పూలని చిరునామా అడగొద్దు
పరిమళం దారి చూపుతది!
గాలిని నువ్వెక్కడని ప్రశ్నించకు
శ్వాస నిజం చెబుతుంది!
వాన జాడల్ని ఆకాశంలో వెతకొద్దు
మైదానాలు సాక్ష్యం చెబుతాయి!
చెరువుల ఒంటరి తనాన్ని నిలదీయకు
లోన మెరిసే చేపలూరుకోవు!
నదుల గొప్పతనం ఏంటనకు
పంట పొలాలు వెంటాడుతాయి!
ఓటుకు వెల కట్టకు, కలలు కల్లలైతాయి!
తాయిలాలు అన్ని సార్లు పట్టం కట్టవు
గర్వ భంగానికి సిద్ధంగుండు!
ఓడిపోయాక గెలుపోటములు సహజమనకు
కాలిన కర్రు ఊరుకోదు!
రాజీనామాకు కుంటి సాకులు చెప్పొద్దు
బ్యాలెట్ బాక్స్ బద్ధలైతది!
మును ‘గోడు’
పట్టని వారికి మూడో తేది
లిట్మస్ టెస్టు చేసి తీర్తది!
కోట్ల వెంకటేశ్వర రెడ్డి: 94402 33261