‘మా ఒంటిపై పడే ఒక్కో దెబ్బకు కాంగ్రెస్ లక్ష ఓట్ల మూల్యం చెల్లించుకోక తప్పదు’ అంటూ ఉగాది పండుగ రోజు రేవంత్ సర్కార్ వడ్డించిన అరాచకాన్ని చొక్కాలు విప్పి చూపెడుతూనే హెచ్‌సీయూ విద్యార్థి ఒకరు సూటిగా హెచ్చరించిన ఉదంతం బహుశా అందరి మదిలో మెదలుతూనే ఉండి ఉంటుంది. ఆ లెక్కన కాంగ్రెస్ సర్కార్ వెన్నుపోటుకు తల్లడిల్లుతున్న నవతరం కన్నెర్రను మొత్తం లెక్కిస్తే హస్తం పార్టీ ఎంత విశ్వాసాన్ని పారేసుకున్నదో అంచనాకు కూడా రాలేం. సరిగ్గా ఏడాదిన్నర ముందు అదే క్యాంపస్ గేటు ముందు రాహుల్‌గాంధీ, అక్కడి నుంచి గంటన్నరలో చేరుకొనే సరూర్‌నగర్ స్టేడియంలో ఆయన సోదరీమణి ప్రియాంక గాంధీ రాష్ట్ర యువ లోకానికి చేసిన బాసలన్నీ నీటి బుడగల్లా పేలిపోతుంటే యావత్తు నవతరం తల్లడిల్లిపోతున్నారు.
హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూము ల్లో నేలరాలింది చెట్లు, నెమళ్ళు, జింకలు మాత్రమే కాదు, తెలంగాణ యువతరం ఆశలు, ఆకాంక్షలు కూడా. యూపీలో అమలవుతున్న బుల్డోజర్ భీభత్సం ఇంత త్వరగా తెలంగాణ అనుభవంలోకి కాంగ్రెస్ సర్కార్ తీసుకువస్తుందని ఎవరైనా కలలో కూడా ఊహించరు కదా?. అందులోనూ వర్శిటీల పైకి బుల్డోజర్ల కవాతును తిలకించే పరిస్థితి వస్తుందని ఏ ఆలోచనపరులు మాత్రం అంచనా వేయగలరు?. అయితే ఇందిరా కాంగ్రెస్ హిస్టరీ చదివిన వారికి ఈ ఉత్పాతాలు, హస్తం సర్కార్ల వికృత విన్యాసాలు స్పష్టంగానే తెలుసు.
అందుకే అనేక సాంప్రదాయిక కాంగ్రెస్ ఓటు బ్యాంకు వర్గాలు బ్యాలెట్ పేపర్ ఓటింగ్ నాటికే హస్తం గుర్తుపై వేలేయడం మానుకున్నాయి. కానీ, సమస్యంతా అనుభవంలో చూడక, చరిత్రనూ చదవక, వాట్సాప్ వలలో, యూట్యూబ్ గోలలో గందరగోళం ఏరుకునే కొంతమంది కొత్త తరంతోనే వచ్చిపడింది. దానివల్లనే ఈవీఎంల ముందు యువత విచక్షణను వదిలేస్తున్నారు. ఫలితంగా రేవంత్ రెడ్డి సర్కార్ లాంటి దివాళాకోరు ప్రభుత్వాలు ప్రజల తలపైకెక్కగలుగుతున్నాయి.
ఎంత విచిత్రమంటే సునీల్ కనుగోలు కనికట్టో, ప్రశాంత్ కిషోర్ కిటుకుల పెట్టో ప్రభావశీలురైన నవలోకాన్ని వలలో బంధించగలుగుతుండటం ఆవేదన కలిగించే పరిణామం కాదా?. అయితే అబద్ధాలకు ఆయుష్షు తక్కువన్నట్లు, రేవంత్ సర్కార్ డైలాగ్‌ల సంగతి కూడా డామిట్ కథ అడ్డం తిరిగిన చందంగా మారింది.
కుక్క తోలు కప్పుకున్నా, నక్క తన నైజాన్ని ఎలా దాచిపెట్టుకోలేదో, మేక వన్నె పులి డీఎన్ఏ కలిగిన కాంగ్రెస్ కూడా నమ్మిన వర్గాలను బలితీసుకోకుండా ఆగలేదు. ఆ కోవలోనే కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి బోధి వృక్షాల్లా పెంచి, ఇంటింటికీ కల్పవృక్షాలుగా మారాలనే సదుద్దేశంతో ఏర్పాటుచేసిన గురుకుల విద్యావ్యవస్థను ఏడాదిన్నరలోపే బలిపీఠం ఎక్కించారు. విషాహారం, పాముకాట్లు, ఆత్మహత్యలు, అంటువ్యాధుల వలలో విలవిలలాడుతూ రాలిపోతున్న చిన్నారులను చూసి సమాజం గుండె తరుక్కుపోతున్నది.
ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన ఆణిముత్యాల ఆత్మవిశ్వాసాన్ని ఏడాదిన్నరలోనే అంధకారపు అగాథంలోకి హస్తం సర్కార్ నెట్టగలిగింది. దానివల్లనే అడ్మిషన్ల కోసం కార్యాలయాల ముందు తొక్కిసలాట జరిగిన పరిస్థితి నుంచి గురుకులాల్లో సీట్లు అడిగేవారే కరువయ్యారు. అంతేకాదు చిన్న గీతల ముందు పెద్ద గీతనొకదాన్ని గీసి చెరిపేయకుండానే వాటిని కనుమరుగు చేసే కుయుక్తులతో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూళ్లరాగమెత్తుకున్నారు. ఉట్టికెగరలేనోడు ఆకాశాన్ని అందుకుంటానని ప్రగల్భాలు పలికినట్టున్నది రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వైఖరి. పోనీ, ప్రభుత్వ బడులేమైన హస్తం పార్టీ ప్రభుత్వ పెద్దల ఆదరణకు నోచుకుంటున్నాయా అంటే అదీ లేదు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ పథకం ద్వారా అభివృద్ధి చేసిన వంటగదులు, క్లాస్రూంలు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు తప్ప మరే ముందడుగూ లేదు. కేసీఆర్ ప్రభుత్వం పాఠశాలల్లో లక్షల ఖరీదైన డిజిటల్ బోర్డ్లను సైతం ఏర్పాటుచేసి విద్యారంగంలో ఆధునిక సాంకేతిక సదుపాయాలు కల్పించింది. మరి ఏడాదిన్నర ఏలుబడిలో ఇందిరమ్మ సర్కార్ చక్కబెట్టిందేమిటని ఆరా తీస్తే తెల్లమొహమేసుకోవడం తప్ప తేలేదేం లేదు. పాఠశాల విద్యావ్యవస్థలోనే కాదు కళాశాల, వర్శిటీ స్థాయిల్లోనూ అడిగేవాడు లేక, ఆసరాగా నిలిచే సర్కార్ కానరాక అవస్థల వ్యవస్థలుగా దిగజార్చబడ్డాయి. పైగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల నిరసనలపై ఉక్కుపాదం మోపి ఇందిరమ్మ రాజ్యాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుచి చూపెట్టింది.
గత కేసీఆర్ ప్రభుత్వం పునాది నుంచి విద్యారంగంలో మౌలికమైన మార్పులు తెచ్చి, నూతన గురుకులాల నుంచి మెడికల్ కళాశాలల వరకు అవసరమైన విద్యా సదుపాయాలన్నింటినీ 33 జిల్లాలకు అందుబాటులోకి తెచ్చి పేద, మధ్యతరగతి కుటుంబాలకు విద్యా అవకాశాలను అందుబాటులో ఉంచింది. కానీ, నేటి రేవంత్ సర్కార్ మాత్రం చదువుకు చెదలా మారి స్కిల్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కథలతో కాలక్షేపం చేస్తుండటం విద్యావేత్తలందరిలో ఆవేదన కలిగిస్తున్నది.
దీనికితోడు ఉపాధి రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ అవకాశాల చుట్టూ అబద్ధాల మేడ నిర్మిస్తున్నది. గత పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం విభజన సమస్యలు, కరోనా, పెద్దనోట్ల రద్దు లాంటి జఠిలమైన ఇక్కట్లను ఎదుర్కొని లక్షా అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేసింది. ఉపాధి కల్పనను తెలంగాణ వాస్తవ అవసరాలతో ముడిపెట్టి పెద్ద ఎత్తున వ్యవసాయ విస్తరణ అధికారులు, అసిస్టెంట్ ఇంజినీర్లు తదితర ఉద్యోగాలనూ భర్తీచేసి, సమతుల్య శీఘ్ర పురోభివృద్ధికి బాటలేసింది.
ప్రైవేట్ రంగంలో సైతం టీఎస్ఐపాస్ వంటి వినూత్న విధానంతో ఉజ్వలమైన అవకాశాలకు ద్వారాలు తెరిచి, దాదాపు 19 వేలకు పైగా కొత్త పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమై తద్వారా రూ.2 లక్షల 34 వేల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ర్టానికి తరలివచ్చాయి. దీనివల్ల ఒక్క ఐటీలోనే నూతనంగా 5.82 లక్షల కొత్త కొలువులు యువతరానికి దక్కాయి. పారిశ్రామిక, ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ ముంబై, బెంగళూరులను కూడా వెనక్కినెట్టేసి పరుగు అందుకున్నది. జాబ్ గ్యారెంటీ గురూ, ఎంప్లాయ్మెంట్ అపర్చునిటీస్ స్టడీ సెంటర్ లాంటి అనేక సంస్థల అధ్యయనాలు రాష్ట్రం ఐటీ, పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతిని కొనియాడాయి. కానీ, రేవంత్ సర్కార్ ఏలుబడిలో ఈనగాచి నక్కల పాల్జేసినట్టుగా మారిపోయింది.
