు. మొదటిరకం మనుషులు తమ స్నేహశీలత్వంతో, తమ ఆహ్లాదకరమైన మాటలతో, ఇతరుల పట్ల ఉన్న ఆదరం, గౌరవం తమ ప్రవర్తనలో ప్రకటిస్తూ అందరికీ ఇష్టులవుతారు. ఇంక రెండోరకం మనుష్యులు తమ కరకు మాటలతో శత్రువుల్లాగా ప్రవర్తిస్తూ సామాన్యుడు కూడా అసహ్యించుకునే పరిస్థితి తెచ్చుకుంటారు.
నిజానికి సామాన్యుల కంటే నాయకులనే వారికి ఉత్తమ వ్యక్తిత్వం ఉండాలి. అప్పుడే వారు ప్రజలను సరైన రీతిలో నడపగలుగుతారు. మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని సంపాదించిన వారు (అది ఎట్లా సంపాదించారో అందరికీ తెలియకపోవచ్చు) ఎలా ఉండాలి? ఎంత సంస్కారవంతమైన వ్యక్తిత్వం, శుద్ధమైన వాక్కు ఉండాలి? పక్కవారిని గౌరవించే అలవాటు లేకపోయినా, తను సంపాదించిన స్థాయినైనా గౌరవించాలి కదా! మరి అలా లేకపోతే ఆయనను ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? ఆ పదవికి కూడా కళంకం ఆపాదిస్తున్న ఆ ముఖ్యమంత్రిని ఇంకా భరించాలా? ఈ విషయం సామాన్య ప్రజలే కాక, ఆయన సహచరులు, వారికి ఈ పదవిని కట్టబెట్టిన పార్టీ పెద్దలు నిశితంగా ఆలోచించవలసిన సమయం వచ్చింది.
ఒక భాష అనేది దానిలోని సామెతలు, జాతీయాలను బట్టి గొప్పదని తెలుస్తుంది. మరి మన తెలుగులో ఈ పరిస్థితిని వర్ణించగలిగిన సామెతలున్నాయా చూద్దాం!
‘కనకపు సింహాసనమున
శునకము గూర్చుండ బెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణ మేల మాను వినరా సుమతీ!’
దీని అర్థం ఇది. ఒక శుభ
ముహూర్తాన కుక్కనొక దానిని తెచ్చి బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి, శాస్ర్తోక్తంగా దానికి పట్టాభిషేకం చేసినా, దాని గుణాలు, ప్రవర్తన మారుతాయా? అలాగే ఒక నీచుడిని అందరూ గౌరవంగా చూసినా వాడు నీచ గుణాన్ని వదులుకుంటాడా? వదులుకోడు. ఎప్పటికీ
అలాగే ఉంటాడు. ఇంకొక పద్యం
కూడా బాగుటుంది.
“ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా
నలుపు నలుపే కానీ తెలుపు కాదు,
కొయ్యబొమ్మదెచ్చి కొట్టినా బలుకునా?
విశ్వదాభిరామ వినురవేమ!”
దీని అర్థం చెప్పక్కరలేదు కదా! చాలా తేలిక పద్యం ఇది. ఇంకొకటి ఇప్పటి మనస్తత్వానికి సరిగ్గా సరిపోతుంది.
‘తివిరి యిసుమున తైలంబు తీయవచ్చు,
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు!
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు’
– భర్తృహరి.
చాలా ప్రయత్నం చేస్తే ఒక్కటి తప్ప కష్టమైనవేమైనా సాధించవచ్చు. ఇసుక నుంచి నూనె తియ్యొచ్చు, ఎండమావులలోని నీరు త్రాగవచ్చు; సృష్టిలో కుందేటికి కొమ్ములు లేకపోయినా, ఏ భగవంతుడికో తపస్సు చేసి అది కూడా సంపాదించవచ్చు. మస్తిష్కం నిండా మూర్ఖత్వం మాత్రమే ఉన్నవాడిని ఎన్నటికీ ఒక్క అణు లేశం కూడా ఎవరూ మార్చలేరు, వాడు మారలేడు, మారడు. ఇది పై పద్యం అర్థం.
ఇప్పుడు నిజ జీవితంలో మన రాష్ట్రంలో చూస్తున్న దృశ్యం వల్ల ఈ మహానుభావుల పద్యాలన్నీ గుర్తొస్తున్నాయి. ఎంత నిజాలు దాగున్నాయి ఈ పద్యాలలో! కేసీఆర్ 2024 డిసెంబర్లో ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రైన వ్యక్తికి సమయమిచ్చి చూడాలని ఒక ఏడాది పాటు మౌనం పాటిస్తే, ఆ ఏడాది ప్రజలంతా ఒక్కొక్క నెలలో కొన్ని కొత్త తిట్లు, శాపనార్థాలు నేర్చుకోగలిగారు. మరి తెలుగులో ఇన్ని వాడేసిన వారికి ఒక్క సలహా ఇవ్వవచ్చు. భమిడిపాటి కామేశ్వరరావు అనే రచయిత ‘సిమాలమ్మ’ అనే కథలో (కథ పెద్దదే లెండి) తెలుగులో ఉన్న తిట్లన్నీ రాశారు. సిమాలమ్మ అన్న ఒక వృద్ధురాలు పొద్దున్నే బయల్దేరి ఊరంతా చుట్టివస్తూ ఒక్కొక్కళ్లని తిట్టే తిట్లన్ని ఉంటాయి అందులో.
ముఖ్యమంత్రి కార్యాలయం వారు తమ నాయకుడికి కొత్త పదాలిచ్చి సహాయం చెయ్యాలనుకుంటే, బహుశా రాజమండ్రిలో గానీ, విజయవాడలో గానీ ఆ పుస్తకం దొరకవచ్చు. అది తెప్పిస్తే మిగతా నాలుగేండ్లు కూడా పాలన జోలికి పోకుండా మన ముఖ్యమంత్రికి కాలక్షేపమవుతుంది.
ప్రజలందరూ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. సృష్టికర్త జంతువులన్నింటికీ ఒక్కొక్క రకమైన ఆయుధాన్ని వాటి శరీరం మీదే అమర్చా డు. కానీ, మనిషికి ఆయన ఇచ్చిన వరం భాష. దానిని దుర్వినియోగం చేసినా, అనుచితంగా ఉపయోగించినా అది వాడిన వారి మీదికే ఆయుధమై తిరగబడుతుంది. శిశుపాలుడి వంద తిట్లు కృష్ణుడి చక్రంలో వెయ్యి ములుకులై శిశుపాలుడిని అం తం చేశాయి. త్రికరణ శుద్ధి-మనిషికి ఉండాల్సిన లక్షణం. దీనిలో మంచి ఆలోచన, ఆహ్లాదకరమైన భాష, ఆచరణాత్మక లక్షణం ఉండాలి.
– కనకదుర్గ దంటు