పార్లమెంట్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూస్తుంటే దేశంలో ఇప్పుడు మతమే సిద్ధాంతంగా మిగిలిపోయిందనిపిస్తున్నది. ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు వస్తున్న సమయంలో జీ బిజినెస్ చానల్లో చర్చ జరుగుతున్నది. బీజేపీకి 320 సీట్లు వస్తాయని విశ్లేషకుడొకరు చెప్పారు. ‘ఈ ఎన్నికల్లో అభివృద్ధి అంశాన్ని మోదీ అస్సలు ప్రస్తావించలేదని ఓ వైపు చెప్తూనే మరోవైపు 320 సీట్లు వస్తాయని ఎలా చెప్తున్నారు? మీ వాదన పరస్పర విరుద్ధంగా ఉంది’ అని ప్రశ్నించగా.. అదేం కాదు, ఈ దేశంలో 95 శాతం వరకు ఎన్నికలు మతం, కులం ఆధారంగానే జరుగుతాయని ఆయన సమాధానం ఇచ్చారు.
Lok Sabha Elections | బీజేపీ ఒక్కటే మత రాజకీయాలు చేస్తున్నదని చెప్పలేం. హిందుత్వ పేరిట బీజేపీ బహిరంగంగానే మత రాజకీయాలు చేస్తే.. హిందుత్వకు వ్యతిరేకంగా మైనారిటీ మత రాజకీయాలను కాంగ్రెస్ నమ్ముకున్నది. ఒకవైపు మైనారిటీ మతాలను, మరోవైపు కుల రాజకీయాలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తున్నది. అయితే బీజేపీ హిందుత్వ రాజకీయాల ముందు కాంగ్రెస్ మైనారిటీ మత, కుల రాజకీయాలు నిలువలేకపోయాయని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. అసలైన ఫలితాలు ఈ రోజు వస్తాయి. సీట్ల విషయంలో కొద్దిగా తేడా ఉండవచ్చు కానీ తుది ఫలితాలకు, ఎగ్జిట్ పోల్ ఫలితాలకు మధ్య పెద్దగా తేడా ఉండకపోవచ్చు! అన్ని సర్వేలు కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 350కు పైగా సీట్లు వస్తాయని.. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు 100 స్థానాలకు పైగా వస్తాయని సర్వేలు చెప్తున్నాయి.
సర్వేలు తలకిందులై బీజేపీ సీట్లు కాంగ్రెస్‌కు, కాంగ్రెస్ సీట్లు బీజేపీకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇందిరాగాంధీ హయాంలో గరీబీ హటావో అనే నినాదం దేశాన్ని కదిలించింది. ఇప్పుడు అంత పేదరికం లేదు. 80 కోట్ల మంది పేదలకు మోదీ ప్రభుత్వం సబ్సిడీ బియ్యం ఇస్తున్నది. అంటే రికార్డుల ప్రకారం.. 80 కోట్ల మంది నిరుపేదలున్నట్టే. ఇందిరాగాంధీ హయాంలో కన్నా ఎక్కువ మంది పేదలున్నట్టే లెక్క. అయితే ఇది లెక్కల్లో మాత్రమే కనిపించే పేదరికం. నిజంగా అంత పేదరికం ఉంటే ఎన్నికల్లో మతం, కులం కన్నా గరీబీ హటావో నినాదం ఎక్కువ పనిచేసేది. దేశం ఆకలి స్థాయి దాటి పోయింది. ఇప్పుడు మతమే ప్రధాన ఆకలి.
హిందువులను, ముస్లిం మైనారిటీలను రాజకీయ పక్షాలు పంచుకున్నాయి. కులంపై తిరుగులేని ఆయుధం మతం అని 90వ దశకంలోనే బీజేపీ గ్రహించింది. వీపీ సింగ్ (జనతా దళ్) కులం ఆయుధంగా మండల్ కమిషన్‌ను తెరపైకి తీసుకువస్తే.. రథయాత్ర పేరిట అద్వానీ మత రాజకీయాలకు తెరలేపారు. బీజేపీ వ్యూహం ఫలించింది. గుజరాత్లో మత కలహాలు మోదీని జాతీయ నాయకునిగా మార్చాయి.