ఏడాదిన్నర కాలంగా గత కేసీఆర్ ప్రభుత్వమే తొంబై శాతం భర్తీ ప్రక్రియ పూర్తిచేసిన కొలువుల నియామక ఆర్డర్లే పంచుకుంటూ ప్రగల్భాల ఎపిసోడ్‌ను సాగదీస్తున్నారు. పైగా ఇటీవల విడుదల చేసిన గ్రూప్-1 ఫలితాలు కొలువల భర్తీలో జరిగిన కుంభకోణంపై ఆధారాలను సైతం తేటతెల్లం చేస్తున్నాయి. ప్రైవేట్, రియల్ ఎస్టేట్, వ్యవసాయ, సేవల రంగాల గొలుసుకట్టును ఛిద్రం చేసి రాష్ట్ర ఆర్థికచక్రాన్ని ఛిన్నాభిన్నం చేయడంతోపాటు, సర్కార్ ఉద్యోగాలను సైతం హర్రాస్కు పెడుతూ నైపుణ్యాల నవతరాన్ని నిరుద్యోగ రుగ్మతకు బలిచేస్తున్నారు.
ఓడ మల్లయ్యను ఒడ్డెక్కిన తర్వాత బోడ మల్లయ్య అని ఎగతాళి చేసినట్టుగా ఇప్పుడు రేవంత్ సర్కార్ విద్యార్థులను గుంట నక్కలని దూషిస్తూ అవమానిస్తున్నది. నిరుద్యోగుల పోరాటాల వెనుక కోచింగ్ సెంటర్లు, విపక్షాలున్నాయని విమర్శిస్తూ తిరగబడ్డ యువతరంపై కుట్రదారులనే నిందలేస్తున్నది. అడుగడుగునా ఇనుప వలలు పరిచినట్టు గుమిగూడటం అటుంచి కనీసం నోరు విప్పినా, సోషల్ మీడియాలో నిరసించినా కూడా నవతరాన్ని ఎఫ్ఐఆర్లోకి ఎక్కిస్తూ, పోలీస్స్టేషన్ల చుట్టూ, జైళ్లూ, కోర్టుల చుట్టూ తిప్పులాడుతున్నది. యూత్ డిక్లరేషన్ హామీ మాట దేవుడెరుగు నోరు విప్పితేనే వీపులు పగలగొడుతున్నదీ సర్కార్.
బేడీల తెలంగాణలో గోడకేసిన సున్నంలా మారిపోయింది నమ్మి ఓట్లేసిన నవతరం పరిస్థితి. అంతేకాదు, రాష్ట్ర యువతను దారుణంగా వంచిస్తూ, హింసిస్తూనే నాది యంగ్ ఇండియా బ్రాండ్ అని ప్రగల్భాలు పలుకుతూ నవ్విపోతే నాకేటి సిగ్గన్నట్టు రేవంత్‌రెడ్డి సర్కార్ వ్యవహరిస్తున్నది. అందుకే, అవమానపడిన యువ తెలంగాణ మళ్లీ గులాబీ జెండా ఎత్తుకొని కదులుతున్నది. ఈ నేల నొప్పులు నయం చేయడం కోసం పోరు దారిలోనే ఉద్యమం నెల బాలుడు పదునెక్కి యవ్వన యోధుడిగా ఎదిగినట్టుగా ప్రభవిస్తున్న 25 ఏండ్ల బీఆర్ఎస్ పార్టీనే యువతరం భవితవ్యపు నావ అనే సత్యం తేటతెల్లమైపోయింది.
దానివల్లనే నలువైపుల పల్లెల్లోని నవకులం ఏకమై ఓరుగల్లుకు బయలెల్లబోతున్నారు. ఇది పాలేవో.. నీళ్లేవో, విష నాగు ఏదో.. కామధేనువు ఏదో అర్థమైపోయిన సందర్భం. ఈ నెల 27న ఎల్కతుర్తి నుంచి మొదలు నలుదిక్కులా వరంగల్ ఎల్లలు మొత్తం యువ వెల్లువలో మునిగి తన్మయత్వం పొందనున్నాయి. లోహబాధ, దౌర్జన్యం/ అమాయకుల హింసిస్తే/ కసిరగిలే క్షణాలందు/ తూరుపు తెలవారునపుడు/ మదిన మెదిలె యువతరమా.. రమ్ము రమ్ము రారమ్ము అనే కవి పిలుపును వివిధ సంధార్భాల్లో తెలంగాణ యువత అందుకొని విభిన్న తొవ్వల్లో విలువలు పండించింది. అనేక గాయాలతో, అనుభవాలతో ఇప్పుడు యువ తెలంగాణ ఇంకా వివేకవంతంగా మారింది. అందుకే మళ్లీ ఏకతాటిపైకి వచ్చి ఎత్తిపడుతున్నది గులాబీ రగల్ జెండా.
(వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్)
– డాక్టర్ ఆంజనేయ గౌడ్