ఏప్రిల్ 20వ తేదీ ఆదివాసీ పోరాట చరిత్రలో మరువలేని జ్ఞాపకం. దేశ స్వాతంత్య్రానికి ముందు నైజాం పాలనలో జోడే ఘాట్ కేంద్రంగా సాగిన కుమ్రం భీం భూపోరాటానికి కొనసాగింపుగా జరిగిన ఇంద్రవెల్లి గోండు రైతుల ఉద్యమానికి 44 ఏండ్లు నిండాయి. ఈ సందర్భంగా గోండు రైతులకు జోహార్లు అర్పిస్తూ వారి పోరాటాన్ని మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
1970వ దశకం చివరలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఆదివాసీలు భూమి పట్టాలు, శిస్తు వసూలు తదితర సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరికి గిరిజన రైతుకూలీ సంఘం ఒక దిక్సూచిగా మారింది. అప్పటికే పోరాటాలు చేస్తున్న ఆ సంఘంలో గోండు, కోలాం, కోయ తెగల రైతులు చేరారు. పోడు పట్టాలు, షావుకారుల వడ్డీ వ్యాపారంలో మోసాలు తదితర అంశాలపై 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో గిరిజన రైతుకూలీ సంఘం మహాసభలను నిర్వహించి, భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని భావించారు.
సభకు మొదట అనుమతి ఇచ్చి, ఆ తర్వాత సభ జరిగే రోజు అనుమతిని రద్దు చేశారు. 144 సెక్షన్ విధించారు. అనుమతి రద్దయిన విషయం తెలియక జిల్లావ్యాప్తంగా ఉన్న ఆదివాసీలు పెద్ద సంఖ్యలో ఇంద్రవెల్లికి చేరుకున్నారు. అక్కడ మాటు వేసిన పోలీసులు విచక్షణారహితంగా వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 17 మంది మరణించారు. వందల మందిని అరెస్టు చేశారు. జలియన్ వాలాబాగ్ హత్యాకాండను పోలిన ఈ దుర్ఘటన చరిత్రలో నిలిచిపోయింది. ఈ చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో ఇంద్రవెల్లి పోరాట గాథను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని ఆదివాసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తున్నది.
నేటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. గూడాలలో విద్య, వైద్యం, తాగునీటి సరఫరా లేదు. ఆసిఫాబాద్ జిల్లాలో 46 గ్రామాలకు, మంచిర్యాల జిల్లాలో 25 గ్రామాలకు, నిర్మల్ జిల్లాలో 12 గ్రామాలకు, ఆదిలాబాద్ జిల్లాలో 56 గ్రామాలకు కనీస రోడ్డు సౌకర్యం లేదు. ఈ జిల్లాల్లో విద్య, వైద్య సదుపాయాలు అంతంతమాత్రమే.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు ఉండరు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేరు. ఇటీవల కాలంలో ఆశ్రమ పాఠశాల్లో మౌలిక సదుపాయాలు కరువై విద్యార్థులు చనిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 10 మంది విద్యార్థులు చనిపోయారు. ఐటీడీఏలు భూస్వాములు, ఆదివాసేతరుల సేవలో మునిగి తేలుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో ఉన్న నాన్ ఏజెన్సీ గ్రామాలను ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించడం లేదు. కేంద్ర, రాష్ట్ర పాలకులు ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టుబడిదారులతో కలిసిపోయారు. ఏజెన్సీలోని సహజ వనరులను దోచుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన దండోరా పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆదివాసీలకు అనేక హామీలిచ్చింది. కానీ, వాటిలో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. నాడు ఇంద్రవెల్లిలో జరిగిన హత్యాకాండ నేడూ వివిధ రూపాల్లో కొనసాగుతున్నది. పాలకుల విధానాలతో ఆదివాసీలు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇలాంటి సందర్భంలో ప్రజలు ఇంద్రవెల్లి రైతాంగ ఉద్యమాన్ని గుర్తుచేసుకోవడం ఎంతో అవసరం.
– సిడం జంగుదేవ్, రాష్ట్ర అధ్యక్షులు, ఆదివాసీ విద్యార్థి సంఘం