ఇస్లామిక్ టెర్రరిజం, దేశంలో అనేక చోట్ల ఉగ్రవాదుల దాడులు సైతం బీజేపీ ఎదుగుదలకు దోహదం చేశాయి. దాదాపు పాతికేండ్ల పాటు సంకీర్ణ రాజకీయాలను మన దేశం చూసింది. ఈ తరుణంలో మోదీ నాయకత్వంలో ఏక పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడ మే ఆశ్చర్యమనుకుంటే.. వరుసగా మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయంటే మత రాజకీయాలు ఎంత బలంగా ఉన్నా యో అర్థం చేసుకోవచ్చు. అటు హిందూ మత రాజకీయాలు, ఇటు ముస్లిం మైనారిటీ మత రాజకీయాల పేరిట రెండు జాతీయపార్టీలు ప్రజలను చీల్చుకోవడం ఇతర పార్టీలను ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టేశాయి. ఒకప్పుడు దేశంలో రాజకీయ పార్టీలకు ఆర్థిక సిద్ధాంతాలే ప్రధానాంశాలుగా ఉండేవి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో కాంగ్రెస్ ఒక్కటే ఉన్నా.. కాంగ్రెస్‌లోనూ అంతర్గతంగా సిద్ధాంతపరంగా తీవ్రమైన చర్చ, ఘర్షణ ఉండేది. సోవియెట్ రష్యా విచ్ఛిన్నం, 1991లో ఆర్థిక సంస్కరణలతో దేశంలో అప్పటివరకు ఉన్న సిద్ధాంతాలకు కాలం చెల్లినట్టయింది.
మూడు దశాబ్దాల పాటు బెంగాల్‌ను పాలించిన వామపక్షాలకు ఆ రాష్ట్ర శాసనసభలో ఒక్క సీటు కూడా లేని పరిస్థితి. ఉత్తరప్రదేశ్‌లో దళిత, బ్రాహ్మణ ఐక్యతతో బీఎస్పీ అధికారంలోకి వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ ఇంజినీరింగ్ అని విస్తృతంగా చర్చ జరిగింది. కానీ, ప్రస్తుతం యూపీలో బీఎస్పీకి ఒక్క సీటు కూడా దక్కని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దేశంలో మతమే ఏకైక సిద్ధాంతం. ప్రత్యర్థులు సైతం మెచ్చుకొనే వాజపేయి 2004 ఎన్నికల్లో అభివృద్ధి నినాదంతో ఇండియా షైనింగ్ అని ఎన్నికలకు పోయి ఓడిపోయారు.
అభివృద్ధి మాటెత్తకుండా మతాన్ని నమ్ముకొని మోదీ వరుసగా మూడోసారి గెలిచేందుకు బాటలు వేసుకున్నారు. సీట్ల సంఖ్య ఎలా ఉన్నా దేశంలో యువ త ఆలోచనలపై వామపక్షాల ప్రభావం ఉండేది. ఒక ఎమ్మెల్యే సీటు, ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తే చాలు నయీంలను కూడా భుజాన మోయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్న వామపక్షాలు కాలగర్భంలో కలిసిపోయాయి. మత రాజకీయాలకు విరుగుడు మత రాజకీయాలు కావు. దీనివల్ల మత రాజకీయాలు మరింతగా బలపడతాయి. దేశం పేదరికంలో ఉన్నప్పుడు పేదరిక నిర్మూలనే ప్రధానాంశంగా నిలుస్తుంది. ఇప్పు డు మన దేశం ఆకలికి అలమటించే పేద దేశం కాదు, అందుకే మతం ప్రాధాన్యం వహిస్తున్నది. కాలమే పరిస్థితులను మారుస్తుంది.
– బుద్దా మురళి